Begin typing your search above and press return to search.

'మీరు లేకపోతే నేను లేను' ఇలాంటివెన్నో ఉద్యోగ సంఘాల నేతలతో జగన్

By:  Tupaki Desk   |   6 Feb 2022 3:30 PM GMT
మీరు లేకపోతే నేను లేను ఇలాంటివెన్నో ఉద్యోగ సంఘాల నేతలతో జగన్
X
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తీసుకున్న పీఆర్సీ నిర్ణయంపై ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం.. ప్రభుత్వ తీరుకు నిరసనగా సమ్మె కత్తి దూసిన వైనం తెలిసిందే. ఇలాంటివేళ.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులతో తాజాగా భేటీ అయ్యారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. చలో విజయవాడ పేరుతో ఉద్యోగ సంఘాలు తమ నిరసనను తెలియజేయటానికి బయలుదేరిన వేళ.. పోలీసులతో అణిచివేసే ప్రయత్నం చేసిన వైనాన్ని సోషల్ మీడియా.. వాట్సాప్ గ్రూపుల్లో చూసిన వైనానికి భిన్నంగా సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కీలకంగా మారాయి.

ప్రభుత్వ ఉద్యోగులు లేకపోతే తాను లేనన్న విషయాన్ని ఉద్యోగ సంఘాల భేటీలో మాట్లాడిన మాట ఇప్పుడు సంచలనంగా అందరిని ఆకర్షించేలా మారింది. ‘మీరు లేకపోతే నేను లేను. మీ సహకారంతోనే మంచి చేయగలుగుతున్నా. కరోనా ప్రభావం వల్ల మీరు ఆశించినంత రీతిలో ఇవ్వలేకపోతున్నా’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సూటిగా తాకేలా ఉన్నాయని చెప్పాలి. ఏ మాటకు ఆ మాటే.. ఉద్యోగుల నిరసన సీఎం జగన్ పై ఎంతటి ప్రభావాన్ని చూపిందన్న విషయం తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయని చెప్పాలి.

ఇంతకీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం జగన్ ఏమన్నారు? అన్న విషయాన్ని ఆయన మాటల్లోనే చూస్తే..

- ఎప్పుడైనా మీరు మీ సమస్యలను చెప్పుకోవచ్చు. ఉద్యోగుల సహకారంతో మంచి చేయగలుగుతున్నా. ఆర్థిక పరిస్థితుల వల్ల.. కరోనా ప్రభావంతో మీరు ఆశించినంత రీతిలో ఇవ్వలేకపోవచ్చు. కానీ.. ఎంతమేర మేలు చేయగలుగుతామో అన్నిరకాలుగా చేశాం. ప్రజలకు మంచి చేయటానికి నాలుగు అడుగులు ముందుకు వేయగలుగుతున్నానంటే అందుకు మీరందరూ సహకరించటం వల్లే అది సాధ్యమవుతోంది.

- ఇందులోకి రాజకీయాలు వస్తే వాతావరణం దెబ్బ తింటుంది. రాజకీయాలకు తావు ఉండకూడదు. ఏదైనా సమస్య ఉంటే.. అనామలీస్ కమిటీ కూడా ఉంది. ఎప్పుడైనా మీరు మీ సమస్యలను చెప్పుకోవచ్చు. ఉద్యోగ సమస్యలపై మంత్రుల కమిటీ కొనసాగుతుంది. ప్రభుత్వం అంటే ఉద్యోగులది.. దూరం పోవాల్సిన అవసరం లేదు. సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు.

- ప్రభుత్వ ఉద్యోగుల ఆశించినంత మేర కొన్ని చేయలేకపోయినప్పటికి వారికి ఆ లోటు ఉండకూడదని రిటైర్మెంట్ వయసు పెంచాం. ఎంఐజీ లే అవుట్లలో ప్లాట్లు కేటాయిస్తున్నాం. ఉద్యోగులకు వీలైనంత మంది చేయాలన్నదే నా తపన. మిమ్మల్ని సంతోషంగా చూడటం నాకు సంతోషాన్నిస్తుంది. ఈ ప్రభుత్వం మీది. మీ సహకారం వల్లనే ప్రజలకు.. రాష్ట్రానికి ఈ మాత్రం మేలు చేయగలుగుతున్నా. మనసా వాచా కర్మణా మీకు ఎంత మేలు చేయగలనో అంత మేలు చేస్తా. ప్రభుత్వ ఉద్యోగుల సహకారంతోనే మంచి చేయగలుగుతున్నాను. ఈ ప్రభుత్వం మీది.

- ఐఆర్‌ ఇచ్చిన 30 నెలల కాలానికి.. 9 నెలల ఐఆర్‌ను సర్దుబాటు నుంచి మినహాయింపు వల్ల రూ.5400 కోట్ల భారం పడుతోంది. హెచ్ఆర్ఏ రూపంలో అదనంగామరో రూ.325 కోట్లు భారం పడుతోంది. అదనంగా భారం పడేది కాకుండా రికరింగ్‌ వ్యయం రూపేణా హెచ్ఆర్ఏ వల్ల రూ.800 కోట్లు, అడిషనల్‌ క్వాంటమ్‌ పెన్షన్, సీసీఏ రూపంలో మొత్తంగా రూ.1330 కోట్లు భారం పడుతోంది. మొత్తంగా రూ.11,500 కోట్లు రికరింగ్‌గా భారం పడుతోంది

- రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా.. మీరు ఈ ప్రతిపాదనలకు అంగీకరించినందుకు ధన్యవాదాలు. ఈ పరిస్థితులు ఈ మారిదిగా ఉండకపోయి ఉంటే.. మీరందర్నీ మరింత సంతోషపెట్టేవాడిని. మినిమం టైం స్కేలు వర్తింపు చేశాం. అన్ని రకాలుగా ఆయా జీతాలు పెంచాం.

- నేను మనస్ఫూర్తిగా నమ్మేది ఒక్కటే. మీరు లేకపోతే నేను లేను. పారదర్శకంగా, అవినీతి లేకుండా బటన్‌ నొక్కి ప్రజలకు ఇవ్వగలుగుతున్నాను. ఇది మీ వల్లే సాధ్యపడుతోంది. భావోద్వేగాలకు పెద్దగా తావు ఇవ్వకండి.

- కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నాం. దీనిపై ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నాం. 30 వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇస్తున్నాం. సబ్జెక్టుల వారీగా టీచర్లను తీసుకువస్తున్నాం.

- కాంట్రాక్టు ఉద్యోగుల అంశంలో రోస్టర్ పద్దతి ప్రకారం చర్యలు చేపడతాం. దీనిపై ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. సుమారు 30 వేల మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి ఇస్తున్నాం. ప్రభుత్వం చాలా సానుకూల ద్రక్ఫథంతో ముందుకు వెళుతోంది. భవిష్యత్తులో ఆ ఫలాలు వస్తాయి.