Begin typing your search above and press return to search.

కేసీఆర్‌తో పీకే, ఉండ‌వ‌ల్లి భేటీ.. రాజ‌కీయ వ్యూహాల‌కు ప‌దును?

By:  Tupaki Desk   |   12 Jun 2022 4:31 PM GMT
కేసీఆర్‌తో పీకే, ఉండ‌వ‌ల్లి భేటీ.. రాజ‌కీయ వ్యూహాల‌కు ప‌దును?
X
దేశంలో రాజ‌కీయాలు మారాల‌ని, కొత్త‌గా నాయ‌కులు రావాల‌ని.. కేంద్రంలో మోడీ స‌ర్కారును గ‌ద్దె దింపాల‌ని.. ప‌దే ప‌దే చెబుతున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. దానికి అనుగుణంగానే పావులు క‌దుపుతున్నారు. తాజాగా ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. అదేస‌మ‌యంలో రాజ‌మండ్రి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ కూడా కేసీఆర్ ను క‌లుసుకున్నారు. సుమారు మూడు గంట‌ల‌కు పైగానే వీరి మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగాయి.

కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన, రాష్ట్ర ప‌తి ఎన్నికలు, టీఆర్ ఎస్ ఎంపీలు, ఎమ్మెల్సీల‌పై నిర్వ‌హించిన స‌ర్వే ఫ‌లితాల‌పై వీరంతా చర్చించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఎమ్మెల్యేల పనితీరుపై పీకే సర్వే చేశారు. టీఆర్‌ఎస్‌ను దేశవ్యాప్తంగా ఎలా విస్తరించాలి? వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎలాంటి వ్యూహాలు రచించాలనే అంశంపై చర్చించే అవకాశం ఉందని ప్రగతి భవన్ వర్గాలు చెబుతున్నాయి. తాజా భేటీలో మంత్రి హరీష్‌రావు కూడా పాల్గొన్నారు. దేశ రాజకీయ పరిస్థితులు, అందులో టీఆర్‌ఎస్‌ పోషించనున్న పాత్రపై విస్తృతంగా చర్చించారని తెలుస్తోంది.

ప్రస్తుతం దేశంలో పాలన ఒక లక్ష్యం లేకుండా ఉంది. దీంతో అశాంతి పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో దేశ ప్రజల అవసరాలే ఎజెండాగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిద్దాం అంటూ ప్రతిపాదనను కేసీఆర్ వివ‌రించార‌ని తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా మార్చే అంశంపైనా చ‌ర్చిచంఆరు. ప్రతికూల పరిస్థితులనూ అనుకూలంగా మార్చే నైపుణ్యాలున్న ప్రశాంత్‌ కిషోర్‌ మార్గదర్శనంలోనే కేసీఆర్‌, జాతీయ పార్టీ అంశాన్ని ముందుకు తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

నియోజకవర్గాలవారీగా పార్టీ పరిస్థితిపైసర్వేలు నిర్వహించిన ప్రశాంత్‌ కిశోర్‌ ఇటీవల కేసీఆర్‌తో భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలపైనా వారు సమీక్షించినట్లు తెలుస్తోంది. పీకే వ్యూహంతో ముందుకుసాగుతున్న కేసీఆర్‌.. మూడు నెలల్లో సంచలన వార్త చెబుతానని ఇటీవల ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ను జాతీయ పార్టీగా మారుస్తున్నట్లుగా చ‌ర్చ న‌డుస్తున్న స‌మ‌యంలో తాజాగా ఉండ‌వ‌ల్లి, పీకేల‌తో భేటీ మ‌రింత ప్రాధాన్యం సంత‌రించుకుంది. మ‌రో రెండు రోజుల్లో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌పై మ‌మ‌తా బెన‌ర్జీ ఆహ్వానించిన నేప‌థ్యంలో ఈ విష‌యంపైనా.. ఏం చేద్దామ‌నే అంశంపై.. కేసీఆర్ చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి కీల‌క వ్యూహ‌క‌ర్త‌ల భేటీ.. ఆస‌క్తి రేపుతుండ‌డం గ‌మ‌నార్హం.