Begin typing your search above and press return to search.

మోడీ శిశుపాలుడు.. కేసీఆర్ ఎవరు?

By:  Tupaki Desk   |   19 May 2020 5:00 AM GMT
మోడీ శిశుపాలుడు.. కేసీఆర్ ఎవరు?
X
గతంలో ఎప్పుడూ లేని రీతిలో గడిచిన రెండున్నర నెలల వ్యవధిలో పెద్ద ఎత్తున మీడియా సమావేశాల్ని నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సందర్భంగా ఆయన నోట చాలానే ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి. ఇందులో భాగంగా ప్రధాని మోడీని ఆకాశానికి ఎత్తేయటం తెలిసిందే. దేశం ఎదుర్కొంటున్నప్రత్యేక పరిస్థితుల వేళ.. ప్రధానమంత్రిని ఉద్దేశించి అలాంటి పోస్టులు పెడతారా? అంటూ సోషల్ మీడియాలోని పోస్టుల్ని ప్రస్తావిస్తూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

తాను చెప్పే మాటల్ని తానే మర్చిపోయే మంచి గుణం కూడా సీఎం కేసీఆర్ కు కాస్త ఎక్కువేనన్న విమర్శను రాజకీయ వర్గాలు ప్రస్తావిస్తుంటాయి. తాజాగా కూడా అలాంటిదే జరిగి ఉంటుందని చెబుతున్నారు. ఆ మధ్యన ప్రధాని మోడీపై ఫన్నీగా సోషల్ మీడియాలో పోస్టు చేస్తే.. దాన్ని తీవ్రంగా తప్పు పట్టటమే కాదు.. ఆయన దేశ ప్రధాని అండి.అలాంటి చిల్లర పోస్టులు ఎలా పెడతారండి? అంటూ ఫైర్ అయ్యారు. అలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఇన్ని మాటలు చెప్పిన సీఎం కేసీఆర్ నోటి నుంచి అనూహ్య వ్యాఖ్యలు వెలువడ్డాయి. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన సాయంతో పాటు.. తెలంగాణ రాష్ట్రం కోరుకున్నట్లుగా పరిణామాలు చోటు చేసుకోకపోవటంపై ఉడికిపోతున్న కేసీఆర్.. కేంద్రంపై అనూహ్య వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ప్యాకేజీ బాగోలేదన్న ఆయన.. రాష్ట్రాల అధికారాల్ని చేజిక్కించుకునే దిశగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రయత్నిస్తోందన్నారు.

ఈ క్రమంలో కేంద్రం వైఖరిపై ఇతర రాష్ట్రాల మద్దతును కేసీఆర్ కూడగడతారా? అన్న సందేహానికి ఆయన తనదైన శైలిలో సమాధానమిచ్చారు. శిశుపాలుడిని వంద తప్పులు మన్నించిన్ను కదా? పాపం పండాలి కదా? చూస్తారుగా? అంటూ ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు విస్మయానికి గురి చేస్తున్నాయి. ఎంత కోపం ఉంటే మాత్రం.. మోడీ సర్కారును శిశుపాలుడితో పోల్చటాన్ని కమలనాథులు కస్సుమంటున్నారు. కేంద్రం..రాష్ట్రాల మధ్య సవాలచ్చ పంచాయితీలు ఉండొచ్చు. అంతమాత్రం చేతనే శిశుపాలుడు లాంటి రాక్షసుడితో పోల్చటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇష్టమైనప్పుడు పొగడటం.. ఏ మాత్రం తేడా వచ్చినా విరుచుకుపడటం లాంటివి సారుకు మాత్రమే సాధ్యమవుతాయి.