Begin typing your search above and press return to search.

సీఎం కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ... మున్సిపల్స్ కోసం మూడు సర్వేలు !

By:  Tupaki Desk   |   30 Dec 2019 6:22 AM GMT
సీఎం కేసీఆర్ మాస్టర్ ప్లాన్ ... మున్సిపల్స్ కోసం మూడు సర్వేలు !
X
తెలంగాణ లో మునిసిపల్‌ ఎన్నికల కి సమయం దగ్గర పడటం తో అధికార టీఆర్‌ ఎస్‌ పార్టీ పట్టణ ఓటర్ల నాడి పట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఓటర్ల అంతరంగాన్ని తెలుసుకునేందుకు మూడు సర్వేలు చేయిస్తోంది. ఒక సర్వే కోసం పార్టీ ముఖ్య నేతలను వినియోగిస్తోంది. మరొకటి పోలీస్‌ నిఘా విభాగం నుంచి తెప్పిస్తోంది. స్వతంత్ర ఏజెన్సీ ద్వారా మూడో సర్వే చేయిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 31 జిల్లాల్లో గెలిచిన టీఆర్‌ఎస్‌..ఇప్పుడు మునిసిపల్ ఎన్నికల్లోనూ అదే రకంగా సత్తా చాటా లని భావిస్తోంది. ఇందులో భాగంగానే మూడు సర్వేలు చేయిస్తున్నట్టు తెలుస్తుంది.

అయితే , దాదాపుగా ఇప్పటికే ఆ మూడు సర్వేలు ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ ప్రక్రియను టీఆర్‌ ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కె.తారక రామారావు పర్యవేక్షిస్తున్నారు. మూడు సర్వేల నివేదికలు పూర్తిగా చేతికి వచ్చిన తరువాత , ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై స్పష్టమైన అంచనాకు రావాలని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. ఆ తర్వాత టీఆర్‌ ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ మునిసిపల్‌ ఎన్నికల పై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే ప్రకటించిన మునిసిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం జనవరి 7న నోటిఫికేషన్‌ వెలువడనుంది. అలాగే 22న పోలింగ్‌ జరగనుంది.

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు మునిసిపల్‌ ఎన్నికల్లో గెలవడానికి ఏం చేయాలన్న అంశాన్నే ఈ సర్వేలకు ప్రామాణికం గా నిర్దేశించినట్లు తెలుస్తోంది. మునిసిపాలిటీల వారీగా పార్టీల బలా బలాలు? సులభంగా గెలిచే స్థానాలేవి? కష్టపడితే గెలుపొందేవి ఏవి? పార్టీ బలహీనంగా ఉన్న చోట్ల ఏం చేయాలి? కొత్త మునిసిపాలిటీల్లో పరిస్థితి ఏమిటి? నేతల మధ్య సమన్వయం ఎట్లా? అనే అంశాల వారీగా నివేదికలు కోరినట్లుగా తెలుస్తోంది. అలాగే డివిజన్ల వారీగా ఎవరెవరి మధ్య పోటీ ఉంటుందనే అంశం తో పాటుగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గా ఎవరైతే బాగుంటుందో కూడా నివేదిక లో పొందుపర్చాలని కోరారు. మొత్తం మీద చూస్తే .. ఈ సర్వే సంస్థలు ఇచ్చే నివేదికల ఆధారం గానే అభ్యర్ధుల ఖరారు, ప్రచార వ్యూహాలు అమలు చేసే యోచన లో పార్టీ నేతలు ఉన్నట్లు తెలుస్తుంది.