Begin typing your search above and press return to search.

జగన్ నయా థింకింగ్... 'సీమ' కు గ్రేటర్ రూపు

By:  Tupaki Desk   |   5 Jun 2019 1:44 PM GMT
జగన్ నయా థింకింగ్... సీమ కు గ్రేటర్ రూపు
X
నవ్యాంధ్రప్రదేశ్ కు నూతన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. తాను పుట్టిన, తన పార్టీకి బ్రహ్మరథం పట్టిన రాయలసీమకు ఆయన సరికొత్త అభివృద్ధిని పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం వినిపించిన గ్రేటర్ రాయలసీమ ప్రతిపాదనకు బూజు దులిపిన జగన్... ఇప్పుడు అదే గ్రేటర్ కు సరికొత్త రూపునిస్తూ రాయలసీమను నిజంగానే రతనాల సీమగా మార్చేందుకు పక్కా ప్రణాళికనే రూపొందిస్తున్నారని చెప్పాలి. రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు సీమ తరహా కరువు పరిస్థితులు తాండవిస్తున్న ప్రకాశం జిల్లాను కూడా కలిపేసి గ్రేటర్ రాయలసీమను ఏర్పాటు చేయాలన్న దిశగా జగన్ వడివడిగానే అడుగులు వేస్తున్నారు.

ఉమ్మడి రాష్ట్రంతో పాటు ఇప్పుడు 13 జిల్లాలతో ఏర్పాటైన నవ్యాంధ్రకు అధిక కాలం రాయలసీమకే చెందిన నేతలు సీఎంలుగా వ్యవహరిస్తున్నా... సీమకు పెద్దగా ప్రయోజనమేమీ దక్కలేదు. చంద్రబాబు కూడా సీమ వాసే అయినప్పటికీ.. ఆయన హయాంలో సీమకు ఒరిగిందేమీ లేదనే చెప్పాలి. అయితే అందరిలా తాను కూడా తన సొంత ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశానన్న అపవాదును ఎదుర్కొనేందుకు జగన్ సిద్ధంగా లేరు. ఈ క్రమంలో అధికారంలోకి రాగానే తన ప్రాంతానికి ఏం చేయొచ్చన్న దిశగా ఆలోచన చేసిన జగన్ గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టినట్టుగా సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులతో సుదీర్ఘంగానే చర్చించిన జగన్... గ్రేటర్ రాయలసీమను ఏర్పాటు చేసేందుకే నిర్ణయం తీసుకున్నారట. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినా కూడా గ్రేటర్ రాయలసీమగా ఏర్పాటు చేసే ప్రాంతానికి ఎలాంటి ఇబ్బంది రానీయొద్దన్నది జగన్ భావనగా తెలుస్తోంది.

అయినా గ్రేటర్ రాయలసీమను ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రాంతానికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తారన్న విషయంపై ఇప్పటికైతే స్పష్టత లేకున్నా... జగన్ మాత్రం చాలా క్లియర్ గానే ముందుకు సాగుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరిగా అటు పాలనతో పాటు ఇటు మిగతా అన్ని రంగాలను ఒకే చోట కేంద్రీకరించాలన్న భావనతో విభేదిస్తున్న జగన్... ఇప్పుడు తన పాలనతో పాలన వికేంద్రీకరణకు తప్పనిసరిగా ప్రాధాన్యం ఇచ్చే దిశగా సాగుతున్నారు. ఈ క్రమంలోనే గ్రేటర్ రాయలసీమకు ఓ ప్రత్యేక రూపునిచ్చి... ఆ ప్రాంతంలో ప్రభుత్వానికి సంబంధించిన పలు విభాగాలను ఏర్పాటు చేసి... చివరకు ఏడాదికి ఓ మారైనా అక్కడ అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలని జగన్ భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ చర్యల ద్వారా సీమను మిగిలిన నేతలు నిర్లక్ష్యం చేసినట్లుగా కాకుండా జగన్ బాగానే పట్టించుకుంటున్నారని, త్వరలోనే తమ ప్రాంతం కూడా కరువు కాటకాల నుంచి బయటపడటం ఖాయమేనన్న భావన సీమ వాసుల్లో కలిగించేలా చర్యలు చేపట్టనున్నారట.

గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు ద్వారా బడ్జెట్ లో కొంత మేర నిధులను తప్పనిసరిగా ఆ ప్రాంతానికి కేటాయించేలా కూడా చర్యలు తీసుకునే అవకాశాలు లేకపోలేదు. అంతేకాకుండా... ప్రభుత్వంలోని పలు శాఖల కార్యాలయాలను కూడా అక్కడ ఏర్నాటు చేయడం ద్వారా కూడా జగన్ సీమ వాసుల్లో నెలకొని ఉన్న భయాందోళనలను పారదోలాలని కూడా భావిస్తున్నారట. ఈ చర్యతో సీమ వాసుల్లో భయాందోళనలను పారదోలడమే కాకుండా.... తన పార్టీకి పూర్తిగా మద్దతుగా నిలిచిన సామను తన పార్టీకి పెట్టని కోటగానూ మలచుకునేందుకు జగన్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా గ్రేటర్ రాయలసీమ దిశగా అడుగులు వేస్తున్న జగన్... ఆ ప్రణాళికను పక్కాగానే అమలు చేయడం ద్వారా సీమతో పాటు మిగిలిన రాష్ట్రంలోనూ... ఏ ఒక్క ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయని నేతగా ఎదగనున్నారన్న మాట.