Begin typing your search above and press return to search.

పీఆర్సీ పై జ‌గ‌న్ స‌మీక్ష‌.. ఓ క్లారిటీ వ‌చ్చేనా?

By:  Tupaki Desk   |   28 Dec 2021 6:31 AM GMT
పీఆర్సీ పై జ‌గ‌న్ స‌మీక్ష‌.. ఓ క్లారిటీ వ‌చ్చేనా?
X
11వ పీఆర్సీ అమ‌లు చేయాల‌ని కోరుతూ కొంత‌కాలంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ ఉద్యోగుల ఆందోళ‌న‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వం నుంచి స్ప‌ష్ట‌మైన నిర్ణ‌యం కావాల‌ని నిర‌స‌న‌లు చేస్తూనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ నేడు పీఆర్సీపై కీల‌క స‌మీక్ష చేయ‌నున్నారు. ఇప్ప‌టికే సీఎస్ స‌మీర్ వ‌ర్మ ఆధ్వ‌ర్యంలో ఓ క‌మిటీని ఏర్పాటు చేసి పీఆర్సీపై నివేదిక అందించాల‌ని సీఎం జ‌గ‌న్ ఆదేశించారు. 14.29 ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ నివేదిక‌ను జ‌గ‌న్కు సీఎస్ అందించారు. కానీ ఆ నివేదిక త‌మ‌కు వ్య‌తిరేకంగా ఉందంటూ ఉద్యోగ సంఘాలు ఆందోళ‌న చేప‌ట్టాయి. దీంతో ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్టారెడ్డి, సీఎస్ ఉద్యోగ సంఘాల‌తో ప‌లుమార్లు చ‌ర్చ‌లు జ‌రిపిన ఫ‌లితం లేకుండా పోయింది.

స‌జ్జ‌ల‌, సీఎస్‌తో చ‌ర్చ‌లు స‌ఫ‌లం కాక‌పోవ‌డంతో నేరుగా సీఎం జ‌గ‌న్‌తోనే భేటీ అయేందుకు ఉద్యోగ సంఘాలు ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ నేడు సీఎస్ స‌మీర్‌వ‌ర్మ‌తో పాటు ముఖ్య కార్య‌ద‌ర్శుల‌తో పీఆర్సీపై కీల‌క స‌మీక్ష చేయ‌నున్నారు. ఈ స‌మీక్ష అనంత‌రం పీఆర్సీపై ఓ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. మ‌రోవైపు పీఆర్సీతో స‌హా త‌మ 71 డిమాండ్ల‌ను ప్ర‌భుత్వం తీర్చేవ‌ర‌కూ ఉద్య‌మం సాగుతుంద‌ని ఉద్యోగ సంఘాలు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. పీఆర్సీ ప్ర‌క‌ట‌న‌తో పాటు పీఆర్సీ నివేదిక‌, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌, సీపీఎస్ ర‌ద్దు, హెల్త్ కార్డు త‌దిత‌ర స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని ఉద్యోగులు కొంత కాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు.

పీఆర్సీ ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తూ ఉద్య‌మానికి సిద్ధ‌మైన ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఈ నెల 3న‌ సీఎం జ‌గ‌న్ గుడ్‌న్యూస్ చెప్పారు. ప‌దిరోజుల్లో పీఆర్సీ ప్ర‌క‌టిస్తామ‌న్నారు. కానీ ఆ దిశ‌గా ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు. మ‌రోవైపు త‌మ డిమాండ్ల సాధ‌న కోసం ఆందోళ‌న‌లు చేస్తున్న ఉద్యోగులు పీఆర్సీ విషయంలో ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రిస్తున్నారు. తెలంగాణ‌లో 30 శాతం ఫిట్‌మెంట్ ప్ర‌క‌టించార‌ని ఏపీలో కూడా అంత‌కు త‌గ్గ‌కుండా చూడాల‌ని ఏపీ ఉద్యోగ సంఘాల నేత బండి శ్రీనివాస‌రావు డిమాండ్ చేశారు.