Begin typing your search above and press return to search.

కులం కార్డుపై కేసీఆర్ కామెంట్ అదిరిందే!

By:  Tupaki Desk   |   6 Oct 2017 12:41 PM GMT
కులం కార్డుపై కేసీఆర్ కామెంట్ అదిరిందే!
X
సింగ‌రేణి కాల‌రీస్ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిక‌లు ముగియ‌డం - ఆ ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ అనుబంధ కార్మిక సంఘం తెలంగాణ బొగ్గుగ‌ని కార్మిక సంఘం (కేజీబీకేఎస్‌) అఖండ విజ‌యం సాధించిన వైనంపై ఆ పార్టీ అధినేత‌ - తెలంగాణ సీఎం కేసీఆర్ ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. కాసేప‌టి క్రితం హైద‌రాబాదులోని త‌న అధికారిక నివాసం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ లో మీడియా స‌మావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్‌... త‌మ పార్టీకి ఓట్లేసిన కార్మికుల‌కు కృతజ్ఞతలు చెప్ప‌డంతో పాటుగా త‌మ‌పై పోటీకి దిగిన విప‌క్షాల‌ను క‌డిగిపారేశారు. ఈ స‌మావేశంలో కేసీఆర్‌... టీ కాంగ్రెస్ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డిని ల‌క్ష్యంగా చేసుకుని కామెంట్లు చేసిన సంద‌ర్భంగా త‌న కులాన్ని కూడా ప్ర‌స్తావించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అస‌లు ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తున్నట్లుగా త‌మ‌ది దొర‌ల కుటుంబం కాద‌ని, త‌మ కులం తెలంగాణ‌లో మైనారిటీ కుల‌మేన‌ని చెప్పిన కేసీఆర్‌... ప్ర‌తిప‌క్షాల నోటికి దాదాపుగా తాళాలేశార‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది.

అయినా కేసీఆర్ స‌ద‌రు మీడియా స‌మావేశంలో ఏమ‌న్నార‌న్న విష‌యానికి వ‌స్తే... *తెలంగాణ బాగు కోసం నిరంతరం కష్టపడుతోన్నది ఒక్క టీఆర్‌ ఎస్‌ పార్టీనే. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టిన మాపై అవాస్తవాలు ప్రచారం చేయడం దారుణం. భూముల సర్వేలాంటి మంచి పనిని సైతం వ్యతిరేకిస్తున్నారంటేనే ప్రతిపక్షాల బుద్ధి ఏమిటో అర్థమవుతుంది. రైతు సమితులపైనా దుష్ప్రచారం చేస్తున్నరు. దానివల్ల స్థానిక సంస్థల ప్రతిపత్తి దెబ్బతింటుందని అర్థంలేని మాటలు మాట్లాడుతున్నరు. ఎవరు ఎన్ని పొడబొబ్బలు పెట్టినా మేం ముందుకే వెళతాం. సింగరేణి ఎన్నికల్లో జాతీయ నాయకులు వచ్చి ప్రచారం చేసినా మా విజయాన్ని అడ్డుకోలేకపోయారు* అని కేసీఆర్ విప‌క్షాల‌పై త‌న‌దైన శైలిలో ఫైరైపోయారు.

*సింగరేణి ఎన్నికల సందర్భంలో వారసత్వ ఉద్యోగాల పేరుతో కొంత మంది యువకులు ముఖ్యమంత్రి - మంత్రులపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. ప్రతిపక్షనేతలు కూడా నోటికొచ్చిన కూతలు కూస్తున్నారు. వాళ్లు ఏమంటున్నారు.. నేను దొరనా? దొర అంటే ఎవరో తెలుసా? మా ఇల్లు గడీ లెక్క ఉంటదా? అసలు తెలంగాణలో ఇయ్యాల దొర ఎవరైన ఉన్నరంటే అది ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఒక్కరే. ఆయన ఇల్లు పెద్ద గడీ. నిజానికి మా కులం ఇక్కడ మైనారిటీ కమ్యూనిటీ. తెలంగాణ జనాభలో కేవలం 1.1 శాతం మాత్రమే మా కులస్తులు ఉన్నారు* అంటూ కేసీఆర్ త‌న‌దైన రేంజిలో విరుచుకుప‌డ్డారు. మ‌రి ఈ కామెంట్ల‌పై అటూ టీ కాంగ్రెస్ నేత‌ల‌తో పాటు టీడీపీ నేత‌లు - వామ‌ప‌క్షాల నేత‌లు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.