Begin typing your search above and press return to search.

ఈ నెలలోనే ఆ కేంద్రమంత్రి తో సీఎం కేసీఆర్‌ 2సార్లు భేటీ. !

By:  Tupaki Desk   |   25 Sep 2021 4:30 PM GMT
ఈ నెలలోనే ఆ  కేంద్రమంత్రి తో సీఎం కేసీఆర్‌  2సార్లు భేటీ.  !
X
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేంద్ర జలవనరులశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తో సమావేశమయ్యారు. అయితే, నెల రోజుల వ్యవధిలోనే షెకావత్‌తో కేసీఆర్‌ భేటీ కావడం ఇది రెండోసారి.. ఈ నెల 6న కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశమైన కేసీఆర్ 5 అంశాలపై విజ్ఞానపత్రం అందజేశారు. ఇక, ఇవాళ్టి సమావేశంలోనూ గత సమావేశంలో చర్చించిన అంశాలే మరలా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. సుమారు 40 నిమిషాల పాటు సాగిన సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల మహబూబ్‌నగర్‌ జిల్లాకు జరుగుతున్న నష్టం, కృష్ణా జలాల అంశంలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాస్పద అంశాలపై చర్చించారు.

పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడంతో పాటు, నీటి కేటాయింపులు జరపాలని కేంద్ర మంత్రిని కోరినట్టు తెలుస్తోంది. కేఆర్‌ ఎంబీ, జీఆర్‌ ఎంబీ గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు తేదీ వాయిదాను మరోసారి షెకావత్‌ వద్ద ప్రస్తావించినట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య సంయుక్తంగా ఉన్న ప్రాజెక్టులనే నోటిఫికేషన్‌ పరిధిలోకి తీసుకురావాలని సీఎం కోరినట్టు తెలుస్తోంది. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో తెలంగాణ ఏర్పడక ముందే ప్రారంభించిన 11 ప్రాజెక్టులను కేంద్రం జారీ చేసిన గెజిటి నోటిఫికేషన్ లో అనుమతి లేని ప్రాజెక్టులుగా పేర్కొన్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.. రాష్ట్రానికి కేటాయించిన 967.94 టీఎంసీల నీటి పరిధిలోనే ప్రొజెక్టులు ఉన్నాయని, అందులో 758.76 టీఎంసీల వినియోగానికి సంబంధించిన ప్రాజెక్టులకు కేంద్ర జలసంఘం ఇప్పటికే అనుమతులు ఇచ్చిందని గుర్తుచేశారు.

మరో 148.82 టీఎంసీల సంబంధించి నీటి లభ్యతపై హైడ్రోలజీ డైరెక్టరేట్ అనుమతులు మంజూరు చేసిందని లేఖలో పేర్కొన్న సీఎం.. చిన్న నీటి పారుదల పథకమైన కందుకుర్తి ఎత్తిపోతల పథకం 3300 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందిస్తుందని..దీనికి అనుమతులు అవసరం లేదన్నారు. రామప్ప పాకాల లింక్, తుపాకులగూడెం బ్యారేజ్, దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగం కాబట్టి కొత్తగా అనుమతి అవసరం లేదని.. కంతనపల్లి ప్రాజెక్టును కూడా అనుమతి లేని ప్రాజెక్టుల జాబితా నుంచి తీసివేయాలని కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్‌ దృష్టికి తీసుకెళ్లారు సీఎం కేసీఆర్‌.

ఉమ్మడి రాష్ట్రంలోని నీటి వాటాలు తేలాల్సి ఉందని, ఆ నీటి వాటాలు తేలిన తర్వాతే బోర్డుల పరిధిని నిర్ణయించాలని కేసీఆర్ కోరారు. ఇటీవల ఎన్జీటీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ కూడా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో పర్యటించి సాగునీటి పనులు కూడా చేస్తూ కేవలం తాగునీటి ప్రాజెక్టు అని చెప్పినట్లుగా తేల్చారు. ఈ అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. సాయంత్రం కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ తో భేటీకానున్న సీఎం కేసీఆర్‌, ధాన్యం కొనుగోళ్లపై చర్చిస్తారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా నేతృత్వంలో జరిగే వామపక్షతీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొంటారు.