Begin typing your search above and press return to search.

టీం మొత్తాన్ని జగన్ ఔట్ చేయనున్నారా?

By:  Tupaki Desk   |   19 Aug 2021 8:31 AM GMT
టీం మొత్తాన్ని జగన్ ఔట్ చేయనున్నారా?
X
ఐదేళ్ల పదవీ కాలంలో సగం దగ్గర దగ్గర పూర్తైంది. దీంతో ఏపీ మంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. విద్యార్థులకు వార్షిక పరీక్షల వేళలో.. ఎంత టెన్షన్ తో ఉంటారో.. ఇప్పుడు అంతకు మించిన ఉత్కంఠతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీనికి కారణం తమ అధినేత కమ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ రీతిలో ఉంటుందన్నది ఇప్పుడు వారికి అర్థం కాక సతమతమవుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకొని ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వేళలో.. తన కేబినెట్ కు సంబంధించిన సంచలన నిర్ణయాన్ని వెల్లడించటం తెలిసిందే. తన ఐదేళ్ల పదవీకాలంలో సగమైన రెండున్నరేళ్లకు మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని చెప్పటం తెలిసిందే.

పని చేయని వారిపై వేటు పక్కా అని.. వారి స్థానే కొత్త వారికి చోటు కల్పిస్తామని పేర్కొన్నారు. జగన్ చెప్పినట్లే రెండున్నరేళ్ల గడువుకు సమయం దగ్గరకు వచ్చేస్తోంది. విలువైన ఈ కాలంలో ఏడాదిన్నర పాటు కరోనాతోనే కిందా మీదా పడిపోయిన పరిస్థితి. ప్రభుత్వమే ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో.. మంత్రులు తమను తాము నిరూపించుకోవటానికి ఏం చేయాలో పాలు పోని పరిస్థితి. కరోనా కారణంగా ప్రత్యేక పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. తమ పని తీరుతో సంబంధం లేకుండా పరిణామాలు చోటు చేసుకున్నాయని.. ఈ కారణంతో తాము చేయాల్సినంత చేయలేకపోయినట్లుగా మంత్రులు పలువురు వాపోతున్నారు.

ముఖ్యమంత్రి చెప్పిన గడువుకు మరో మూడు నెలల సమయం ఉంది. దీంతో వేటు వేసే విషయంపై కసరత్తు ఇప్పటికే మొదలైందన్న మాట వినిపిస్తోంది. ఎవరెన్ని చెప్పినా జగన్ ఈ విషయంలో మనసు మార్చుకోవటం ఉండదని.. కొత్త టీంతోనే 2024 ఎన్నికలకు వెళతారన్న మాట బలంగా వినిపిస్తోంది. మంత్రివర్గ మార్పు ఏ రీతిలో ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా రెండు బలమైన వాదనలు వినిపిస్తున్నాయి.

ఇందులో ఒక వాదన ప్రకారం ముందు నుంచి అనుకుంటున్నట్లుగా పలువురు పని చేయని మంత్రులుగా ఇమేజ్ ఉన్న వారిని పక్కకు పెట్టేసి.. కొత్త వారికి అవకాశం ఇవ్వటం. మొత్తం మంత్రుల్లో 80 నుంచి 90 శాతం వరకు మార్చే వీలుందన్న మాట వినిపిస్తోంది. రెండో విధానంలో మాత్రం గతంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఎన్టీఆర్ మాదిరి.. ఒక్క కలంపోటుతో కేబినెట్ లోని మంత్రులందరిపై వేటు వేసి.. మళ్లీ కొత్త కాబినెట్ కొలువు తీరేలా చేయటం. ఈ రెండింటిలో దేని వైపు ఆయన మొగ్గు చూపుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ప్రస్తుతం ఉన్న కేబినెట్ మాదిరే కొత్త కేబినెట్ లోనూ సమీకరణాల్ని పాటిస్తారా? అన్నది ప్రశ్నగా మారింది.

ఊహించని విధంగా ఐదుగురు ఉప ముఖ్యమంత్రులతో కేబినెట్ కు రూపుకల్పన చేసిన జగన్.. పదవుల పంపకం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేలకు జోడు పదవులు ఉండవని చెప్పి.. ఆ పని చేసిన తీరు చేసిన తీరు చూస్తే.. కేబినెట్ మార్పు ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్లు కొందరికి పదవులు దక్కని నేపథ్యంలో.. ఈసారైనా ఆ కొరతను తీరుస్తారా? అన్నది ఇప్పుడు చర్చగా మారింది. కొత్త టీంతో ఎన్నికలకు సిద్ధం కావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు సీనియర్లను పార్టీ బాధ్యతలు అప్పజెప్పే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటివరకు మంత్రుల్లో మెజార్టీ మార్పు ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న వేళ.. అందుకు భిన్నంగా కొత్త మాట ఇప్పుడు చర్చగా వినిపిస్తోంది. ఎక్కువ మందిని మార్చి.. కొందరిని ఉంచటం ద్వారా అసమ్మతిని పెంచి పోషించినట్లు అవుతుందని.. అందుకే.. మొత్తం కేబినెట్ ను పక్కన పెట్టేసి.. ఫ్రెష్ గా నియమిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నట్లు చెబుతున్నారు. కొత్త జట్టులో సీనియర్లకు.. పార్టీలో మొదట్నించి ఉండి.. పాలనా అనుభవం ఉన్న వారికి బాధ్యతలు అప్పజెబితే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే.. ఇప్పుడున్న మంత్రివర్గంపై ఉన్న విమర్శల్ని సైతం తగ్గించే వీలుంటుందన్న మాట వినిపిస్తోంది.

కొందరిని మార్చి మరికొందరిని మార్చకుండా చేస్తే నెగిటివ్ ఇమేజ్ బిల్డ్ అయ్యే వీలుందని.. అందుకే మొత్తాన్నిమార్చేస్తే.. పదవుల్ని అందరికి ఇచ్చే క్రమంలో తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయంగా మారుతుందని చెబుతున్నారు. ఇదే జరిగితే.. ప్రభుత్వంపై సానుకూలత పెరిగే వీలుందని అంచనా వేస్తున్నారు. తాజాగా తెర మీదకు వచ్చిన కొత్త చర్చకు తగ్గట్లే.. మొత్తం టీంను మార్చేసి.. కొత్త వారిని ఎంపిక చేసినట్లైయితే.. సామాజిక సమీకరణల విషయంలో మాత్రం మార్పు ఉండదని.. అదే రీతిలో ఆయా వర్గాలకు చెందిన వారికి పదవులు అప్పజెబుతారంటున్నారు.