Begin typing your search above and press return to search.

ఐఏఎస్‌ ల కుంపట్ల‌కు కేసీఆర్ సొల్యూష‌న్ ఇదే

By:  Tupaki Desk   |   2 July 2018 11:56 AM GMT
ఐఏఎస్‌ ల కుంపట్ల‌కు కేసీఆర్ సొల్యూష‌న్ ఇదే
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాజ‌కీయ వ్య‌వ‌హార‌శైలి విభిన్నంగా ఉంటుంద‌నేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ముఖ్య‌మంత్రి పీఠం అధిరోహించిన అనంత‌రం కూడా ఆయ‌న ప‌రిపాల‌న‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సృష్టించుకున్నారు. ముఖ్య‌మంత్రి హోదాలో స‌చివాల‌యానికి రాకుండా ప‌రిపాల‌న సాగిస్తున్న సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టిస్తున్నారంటూ...ఆయ‌న విమ‌ర్శ‌కులు అనేక వేదిక‌ల్లో ప్ర‌స్తావిస్తుంటారు. అయితే కేసీఆర్ వాట‌న్నింటినీ లైట్ తీసుకొని త‌న‌దైన శైలిలో ప్ర‌జ‌ల్లో మైలేజీ పెంచుకుంటున్నార‌నేది వేరే విష‌యం. ఇక తాజా క‌ల‌కలం విష‌యానికి వ‌స్తే...అనూహ్య రీతిలో తెలంగాణలోని ఐఏఎస్ అధికారులు కేసీఆర్ తీరుపై తిరుగుబాటు చేశారు. త‌మ‌కు అన్యాయం జ‌రుగుతోందంటూ...సమాజంలో వెనుక‌బ‌డిన వ‌ర్గాలుగా పేరొందిన ఎస్సీ - ఎస్టీ - బీసీ అధికారులు నిర‌స‌న తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి విన‌తిప‌త్రం అందించారు. ఈ ప‌రిణామం జాతీయ స్థాయిలో కూడా చ‌ర్చ‌నీయాంశం అయింది.

అయితే, దీనికి కేసీఆర్ త‌న‌దైన శైలిలో ముగింపు ప‌లికే ప్ర‌య‌త్నం చేశారు. కేంద్ర స‌ర్వీసుల‌కు చెందిన ఐఏఎస్ అధికారుల‌కు చెందిన వివాదం త‌న ప‌రిధి దాటిపోక‌ముందే ఆ వివాదం ముద‌ర‌కుండా చూడాల‌ని కేసీఆర్ కాస్త ఆల‌స్యంగా అయినా మార్గం వెతికారు. ఇందుకోసం గ‌వ‌ర్న‌ర్‌ ను క‌లిశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం వరుస భేటీలతో బిజీగా గడిపారు. మాజీ ప్రధాని దేవెగౌడతోను - రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ తో నూ ఆయన సమావేశమయ్యారు. రాజకీయంగా ఈ భేటీలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆదివారం సాయంత్రం కేసీఆర్‌ గవర్నర్‌ నరసింహన్‌ తో భేటీ అయ్యారు. రాజ్‌ భవన్‌ లో దాదాపు అరగంటపాటు కొనసాగిన ఈ భేటీలో ఎస్సీ - ఎస్టీ ఐఏఎస్‌ అధికారుల అంశంపై కూడా వారిరువురూ చర్చించినట్టు సమాచారం. ఉన్నతాధికారుల పట్ల తాము ఎలాంటి పక్షపాత ధోరణిని అవలంభించడం లేదంటూ ముఖ్యమంత్రి గవర్నర్‌ కు వివరించారు. తద్వారా కేంద్రం ఒక‌వేళ నివేదిక అడిగితే...పాజిటివ్‌ గా వెళ్లే ప్ర‌య‌త్నం చేశారు.

రైతుబంధు పథకం పట్ల రాష్ట్రంలో రైతులందరూ సంతోషంగా ఉన్నారని - పాసుపుస్తకాల పంపిణీ సందర్భంగా తలెత్తిన సమస్యలను కూడా దాదాపు పరిష్కరించామంటూ కేసీఆర్‌ గవర్నర్‌ కు వివరించారు. రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని సీఎం కేసీఆర్‌ ప్రస్తావించినట్టు సమాచారం. తాను ఇటీవల ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లిన సమస్యలపై ఇప్పటివరకు కేంద్రం స్పందించలేదంటూ సీఎం వివరించారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారమూ రాలేదని ఆయన తెలిపారు. అందువల్ల కేంద్ర పెద్దలను సంప్రదించాలంటూ కేసీఆర్‌ గవర్నర్‌ కు విజ్ఞప్తి చేశారు. పంచాయతీ ఎన్నికలపై కూడా సీఎం - గవర్నర్‌ చర్చించారు. మ‌రోవైపు బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తాము ఈ ఎన్నికలపై ముందుకు పోలేకపోతున్నామంటూ సీఎం వివరించారు. దీంతోపాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణ అంశం కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.