Begin typing your search above and press return to search.

ద‌టీజ్ కేసీఆర్ః13303 మందిని దార్లో పెట్టేశారు

By:  Tupaki Desk   |   3 Dec 2017 4:08 AM GMT
ద‌టీజ్ కేసీఆర్ః13303 మందిని దార్లో పెట్టేశారు
X
ఔను..ద‌టీజ్ కేసీఆర్ అన‌కుండా ఉండ‌లేం. ఎందుకంటే...కీల‌క‌మైన స‌మ‌స్య‌ను కేవ‌లం రెండు రోజుల్లోనే...కేసీఆర్ చ‌క్క‌దిద్దేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇబ్బందులు త‌లెత్త‌కుండా చేశారు. న‌యానో...భ‌యానో అనికూడా అవ‌స‌రం లేదు. డైరెక్టుగా భ‌యంగానే...ఔను నిజంగానే భ‌య పెట్టి త‌న దారిలోకి తెచ్చుకున్నాడు గులాబీ ద‌ళ‌ప‌తి. త‌ద్వారా త‌నెంటో మ‌రోమారు నిరూపించుకున్నాడు. ఇంత‌కీ ఇదంతా ఎవ‌రి గురించి అంటారా? రేష‌న్ డీల‌ర్లు.

సమ్మె పేరుతో రాష్ట్రంలో కొంతమంది డీడీలు కట్టకపోవడం వల్ల డిసెంబర్ నెలలో పేదలకు నిత్యవసర సరుకులు అందని పరిస్థితి నెలకొంది. ఈ విషయంపై ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ..పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజెందర్ - కమిషనర్ సీవీ ఆనంద్ లతో సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 16 వేల మంది డీలర్లలో 25 జిల్లాలకు చెందిన దాదాపు 3 వేల మంది ఇప్పటికే డీడీలు కట్టి - సరుకుల పంపిణీకి సిద్ధమయ్యారు. మిగతా వారు మాత్రం వేతనాలు పెంచాలని, హెల్త్ కార్డులు అందించాలనే డిమాండ్లతో డీడీలు కట్టలేదని...దీంతో డిసెంబర్ నెలలో సరుకుల పంపిణీకి వారు విముఖంగా ఉన్నారని, దీంతో కొన్ని చోట్ల పేదలకు డిసెంబర్ నెల సరుకులు అందించే పరిస్థితి లేదని సీఎం కేసీఆర్ కు అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ డీడీలు కట్టిన డీలర్లకు సరుకులు యథావిధిగా సరఫరా చేయాలని చెప్పారు. డీడీలు కట్టని డీలర్లను వెంటనే తొలగించి, వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని అధికారులను ఆదేశించారు. డీడీలు కట్టని ప్రాంతాల్లో ప్రజలకు సరుకులు అందని పరిస్థితి రావద్దన్నారు. ప్రభుత్వ యంత్రాంగం ద్వారా సరుకుల పంపిణీ కొనసాగించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

అయితే త‌మ సమస్యలు పరిష్కరించే వరకు డీడీలు తీసే ప్రసక్తే లేదని రేషన్‌ డీలర్లు నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో పౌర సరఫరాలశాఖ క‌మిష‌న‌ర్‌ సీవీ ఆనంద్‌ వారితో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగా డిసెంబర్‌ 2వ తేదీ వరకు సీఎం కేసీఆర్‌ గడువు ఇచ్చారని, ఈ లోపు డీడీలు కట్టని రేషన్‌ డీలర్ల స్థానంలో మరొకరు ఉంటారని కేసీఆర్‌ మాటగా చెప్పారు. ఇలా బెదిరింపుతో కూడిన‌ చర్చల అనంతరం...ఈ రోజు ఒక్క రోజే రాష్ట్రంలో రేషన్‌ పంపిణీ కోసం 13,303 మంది డీలర్లు డీడీలు తీయడం విశేషం. త‌ద్వారా కేసీఆర్ మార్క్ నిర్ణ‌యం ఎలా ఉంటుందో ఊహించుకొని వారు త‌మ స‌మ్మె ఆలోచ‌న‌ను ప‌క్క‌న‌పెట్టేసిన‌ట్లున్నారని అంటున్నారు.