Begin typing your search above and press return to search.

కేసీఆర్ ప్రతాపం.. సీతారాం విలాపం..

By:  Tupaki Desk   |   22 March 2019 4:29 AM GMT
కేసీఆర్ ప్రతాపం.. సీతారాం విలాపం..
X
టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థుల ఎంపికలో చాలా మందికి షాక్ ఇచ్చారు. ఆశించిన వారు - పలువురు సిట్టింగ్ లను పక్కనపెట్టి కొత్తవారికి టికెట్లు ఇచ్చారు. తాజాగా ప్రకటించిన జాబితాలో టీఆర్ ఎస్ పార్లమెంటరీ పక్ష నేతగా వ్యవహరించిన మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డితోపాటు మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ కు కేసీఆర్ ఊహించని షాక్ ఇచ్చారు. వారిద్దరికీ టికెట్ నిరాకరించి కొత్త వారికి ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ టికెట్ కన్ఫం అనుకున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన ప్రొఫెసర్ కావడంతో ఈయనకు అన్ని రంగాల్లో పట్టు ఉంది. కానీ టికెట్ ఇవ్వకుండా మాజీ మంత్రి రెడ్యానాయక్ కుమార్తె మాలోతు కవితకు కేసీఆర్ ఎంపీ టికెట్ కేటాయించారు. దీంతో సీతారాం నాయక్ కు ఏం చేయాలో దిక్కుతోచని స్థితి నెలకొంది. ఎంపీ పనితీరు పట్ల స్థానిక ఎమ్మెల్యేలు - నేతల అసంతృప్తియే ఆయనకు టికెట్ రాకపోవడానికి కారణంగా తెలుస్తోంది.

2014లో ఎవరూ ఊహించని విధంగా వరంగల్ కేయూ ప్రొఫెసర్ గా చేసిన సీతారాం నాయక్ కు టీఆర్ ఎస్ టికెట్ ఇచ్చింది. ఆయన బలమైన కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ పై విజయం సాధించారు. అయితే స్థానిక పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండకపోవడంతో వారిలో తీవ్ర అసంతృప్తి నెలకొంది.

సీతారాం నాయక్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డట్టు అధిష్టానానికి సమాచారం అందింది. ఎంపీ విశ్వేశ్వరరెడ్డితోపాటు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సీతారాం నాయక్ రెడీ అయ్యారట.. కానీ ఆ తర్వాత పరిణామాలతో టీఆర్ ఎస్ ను వీడేది లేదని తన మీద కాంగ్రెస్ నాయకులు బురద జల్లారని ప్రచారాన్ని ఖండించారు.

ఈ నేపథ్యంలోనే కేసీఆర్ దీనిపై ఫోకస్ చేసినట్లు తెలిసింది. సీతారాం నాయక్ పనితీరుపై ఎమ్మెల్యేలు - పార్టీ నాయకత్వాన్ని ఆరాతీశారు. సమన్వయం లేకపోవడం.. చరుకుదనం లేకపోవడం.. స్థిరంగా ఉండలేకపోవడం.. వంటి లోపాలను నేతలు ఎత్తి చూపారు. అంతేకాకుండా గత ఎన్నికల్లో ఓడిపోయిన మంత్రి అజ్మీరా చందూలాల్ సైతం మహబూబాబాద్ ఎంపీ టికెట్ కోసం కేసీఆర్ వద్ద ప్రయత్నాలు చేశారు. ములుగు నుంచి సైతం ఇద్దరు నేతలు టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. చివరకు మాను కోటకు చెందిన మాలోతు కవితకే కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

అయితే ఈ ఎన్నికల్లో గెలిచిన సీనియర్ నేత రెడ్యానాయక్ కు మంత్రి పదవిని ఇవ్వాలని భావించినా.. సమీకరణాలను బట్టి కేసీఆర్ కేటాయించలేదు. అందుకే ఆయన కుమార్తెకు ఎంపీగా కేసీఆర్ అవకాశం ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సిట్టింగ్ స్థానం తనకే దక్కుతుందని గంపెడాశలు పెట్టుకున్న ప్రొఫెసర్ సీతారాం నాయక్ కు కేసీఆర్ గట్టి షాకే ఇచ్చినట్టైంది. ఇప్పుడు ప్రధాన పార్టీల టికెట్లు అన్నీ దాదాపు ఖరారైన వేళ సీతారాం నాయక్ దారి ఎటు అన్న చర్చ సాగుతోంది. తాను ఏ తప్పు చేయలేదని.. తనకు టికెట్ ఇవ్వకపోవడం దారుణమని సీతారాం నాయక్ లబోదిబోమంటున్నాడట..