Begin typing your search above and press return to search.

మోదీని ఫిదా చేసేసిన కేసీఆర్

By:  Tupaki Desk   |   30 March 2020 4:30 AM GMT
మోదీని ఫిదా చేసేసిన కేసీఆర్
X
టీఆర్ఎస్ పార్టీ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాజ‌కీయం గురించి ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రాజ‌కీయంగా త‌న‌కు అనుకూలంగా అవ‌కాశాలు సృష్టించుకోవ‌డం, క‌లిసి వ‌చ్చిన సంద‌ర్భంలో వాటిని స‌ద్వినియోగం చేసుకోవ‌డంలో గొప్ప చాణ‌క్య‌వంతుడనే పేరుంది. తాజాగా క‌రోనా విష‌యంలోనూ కేసీఆర్ అలాగే వ్య‌వ‌హ‌రించారా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాజాగా కురిపించిన ప్ర‌శంస‌ల నేప‌థ్యంలో ఈ చ‌ర్చ జ‌రుగుతోంది.

తెలంగాణ‌లో క‌రోనా ప‌రిస్థితి గురించి క్ర‌మం త‌ప్ప‌కుండా స‌మీక్షించ‌డం, మీడియాతో మాట్లాడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా ఇదే రీతిలో రివ్యూ చేసి మీడియాతో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఏప్రిల్‌ 7లోగా కరోనా ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని కేసీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు. 25 వేల 9వందల 37మంది ప్రభుత్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో పెట్టామ‌ని తెలిపిన ఆయ‌న నిశిత వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం డిశ్చార్జీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ పై ముఖ్య‌మంత్రి ప‌రోక్షంగా ప్ర‌శంసించారు. లాక్‌డౌన్‌ పై భారత్‌ను ప్రపంచ దేశాలు ప్రశంసించాయి. `భార‌త్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, వైద్యం ప‌రంగా త‌క్కువ మౌలిక స‌దుపాయాలు ఉన్న దేశంలో వ్యాధికి త‌గిన రీతిలో చికిత్స అందించే ప‌రిస్థితులు ఉండ‌వు. అలాంటి సంద‌ర్భంలో లాక్‌డౌన్ వంటివే ప‌రిష్కారం. దాన్ని భార‌త్ విధించింది. అందుకే త‌క్కువ స‌మ‌యం లోనే విజ‌యం సాధించింది` అని ప‌రోక్షంగా ప్ర‌ధాని కృషిని సీఎం కేసీఆర్ ప్ర‌శంసించారు.