Begin typing your search above and press return to search.

అంబులెన్స్ కోసం సీఎం జగన్ కాన్వాయ్ పక్కకు వెళ్లింది

By:  Tupaki Desk   |   16 April 2022 3:52 AM GMT
అంబులెన్స్ కోసం సీఎం జగన్ కాన్వాయ్ పక్కకు వెళ్లింది
X
మాటలు చెప్పటం వేరు.. మానవత్వాన్ని ప్రదర్శించటం వేరు. తాజా ఉదంతం చూస్తే.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు ఎలా ఉంటుందో ఇట్టే అర్థమవుతుంది. కాన్వాయ్ వెళుతున్న వేళ.. వేగంగా వెళుతున్న అంబులెన్సు కోసం.. తన వాహన శ్రేణిని పక్కకు తీసుకెళ్లాలన్న ఆదేశాన్ని ఇచ్చిన తీరు పలువురి అభినందల్ని అందుకుంటోంది.

భారీ ఎత్తున ఉండే సీఎం కాన్వాయ్ ను పక్కకు తీసుకెళ్లేలా చేయటం.. అంబులెన్సుకు దారి ఇవ్వటం.. దీనంతటికి కారణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం కావటం విశేషం. అసలేం జరిగిందంటే..

కడప జిల్లాలోని ఒంటిమిట్ట సీతారాముల కల్యాణ మహోత్సవ వేడుకులకు హాజరయ్యేందుకు శుక్రవారం సీఎం జగన్ రావటం తెలిసిందే. కడప ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గంలో సీఎం కాన్వాయ్ వెళుతోంది.

ఇలాంటి వేళ.. వైఎస్సార్ సర్కిల్ వద్ద ఒక అంబులెన్సు వెనుకకు వచ్చింది. అంబులెన్సు సైరన్ విన్నంతనే.. ఆ వాహనానికి దారి ఇవ్వాలంటూ ఆదేశాలు ఇచ్చారు సీఎం జగన్.

అంతేకాదు.. తమ వాహన శ్రేణిని ఆపేసి.. అంబులెన్సు వెళ్లేందుకు దారి ఇచ్చి.. వాహనం వెళ్లిన తర్వాత తన కాన్వాయ్ ను ముందుకు కదిలించారు. అనంతరం ఒంటిమిట్టకు చేరుకొని కోదండ రాముని కల్యాణ్ మహోత్సవ వేడుకలకు హాజరయ్యారు.

ఏమైనా తన వాహన శ్రేణి కారణంగా ఎవరూ ఇబ్బందిపడకూడదని.. అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగొద్దన్న సీఎం జగన్ తీరును పలువురు అభినందిస్తున్నారు.