Begin typing your search above and press return to search.

కేసీఆర్ భోజన మర్యాదలు ఇలానే ఉంటాయి మరి

By:  Tupaki Desk   |   23 March 2023 6:00 PM GMT
కేసీఆర్ భోజన మర్యాదలు ఇలానే ఉంటాయి మరి
X
రాజకీయాల్ని కాసేపు పక్కన పెట్టేద్దాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంబంధించిన మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. ఒక్క విషయంలో ఆయన్ను తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్కరు బీట్ చేయలేరని చెప్పాలి. మధ్యాహ్న భోజన సమయం అయ్యేసరికి ఆయన ఎక్కడ ఉన్నా.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే.. తన చుట్టూ ఉన్న వారందరికి రుచికరమైన భోజనాన్ని.. కడుపు నిండా పెట్టించే కార్యక్రమం మాత్రం అస్సలు మిస్ కారని చెబుతారు. అది ప్రగతి భవన్ కావొచ్చు.. ఫాం హౌస్ కావొచ్చు. అదేంటే రోడ్ షో కావొచ్చు.

ఎప్పుడు.. ఎలాంటి మూడ్ లో ఉన్నా.. ఆయన చేసే భోజన మర్యాదల విషయంలో వంక పెట్టలేరని చెప్పాలి.ఇటీవల అనూహ్యంగా (అకాల) కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో పంట నష్టం చోటు చేసుకోవటం తెలిసిందే. మామూలుగా అయితే..ఇలాంటి వాటిని ఆయన పెద్దగా పట్టించుకునేది ఉండదు. అధికారులు ఇచ్చే నివేదికల ఆధారంగా నిర్ణయాలు జరిగిపోతాయి. కానీ.. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన తీరు మాత్రం రోటీన్ కు భిన్నంగా వ్యవహరించారు.

ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చారు. తనతో పాటు ఈ మధ్యన దోస్తానా ఎక్కువగా ఉన్న కమ్యునిస్టు నేతల్ని వెంట పెట్టుకొని.. గులాబీ నేతలతో కలిసి బస్సు ప్రయాణం చేసి పలు జిల్లాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, కరీంనగరర్ జిల్లాల్లోని రైతులు అకాల వర్షాల కారణంగా భారీగా దెబ్బ తిన్నారు. దీంతో.. వారికి జరిగిన కష్టం.. నష్టం గురించి తెలుసుకోవటానికి వీలుగా ఆయన పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా 2.28 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని.. వేలాది మంది రైతుల్ని ఆదుకునేందుకు వీలుగా పంట నష్టం వాటిల్లిన ప్రతి ఎకరానికి రూ.10వేలు చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. మూర్ఖులైన కొందరు ఆర్థిక వేత్తలు వ్యవసాయం దండగ అంటున్నారని.. మహారాష్ట్ర.. గుజరాత్.. తమిళనాడు.. కర్ణాటక కంటే రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువన్నారు. రైతుల కష్టాల గురించి తెలుసుకొని.. వారిని ఊరడించే నిర్ణయాన్ని వెల్లడించిన కేసీఆర్.. తన ప్రయాణంలోనే తనతో ఉన్న వారందరికి లంచ్ ఏర్పాట్లు చేశారు.

ఆయన ప్రయాణిస్తున్న ప్రత్యేక బస్సులోని వారందరికి డబ్బాల్లో భోజనాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్.. వారందరికి కొసరికొసరి వంటలు వడ్డించిన తీరు చూస్తే.. ఈ భోజన మర్యాదల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి ఎవరైనా నేర్చుకోవాల్సిందే అన్న భావన కలుగక మానదు. సీఎంతో పాటు సుడిగాలి పర్యటన అంటే ఎలా ఉంటుందో తెలీని కొందరు.. మద్యాహ్నం భోజనం గురించి ఆరా తీయగా.. మీరే చూస్తారని చెప్పటం.. అందుకు తగ్గట్లే ఆయన భోజన ఏర్పాట్లు అందరి ఆకలిని తీర్చేయటమే కాదు.. కేసీఆరా మజాకానా? అన్న మాట వినిపించటం గమనార్హం


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.