Begin typing your search above and press return to search.

కేసీఆర్ మాటే గ‌ద్ద‌ర్ మాట‌... మొక్కులు చెల్లించుకున్న గ‌ద్ద‌ర్‌

By:  Tupaki Desk   |   12 Feb 2022 12:30 AM GMT
కేసీఆర్ మాటే గ‌ద్ద‌ర్ మాట‌... మొక్కులు చెల్లించుకున్న గ‌ద్ద‌ర్‌
X
గ‌ద్ద‌ర్‌...తెలంగాణ ప్ర‌జా క‌వి. వామ‌ప‌క్ష భావ‌జాలంతో పాపుల‌ర్ అయిన గ‌ద్ద‌ర్ గ‌త కొద్దికాలంగా దానికి దూర‌మ‌యిన‌ట్లు క‌నిపించ‌డ‌మే కాకుండా ఆధ్యాత్మిక‌త బాట‌లో న‌డుస్తున్నారు. గతంలో యాదాద్రి అభివృద్ధి గురించి చేసిన కామెంట్లు, ఇటీవ‌ల ముచ్చింత‌ల్‌లోని స‌మ‌తామూర్తి విగ్ర‌హాన్ని సంద‌ర్శించుకోవ‌డం దీనికి తార్కాణం. వీటికి కొన‌సాగింపుగా తాజాగా ములుగు జిల్లా తాడ్వాయి మండలం శ్రీ సమ్మక్క సారలమ్మలను గద్దర్‌ దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ త‌నదైన శైలిలో పాట రూపంలో సమ్మక్కకు మొక్కలు చెల్లించిన విధానాన్ని వివరించారు. ఈ సంద‌ర్భంగా గ‌ద్ద‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఇటీవల రాజ్యసభలో ప్రధాని మోడీ తెలంగాణ ఏర్పాటుపై చేసిన విమర్శలపై గ‌ద్ద‌ర్ స్పందిస్తూ మోడీ వ్యాఖ్యలపై చర్చించాల్సిందేనని వెల్లడించారు. తెలంగాణ ఏర్పాటు అనేది ఒక త్యాగాల నినాదమని, త్యాగాల స్ఫూర్తితో ఏర్పడిన రాష్ట్రంపై ఎంతటి వారు విమర్శలు చేసినా చర్చించాల్సిన అవసరం ఉందని గద్దర్ తెలిపారు. తెలంగాణపై కుట్రలు చేసే ప్రయత్నాలను తిప్పికొట్టాలన్నారు. సమ్మక్క-సారలమ్మల పోరాట స్ఫూర్తితో, అనేకమంది త్యాగాలతో ఏర్పడిన తెలంగాణపై కుట్రలు చేసే ప్రయత్నాలను తిప్పికొట్టాలని ప్రజా కవి అన్నారు. నీళ్లు, వనరులు, నిధులు సాధించుకుని తెలంగాణ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు.

రాజ్య‌స‌భ‌లో ప్ర‌ధాని చేసిన కామెంట్ల‌కు టీఆర్ఎస్ నేత‌లు గ‌ట్టి కౌంట‌ర్ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. మోడీ వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ గా గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు ఆందోళ‌న‌లు కొన‌సాగిస్తున్నారు. ఏకంగా పార్లమెంటు స‌మావేశాల‌ను సైతం బాయ్ కాట్ చేశారు. ఈ ఆందోళ‌న‌ల ద్వారా తెలంగాణ సెంటిమెంట్‌ను మ‌ళ్లీ త‌మ పార్టీకి అనుకూలంగా మార్చుకునేందుకు టీఆర్ఎస్ ప్ర‌య‌త్నిస్తోంద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ఇదే స‌మ‌యంలో టీఆర్ఎస్ ఎత్తుగ‌డ‌ల‌కు మ‌ద్ద‌తుగా గ‌ద్ద‌ర్ వ్యాఖ్య‌లు ఉండ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.