Begin typing your search above and press return to search.

సీఎం కాదు.. అధికారులే ఇచ్చేశారు.. విష‌యం యూట‌ర్న్ బ్రో!!

By:  Tupaki Desk   |   21 Dec 2022 9:30 AM GMT
సీఎం కాదు.. అధికారులే ఇచ్చేశారు.. విష‌యం యూట‌ర్న్ బ్రో!!
X
ఏపీలో కీల‌క కార్య‌క్ర‌మాలు ఏం ప్రారంభించాల‌న్నా.. సీఎం జ‌గ‌న్ బ‌ట‌న్ నొక్కాల్సిందే! ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే.. తాజాగా ఆయ‌న పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని విద్యార్థుల‌కు రాష్ట్ర వ్యాప్తంగా ట్యాబులు పంపిణీ చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకుంది.

ఈ క్ర‌మంలో ముందు.. సీఎం జ‌గ‌న్ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన త‌ర్వాత‌.. రాష్ట్ర వ్యాప్తంగా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు వాటిని విద్యార్థుల‌కు పంపిణీ చేయాల‌ని ఆదేశించారు.

అయితే.. సీఎం ప్రారంభించ‌క‌ముందే.. ఈ ట్యాబుల‌ను మంత్రులు, ఎమ్మెల్యేల‌ను కూడా ప‌క్క‌న పెట్టేసి అధికారులే పంపిణీ చేసేశారు. ఇంకో చిత్రం ఏంటంటే.. లెక్కా ప‌త్రం కూడా లేకుండా.. వీటిని ఎవ‌రొస్తే వారికి ఇచ్చేయ‌డం!! దీంతో అస‌లు విష‌యం యూట‌ర్న్ తీసుకుంద‌నే వాద‌నలు వినిపిస్తున్నాయి.

ఇంత‌కీ ఏం జ‌రిగింద‌టే..బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం ఎడ్లపల్లి.. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వ‌హించే కార్య‌క్ర‌మంలో సీఎం జ‌గ‌న్ స్వ‌యంగా హాజ‌రై.. విద్యార్థుల‌కు ట్యాబులు పంపిణీ చేసే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించాల్సి ఉంది.

అయితే.. ఈ స‌భ అనుకున్న విధంగా ప్రారంభం కాలేదు. ఈ రోజు జ‌గ‌న్ పుట్టిన రోజు కావ‌డంతో టీటీడీ స‌హా.. ప‌లు ప్రార్థ‌నా సంఘాల వారు.. తాడేప‌ల్లికి క్యూ క‌ట్టి ఆశీర్వాదం అందించాయి. ఇక‌, జ‌గ‌న్‌పార్టీ అభిమానులు కూడా వ‌చ్చారు. దీంతో షెడ్యూల్ మారిపోయింది.

మ‌రోవైపు.. ఈ స‌భ‌కు వ‌చ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడ్డారు. సభాస్థలానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే బస్సులు నిలిపివేయడంతో నడవాల్సి వచ్చింది.తీరా దగ్గరలోకి వెళ్లేసరికే.. సభా ప్రాంగణంలో ఖాళీ లేదంటూ.. చాలా మందిని వెనక్కి పంపారు. కొందరు విద్యార్థులకు సీఎం పంపిణీ చేయక ముందే పోలీసు అధికారులు ట్యాబ్‌లు ఇచ్చి పంపేశారు.

స‌భ మాట దేవుడెరుగు.. మాకు ట్యాబ్ ద‌క్కింది చాలంటూ.. విద్యార్థులు ఆనందంతో ఇంటి ముఖం ప‌ట్టారు. మొత్తానికి సీఎం స‌భ బోసిపోయింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.