Begin typing your search above and press return to search.

బ‌ల‌య్యేది బీజేపీ-కాంగ్రెస్‌...పంతం నెగ్గించుకునేది కేసీఆర్‌

By:  Tupaki Desk   |   2 Nov 2019 5:24 PM GMT
బ‌ల‌య్యేది బీజేపీ-కాంగ్రెస్‌...పంతం నెగ్గించుకునేది కేసీఆర్‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోమారు త‌న పంతం నెగ్గించుకునే మాట‌లు చెప్పారు. దాదాపు 5 గంటల పాటు కేబినెట్ సమావేశం త‌న అధ్య‌క్ష‌త‌న నిర్వ‌హించిన‌ అనంతరం కేసీఆర్‌ మీడియా సమావేశం నిర్వహించి ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వంలో విలీనం చేసేది లేదన్నారు. అంతేకాకుండా, గ్రామాల్లో తిరిగే రూట్లలో ఆర్టీసీకి నష్టం వస్తుందని పేర్కొంటూ...5,100 రూట్లను ప్రైవేట్ పరం చేసే నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు. కేంద్రం తీసుకున్న చ‌ట్టం ప్ర‌కార‌మే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు. ఆర్టీసికి 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ఇచ్చిన డబ్బులను తమ ప్రభుత్వం ఏడాదిలోనే ఇచ్చామని తెలిపారు. త‌ద్వారా ఏక‌కాలంలో ఇటు కాంగ్రెస్‌, అటు బీజేపీని టార్గెట్ చేయ‌డ‌మే కాకుండా...కార్మికుల‌ను డైలామాలో ప‌డేశారు.

ఐదేళ్లలో టీఆర్ఎస్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయన్న సీఎం కేసీఆర్... ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకూడదని కేబినెట్ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. అందుకే మొండిప‌ట్టు వీడి ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి లోపు సమ్మెని విరమించి ఉద్యోగాలలో చేరాల‌ని సీఎం కోరారు. ఒక‌వేళ చేరకపోతే మిగతా బస్సు రూట్లను కూడా ప్రైవేట్ పరం చేసేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కార్మికుల కుటుంబాలను ఈ రాష్ట్ర అధినేతగా.. ఒక సోదరుడిలా చెబుతున్నానన్నారు. యూనియన్ల మాయలో పడి కార్మికులు కుటుంబాలను రోడ్ల మీద తెచ్చుకోవద్దని సూచించారు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని కార్మికులు వినియోగించుకుని.. తప్పకుండా విధులకు రావాలని సీఎం కేసీఆర్ కోరారు.

కాంగ్రెస్‌, బీజేపీ పాలిత దేశంలోని చాలా రాష్ట్రాలు ప్రైవేట్ బస్సులతో ఆర్టీసీని నడిపిస్తున్నాయని కేసీఆర్ తెలిపారు. కేంద్రం తెచ్చిన యాక్ట్ ప్రకారమే క్యాబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. ఇప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్న బీజేపీ ఎంపీలు ఈ చ‌ట్టం ఆమోద ముద్ర ప‌డే స‌మ‌యంలో ఓటు వేయ‌లేదా అని ప్ర‌శ్నించారు. ప్ర‌తిప‌క్షాలు ప‌నికిమాలిన రాజ‌కీయాలు చేయ‌కుండా ఉండాల‌ని కోరారు. హైకోర్టు హుజూర్‌నగ‌ర్ అభివృద్ధి చేసిన వ్యాఖ్య‌లు స‌రికావ‌న్న ముఖ్య‌మంత్రి...ఎన్నో ప‌థ‌కాల‌కు సైతం తాము నిధులు ఖ‌ర్చుచేశామ‌న్నారు.