Begin typing your search above and press return to search.

డబుల్ మాస్కుకు ఈసారి ఫేస్ షీల్డ్ పెట్టుకున్న కేసీఆర్

By:  Tupaki Desk   |   22 May 2021 3:27 AM GMT
డబుల్ మాస్కుకు ఈసారి ఫేస్ షీల్డ్ పెట్టుకున్న కేసీఆర్
X
అయితే ప్రగతిభవన్ లేదంటే ఫాం హౌస్ కు మాత్రమే పరిమితమవుతారన్న పేరున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. గడిచిన మూడు నాలుగు రోజులుగా ఎవరికి అర్థం కాని రీతిలో వ్యవహరిస్తున్నారు. కరోనా వచ్చి ఏడాది దాటినా.. ఒక్కసారిగా కూడా గాంధీ మాత్రమే కాదు.. మరే దవాఖానాను చూసేందుకు ఆసక్తిని చూపని ఆయన.. బుధవారం మధ్యాహ్నం హటాత్తుగా గాంధీ ఆసుపత్రిని సందర్శించే ప్రోగ్రాం పెట్టుకున్నారు.

గాంధీ ఆసుపత్రిలో ముఖానికి డబుల్ మాస్కుతోనే కరోనా ఐసీయూ వార్డును సందర్శించటమే కాదు.. అక్కడి రోగుల్ని అతి దగ్గరగా పరామర్శించిన వైనం సంచలనంగా మారింది. కేసీఆర్ ధైర్యానికి పలువురు విస్మయానికి గురయ్యే పరిస్థితి. ఇది సరిపోదన్నట్లుగా.. శుక్రవారం ఆయన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించటమే కాదు.. గాంధీలో మాదిరే రోగుల్ని అతి దగ్గరగా వెళ్లి పలుకరించి.. పరామర్శించారు. పలువురు రోగులతో మాట్లాడారు.

గాంధీ సందర్శించే సమయంలో ముఖానికి డబుల్ మాస్కుకు మాత్రమే పరిమితమైన సీఎం కేసీఆర్.. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించే సమయంలో మాత్రం ముఖానికి డబుల్ మాస్కుతో పాటు.. ఫేస్ షీల్డ్ ను కూడా పెట్టుకోవటం గమనార్హం. దాదాపు నలభై ఐదు నిమిషాలు ఆసుపత్రిలో ఉన్న ఆయన.. ఐసీయూతోపాటు ఇతర వార్డుల్ని సందర్శించి.. అక్కడ చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడారు. గాంధీలో కేవలం డబుల్ మాస్కు మాత్రమే పెట్టుకోవటం సరికాదన్న మాట వినిపించిన క్రమంలో ఎంజీఎంలో ముఖానికి ఫేస్ షీల్డ్ పెట్టుకోవటం ద్వారా సురక్షిత మార్గాన్ని ఎంచుకున్నట్లుగా చెప్పాలి.