Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఇవాళ అర్ధ‌రాత్రి సృష్టించే రికార్డ్ ఏంటంటే...

By:  Tupaki Desk   |   31 Dec 2017 9:53 AM GMT
కేసీఆర్ ఇవాళ అర్ధ‌రాత్రి సృష్టించే రికార్డ్ ఏంటంటే...
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఖాతాలో ఇవాళ అర్ధ‌రాత్రి కొత్త రికార్డ్ న‌మోదు కానుంద‌ని ఇటు టీఆర్ ఎస్ పార్టీ వ‌ర్గాలు..అటు తెలంగాణ అధికార వ‌ర్గాల్లో చ‌ర్చ‌ జ‌రుగుతోంది. అది కూడా దేశంలో మ‌రెవ‌రికీ లేని విధంగా మొట్ట‌మొద‌టి రికార్డ్ కానుంద‌ని అంటున్నారు. ఇదంతా రైతుల కోణంలో కావ‌డం విశేషం. ఇంత‌కీ ఏంటా రికార్డ్‌...ఏంటా క‌థ అంటే...వ్యవసాయానికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్‌ ను ఇవ్వడం.

దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ మొట్ట మొదటిసారిగా రైతాంగానికి నిరంతరం ఉచితంగా విద్యుత్ సరఫరాను నూతన సంవత్సర కానుకగా అమలు చేస్తోంది. 2018 కొత్త సంవత్సరం ప్రారంభమైన క్షణాన్నే ముహూర్తంగా నిర్ణయించారు. జనవరి 1వ తేదీలోకి అడుగుపెట్టిన మొదటి నిమిషం నుంచి నిరంతర విద్యుత్ సరఫరా ప్రారంభమవుతుంది. కొత్త సంవత్సరం పూట రైతుల జీవితాల్లో ఆనందాల వెలుగులు విరజిమ్మాలన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు సంకల్పం సాకారమవుతుంది. 24 గంటల విద్యుత్ సరఫరాకు ఎలాంటి అవాంతరాలు రాకుండా ముందుగానే అన్ని రకాల ప్రయోగాలు నిర్వహించి, లోపాలను సరిదిద్దుకొని - రాష్ట్ర విద్యుత్ సంస్థలు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తిచేశాయి. ఈ ఘ‌న‌త కేసీఆర్ రైతు బాంధ‌వుడ‌నే గుర్తింపును అందిస్తుంద‌ని అంటున్నారు.

2017 డిసెంబ‌ర్ 31 ఆదివారం అర్ధరాత్రి 12.01 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు 24 గంటల విద్యుత్‌ ను ఉచితంగా అందించేందుకు వీలుగా ట్రాన్స్‌ కో - జెన్‌ కో - ఎస్‌ పీడీసీఎల్ - ఎన్‌ పీడీసీఎల్ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం సమీక్షిస్తున్నారు. ఇందుకోసం సుమారు 7500 మెగావాట్ల విద్యుత్ అవసరమని అంచనా వేశారు. వచ్చే యాసంగిలో (మార్చి-ఏప్రిల్) డిమాండ్ పెరిగే ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే అటు సీఎం కేసీఆర్ - ట్రాన్స్‌ కో సీఎండీ ప్రభాకర్‌ రావు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సమీక్షిస్తూ.. పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ట్రాన్స్‌ కో నుంచి వచ్చే సూచనల ప్రకారం క్షేత్రస్థాయిలో విద్యుత్ సిబ్బంది - అధికారులు - ఇంజినీర్లు పర్యటిస్తూ.. పర్యవేక్షిస్తున్నారు. ఉచిత విద్యుత్ సరఫరా ప్రారంభమయ్యాక ట్రాన్స్‌ కో - ఎస్‌ పీడీసీఎల్ - ఎన్‌ పీడీసీఎల్ ఉన్నతాధికారులు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కనెక్షన్లను - సబ్ స్టేషన్లను సందర్శించి - విద్యుత్ శాఖల సిబ్బంది - అధికారులతోపాటు - అందుబాటును బట్టి రైతులతోనూ మాట్లాడుతారు.

అన్నింటికంటే..ముఖ్యంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ రికార్డును స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తుండ‌టం విశేషం. ఈ కార్య‌క్ర‌మంలో ఎలాంటి లోటుపాట్లు త‌లెత్త‌కుండా చూడాల‌ని ఆయ‌న స్వ‌యంగా అధికారుల‌ను ఆదేశిస్తుండ‌టం గ‌మ‌నార్హం.