Begin typing your search above and press return to search.

ధోనితో కలిసి వేదిక పంచుకోబోతున్న సీఎం జగన్ !

By:  Tupaki Desk   |   29 Oct 2021 2:30 AM GMT
ధోనితో కలిసి వేదిక పంచుకోబోతున్న సీఎం జగన్ !
X
ఐపీఎల్ 2021 లో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది. ఐపీఎల్ కేరీర్‌లో ఇప్పటిదాకా నాలుగు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. తాజాగా ముగిసిన  ఐపీఎల్ 2021, సీజన్ 14 టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్‌ మ్యాచ్‌ లో కోల్‌కత నైట్‌ రైడర్స్‌ ను చిత్తు చేసింది. ఛాంపియన్‌గా ఆవిర్భవించినందున చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఫ్రాంఛైజీ- విజయోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది. నిజానికి- నవంబర్‌లో ఘనంగా నిర్వహించాలని భావించింది ఫ్రాంఛైజీ. మూడో వారంలో షెడ్యూల్ చేసింది. కెప్టెన్  ధోనీ అందుబాటులో లేకపోవడం వల్ల డిసెంబర్‌ లో జరపడానికి ప్రణాళికలు రచిస్తోంది.

విరాట్ కోహ్లీ కేప్టెన్సీలో టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌ లో ఆడుతోన్న భారత క్రికెట్ జట్టుకు మెంటార్‌ గా వ్యవహరిస్తున్నాడు ధోనీ. నవంబర్ 17వ తేదీన టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ ముగుస్తుంది. ఆ తరువాత జట్టుతో పాటు ధోనీ కూడా స్వదేశానికి వచ్చేస్తాడు. కుటుంబంతో గడపడానికి ప్రాధాన్యత ఇచ్చినందున  ఆ నెల చివరి వరకూ అతను అందుబాటు ఉండడు. అందుకే- ఈ విజయోత్సవాలను డిసెంబర్‌కు వాయిదా వేసింది చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ. ధోనీ లేకుండా తాము ఈ విజయోత్సవాలను నిర్వహించే ప్రసక్తే లేదని ఇప్పటికే సీఎస్‌కే ముఖ్య కార్యనిర్వహణాధికారి కాశీ విశ్వనాథన్ తేల్చి చెప్పారు.

 డిసెంబర్‌లో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఈ విజయోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి కసరత్తు చేస్తోంది ఫ్రాంఛైజీ. ఈ వేడుకలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ప్రత్యేక ఆహ్వానితుడిగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనడం ఖాయంగా కనిపిస్తోంది. వైఎస్ జగన్‌- చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ ఎన్ శ్రీనివాసన్‌ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ సాన్నిహిత్యంతోనే ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలోనూ ఆయనకు వైఎస్ జగన్ సభ్యత్వాన్ని కల్పించారు. శ్రీనివాసన్‌కు చెందిన ఇండియా సిమెంట్స్‌, వైఎస్ జగన్ కుటుంబానికి చెందిన భారతి సిమెంట్స్ మధ్య వ్యాపార లావాదేవీలు కొనసాగుతున్నాయి.

 వైఎస్ జగన్‌ తో ఉన్న సాన్నిహిత్యంతోనే ఎన్ శ్రీనివాసన్.. చెన్నై సూపర్ కింగ్స్ విజయోత్సవాలకు ఆయనను ఆహ్వానించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విజయోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను అందించడానికి త్వరలోనే ఆయన గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్‌ ను కలవబోతున్నారు. తమిళనాడులో వైఎస్ జగన్‌ కు మాస్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన పేరు మీద చాలాసార్లు, అనేక సందర్భాల్లో బ్యానర్లు వెలిశాయి. పుట్టినరోజు మొదలుకుని.. పలు సందర్భాల్లో ఈ బ్యానర్లు కనిపించాయి. స్టార్ హీరో విజయ్‌ ఫ్యాన్స్ చాలామంది వైఎస్ జగన్‌ను అభిమానిస్తారు. వారంతా పొలిటికల్ స్టార్‌గా అభివర్ణిస్తారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కు ఉన్న ఫాలోయింగ్ కూడా మాములుగా లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత స్టాలిన్ విన్నూతనంగా అభివృద్ధి పనులకి శ్రీకారం చుడుతూ ముందుకుసాగుతున్నారు. ఇక ధోని కి ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనేలేదు. ఈ ముగ్గురు కలిసి వేదికను పంచుకోబోతున్నారు. ఈ వేడుకని చాలా గ్రాండ్ గా నిర్వహించడానికి యాజమాన్యం వ్యూహాలు వేస్తోంది.