Begin typing your search above and press return to search.

రైతు లక్ష్మీ..కేసీఆర్ కొత్త ప‌థకం పేరు

By:  Tupaki Desk   |   10 March 2018 5:12 AM GMT
రైతు లక్ష్మీ..కేసీఆర్ కొత్త ప‌థకం పేరు
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మ‌రో ప‌థ‌కాన్ని తెర‌మీద‌కు తీసుకువ‌స్తున్నారు. అన్న‌దాత‌ల సంక్షేమం కోసం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న కేసీఆర్ ఆ ప‌థ‌కానికి పేరు కూడా ఖ‌రారు చేశారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున అమలు చేయనున్న పెట్టుబడి పథకానికి 'రైతులక్ష్మీ' అని నామకరణం చేశారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ఆమోదం తెలిపినట్లు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడనున్నాయని స‌మాచారం.

మ‌రోవైపు ఈ ప్రాజెక్టుకు ప‌లు సాంకేతిక అవ‌రోధాలు త‌లెత్తుతున్న‌ట్లు స‌మాచారం. చెక్కుల పంపిణీలో ఇబ్బందులు ఉన్న‌ట్లు గ‌మ‌నించార‌ని తెలుస్తోంది. చెక్కుల ముద్రణలో ఎక్కువ వరకు భారతీయ స్టేట్‌ బ్యాంకు - ఆంధ్రాబ్యాంకులవే కనుక పది లక్షల కంటే ఎక్కువ చెక్కులను ముద్రించాల్సి వస్తున్నందున సాంకేతిక (సాఫ్ట్‌ వేర్‌) ఇబ్బందుల దృష్ట్యా వ్యవసాయశాఖ కమిషనర్‌ ఒకటి కంటే ఎక్కువ ఖాతాలను తెరవాల్సి ఉంటుంది. ప్రతి చెక్కు మీద కేవలం ఆరు అంకెల నెంబర్లు మాత్రమే ముద్రించడం సాధ్యమవుతున్నందువల్ల గరిష్టంగా ఒక ఖాతా పేరుతో 9,99,999 చెక్కులను మాత్రమే జారీ చేయడం సాధ్యం కనుక ఈ పరిమితులను దష్టిలో పెట్టుకుని ఒకటికంటే ఎక్కువ ఖాతాలను తెరవాల్సి వస్తుందని బ్యాంకుల ప్రతినిధులు వివరించారని స‌మాచారం.

ఈ పథకం కింద ఇచ్చే సాయం ఒకవేళ రూ. 50 వేలు దాటినట్లయితే రెండో చెక్కు ఇవ్వాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఒక చెక్కుపై పేర్కొనే మొత్తం రూ. 49,999కు మించి ఉండొద్దని నిర్ణయించింది. లబ్ధ్దిదారుల భూవిస్తీర్ణం ఎక్కువగా ఉండి, ఇంతకంటే ఎక్కువ సాయం అందుకోవాల్సి వస్తే మరో చెక్కు రూపంలో ఉంటుంది. వచ్చే నెల 20వ తేదీన చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి, మే 15 వరకు మూడు దశల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే లబ్దిదారుల వివరాలను సీసీఎల్‌ఏ సిద్ధం చేస్తున్నందున వారికి ఉన్న భూమినిబట్టి ప్రభుత్వం చెక్కు రూపంలో ఎంత సాయం చేయాలనేదానిపై వ్యవసాయ శాఖ లెక్కలు సిద్ధం చేస్తుంది. సుమారు 71 లక్షల కంటే ఎక్కువ మంది లబ్ధి దారులు ఉంటున్నందువల్ల వారి వివరాలన్నింటినీ శుక్రవారం సాయంత్రంకల్లా సీసీఎల్‌ఏ అందజేయాల్సి ఉంటుందని, ఆ వివరాల మేరకు బ్యాంకులు చెక్కుల ముద్రణను ప్రారంభించాల్సి ఉంటుందని స‌మాచారం.

రైౖతులకు ఇస్తున్న చెక్కుల్లో తప్పులు దొర్లినా, భూమి లెక్కల ప్రకారం సాయం అందకపోయినా, ఇతర పిర్యాదులున్నా పరిష్కారం కొరకు వ్యవసాయ శాఖ మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక యంత్రాంగాన్ని సిద్దం చేస్తోంది. రైతుల నుంచి అందిన ఫిర్యాదులను 30 రోజుల్లోగా పరిష్కరించే విధంగా ఇప్పటికే రూపకల్పన జరిగినట్లు తెలిసింది. భూ రికార్డుల వివరాల అవసరాన్ని బట్టి అందించడానికి ఈ ప్రత్యేక వ్యవస్థ రెవిన్యూ విభాగంతో సమన్వయం చేసేలా ఆదేశాలు జారీ అయ్యాయి. ఆరు జాతీయ బ్యాంకులతో పాటు రెండు ప్రాంతీయ బ్యాంకులకు సైతం చెక్కుల ముద్రణ బాధ్యతలను అప్పజెప్పిన ప్రభుత్వం వచ్చే నెల 19 వరకు తొలి విడత చెక్కులు సిద్ధం కావాలని బ్యాంకులకు వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. చెక్కులను ముద్రిస్తున్న ఆరు బ్యాంకుల్లో 'వ్యవసాయ శాఖ కమిషనర్‌' పేరుతో ఖాతాలను తెరవాలని, జిల్లాలవారీగా అవసరం లేదని రెండు రోజుల క్రితం జరిగిన బ్యాంకర్ల కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది.