Begin typing your search above and press return to search.

కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి బెదిరించారు: ఈటల సంచలన ఆరోపణలు

By:  Tupaki Desk   |   5 Nov 2022 9:15 AM GMT
కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి బెదిరించారు: ఈటల సంచలన ఆరోపణలు
X
మునుగోడు ఉప ఎన్నికలు ముగిసిన వేళ బీజేపీ ఎమ్మెల్యే.. ఒకప్పటి కేసీఆర్ సహచరుడైన ఈటల రాజేందర్ బయటకొచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మునుగోడులో ఓట్లు వేయించుకునేందుకు స్వయంగా సీఎం కేసీఆర్ అధికారులను ఫోన్లలో బెదిరించారని' ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. నేరుగా వారికి లంచాలు ఇచ్చి లొంగదీసుకోవడం.. మాట వినని వారిని బెదిరించారని అన్నారు.

ఇక మంత్రి కేటీఆర్ సైతం ప్రలోభ పెట్టారని.. ఎల్బీ నగర్ లో ఉన్న 30వేల మునుగోడు ఓటర్ల ఇళ్ల రెగ్యులరైజేషన్ కు ఆగమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేశారని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఇలాంటి కేసీఆర్ ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి మాట్లాడడం సిగ్గుచేటరని ఈటల మండిపడ్డారు. కేసీఆర్ మాటలకు, చేతలకు పొంతన లేదని ఈటల విమర్శించారు.

కేసీఆర్ ఈ 8 ఏళ్లలో టీఆర్ఎస్ లో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకున్నారో సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లలో కేసీఆర్ రారాజుగా మిగిలారని ఎద్దేవా చేశారు.

మొయినాబాద్ ఫామ్ హౌస్ ఘటనలోని ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఆణిముత్యాలు ఎలా అవుతారో కేసీఆర్ సమాధానం చెప్పాలని ఈటల డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ 8 ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు.దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ ఆ మాట నిలబెట్టుకోలేదన్నారు.

దళిత వ్యక్తి అయిన మంత్రి కొప్పుల ఈశ్వర్ ను అవమానించాడని అన్నారు. ఉప ఎన్నికలో ప్రచారం సందర్భంగా టీఆర్ఎస్ కు ఓటు వేయకుంటే ఫలితాలు రావని హెచ్చరించడం దారుణమన్నారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాన్ని కేసీఆర్ మంట గలిపారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. కేసీఆర్ అసలు రూపం తెలంగాణ ప్రజలకు అర్థమైందని కామెంట్ చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.