Begin typing your search above and press return to search.

చినజీయర్ ఆశ్రమంలో కేసీఆర్ ఎంతసేపు ఉన్నారో తెలుసా?

By:  Tupaki Desk   |   31 July 2019 5:15 AM GMT
చినజీయర్ ఆశ్రమంలో కేసీఆర్ ఎంతసేపు ఉన్నారో తెలుసా?
X
అంచనాలకు అందని రీతిలో వ్యవహరించటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలవాటే.తాజాగా అలాంటి పనే చేసి హాట్ టాపిక్ గా మారారు. తాజాగా ఆయన రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంషాబాద్ మండలం ముచ్చింతల్ లోని చిన జీయర్ స్వామి వారి మఠానికి వెళ్లారు. ముఖ్యమంత్రి అన్నాక ఎక్కడికైనా వెళ్లొచ్చు.. ఎవరినైనా కలవొచ్చు. ఈ విషయంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు.

కానీ.. సచివాలయం ముఖం చూడని కేసీఆర్.. తన ప్రాధాన్యతల్ని తన చేతలతో చూపిస్తూ ఉంటారు. తాజాగా జీయర్ ఆశ్రమానికి వెళ్లిన కేసీఆర్ అక్కడ ఏకంగా మూడున్నర గంటల పాటు గడపటం ఆసక్తికరంగా మారింది. ప్రైవేటు కార్యక్రమాలకు సంబంధించి ఒక ముఖ్యమంత్రి మహా అయితేపావు గంట.. అరగంట అది కూడా కాకుంటే గంట పాటు ఉండటం గొప్పగా చెబుతారు. అలాంటిది జీయర్ స్వామి ఆశ్రమంలో ఏకంగా మూడున్నర గంటల పాటు గడపటం విశేషం.

తనన కలల పుణ్యక్షేత్రంగా కేసీఆర్ తరచూ ప్రస్తావించే యాదాద్రిలో తాను చేపడుతున్న అభివృద్ధి పనులు చివరికి వచ్చిన క్రమంలో.. త్వరలో ఇక్కడ మహా సుదర్శన యాగాన్ని నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇలాంటి యాగాలు నిర్వహించటం సామాన్యులే కాదు.. సంపన్నులకు సైతం కష్టమైన విషయం ఎందుకంటే.. ఈ యాగానికి అయ్యే ఖర్చు అలా ఉంటుంది.

ఇంత భారీ యాగానికి అవసరాలు ఎలా ఉంటాయి? ఎన్ని రోజులు సాగుతుంది? ఎంత భారీగా కార్యక్రమాన్ని నిర్వహించాలి? లాంటి ఎన్నో విషయాలు చర్చించాల్సి ఉంటుంది. మిగిలిన విషయాలకైతే.. సదరు శాఖకు చెందిన కార్యదర్శికి పనులు అప్పగించొచ్చు. కానీ.. చేసేది యాగం. ఈ సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నోళ్లు చాలా తక్కువమందే ఉంటారు. ఉన్నా.. సంపూర్ణ అవగాహన ఉండదు. అందులోని దేవుడి కార్యక్రమం కావటంతో కేసీఆర్ ఎవరి మీదా ఆధారపడరని చెబుతుంటారు. తనకు తానుగా అన్ని విషయాలు స్వయంగా చూసుకోవాలని భావిస్తుంటారు.

ఈ కారణంతోనే యాగానికి సంబంధించిన అన్ని అంశాల్ని మాట్లాడుకోవటం.. ఏర్పాట్లకు సంబంధించిన వివరాల్ని చూసుకునేందుకు వీలుగా భారీగా సమయాన్ని కేటాయించాల్సిన పరిస్థితి. ఒక్క చిన జీయర్ స్వామితో చర్చలకే రెండున్నర గంటలకు పైగా సమయాన్ని వెచ్చించిన కేసీఆర్.. తనకు అత్యంత సన్నిహితుడైన హైంహోం రామేశ్వరరావుతో మరో గంట గడపటం గమనార్హం.

హైహోం రామేశ్వరరావుతో పాటు ఆయన సోదరుడు ఉన్నారు. వీరిద్దరితో కలిసి కేసీఆర్.. ఆశ్రమంలో ఉన్న జూపల్లి బాలమ్మ గార్డెన్ కు వెళ్లారు. అక్కడ ఏకంగా గంట పాటు ముఖ్యమంత్రి గడపటం విశేషం. జీయర్ స్వామి ఆశ్రమంలో ఇంత భారీగా సమయాన్ని వెచ్చించటం రాజకీయ వర్గాల్లోనే కాదు.. అధికార వర్గాల్లో ఆసక్తి వ్యక్తమవుతోంది. అంతేకాదు.. తనకు అత్యంత సన్నిహితుడైన మైహోం రామేశ్వరరావుకు కేసీఆర్ ఇచ్చే ప్రయారిటీ అందరికి అర్థమయ్యేలా చేస్తుందని చెప్పక తప్పదు.