Begin typing your search above and press return to search.

కడిగేసే కేసీఆర్.. ఇన్ని అన్నాక కామ్ గా ఉండటమా?

By:  Tupaki Desk   |   9 Dec 2021 1:37 PM GMT
కడిగేసే కేసీఆర్.. ఇన్ని అన్నాక కామ్ గా ఉండటమా?
X
బియ్యం సేకరణ విషయంలో కేంద్రంలోని మోడీ సర్కారు దుర్మార్గంగా వ్యవహరిస్తోందని.. పంజాబ్ కు ఒక న్యాయం తెలంగాణకు మరో న్యాయమంటూ నిప్పులు చెరుగుతున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.

ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాల కారణంగా తామిక ధాన్యాన్ని కొనుగోలుచేయమని.. తెలంగాణ రైతులు ధాన్యాన్ని పండిచ్చొద్దంటూ తేల్చి చెప్పటం తెలిసిందే. దీనిపై సీఎం కేసీఆర్ పలుమార్లు మీడియాతో మాట్లాడటం తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్రం తీరును తుర్పార పట్టారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. కేసీఆర్ చెబుతున్న మాటలకు.. ఆయన చేస్తున్న ఆరోపణలకు భిన్నంగా రియాక్టు అవుతున్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. మొన్నా మధ్య పార్లమెంటులో మాట్లాడిన ఆయన.. తాము ఉప్పుడు వియ్యాన్ని అడిగినా.. తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేకపోయిందని.. గతంలో పలుమార్లు మాట తప్పినట్లుగా పేర్కొన్నారు. దీంతో.. ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయిన పరిస్థితి.

ఒకవైపు కేంద్రం తమతో తొండాట ఆడుతుందన్న కేసీఆర్ అండ్ కో మాటలకు భిన్నంగా కేంద్రమంత్రి స్వయంగా.. తాము కొంటామని చెప్పినా.. మాట ఇచ్చిన సమయానికి ధాన్యాన్ని పంపలేదన్న వ్యాఖ్యలు పెను సంచలనంగా మారింది.

వాస్తవానికి ఇలాంటివి చోటు చేసుకున్నప్పుడు సీఎం కేసీఆర్ వెంటనే రియాక్టు కావటం.. సదరు నేత చేసిన వ్యాఖ్యల్ని వరుస క్రమంలో కౌంటర్లు ఇచ్చేసి.. తమపై తప్పుడు ప్రచారం చేస్తారా? అంటూ గయ్యిమంటారు.

మరి.. అలాంటి కేసీఆర్ రోటీన్ కు భిన్నంగా కామ్ గా ఉండటం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే.. ధాన్యం కొనుగోలు విషయమై మరోసారి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గళం విప్పారు. బియ్యం సేకరణ విషయంలో తెలంగాణ సర్కారు పదే పదే తప్పుడు ప్రచారం చేస్తుందంటూ సీరియస్ అయ్యారు. లోక్ సభలో తాజాగా మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

అందులో ముఖ్యమైనవి..

- బియ్యం సేకరణలో తెలంగాణ సర్కారు పదే పదే తప్పుడు ప్రచారం చేస్తోంది. ఎఫ్ సీఐ తెలంగాణ నుంచి రికార్డు స్థాయిలో బియ్యాన్ని సేకరించేందుకు ఆమోదం తెలిపాం. అయినా తమకు అన్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది. తెలంగాణలో ఎఫ్ సీఐ నేరుగా ధాన్యం సేకరించదు. రాష్ట్రమే సేకరించి బియ్యంగా మార్చి ఇస్తుంది.

- కేంద్రానికి అధిక బియ్యం ఇచ్చేందుక వీలుగా మేం రాష్ట్ర ప్రభు్తవానికి నాలుగైదు సార్లు సమయాన్ని పొడిగించి ఇచ్చాం. పెద్ద ఎత్తున అనుమతులు ఇచ్చాం. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఉప్పుడు బియ్యం కొనుగోలులో విఫలమవుతోంది. ఇలా చెప్పటానికి నేను బాధ పడుతున్నా.

- బియ్యం సేకరించేందుకు ఎఫ్ సీఐ సిద్ధంగా ఉంది. మేం సమయాన్ని పొడిగించాం. తెలంగాణ నుంచి ఎంత వేగంగా బియ్యం వస్తే ఎఫ్ సీఐ కూడా అంతే వేగంగా బియ్యం కొనుగోలు చేస్తుంది. తెలంగాణ మీద ఎలాంటి వివక్షా లేదు.

ఇలా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చగా మారాయి. దీనికి తోడు.. సీఎం కేసీఆర్ తీరును తీవ్రంగా తప్పు పడుతూ.. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఖరీఫ్ సీజన్ లో తెలంగాణ నుంచి 40లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకుంటామని ఆగస్టులో కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయని చెప్పారు. కానీ.. ఇప్పటివరకు 10 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యానికి సరిపడా ధాన్యాన్ని మాత్రమే సేకరించారన్నారు.

ప్రతి గింజా కొంటామన్న కేసీఆర్.. ఇంకా గోనె సంచుల్ని కూడా కొనలేదన్నారు. కల్లాలకు వచ్చిన ధాన్యం వర్షాలకు తడుస్తోందన్నారు. తెలంగాణలో మొత్తం 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలన్నా.. రూ.10వేల కోట్ల కంటే తక్కువే ఖర్చు అవుందన్నారు. ధాన్యం కొనం..బియ్యమే కొంటామని కేంద్రమంత్రి పీయూష్ చెప్పారు. ఇది చాలా ఆశ్చర్యకరం. నాకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో మాత్రం ఇప్పటివరకు రాష్ట్రంలో 16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామని తెలిపారన్నారు.

తెలంగాణ ప్రభుత్వ తీరును కేంద్రమంత్రి పీయూష్ తీవ్రంగా తప్పు పడుతున్న వేళ.. గణాంకాలతో సహా వివరాల్ని వెల్లడించేందుకు సీఎం కేసీఆర్ ఎందుకు నిర్ణయం తీసుకోవటం లేదు? ఆయన ఎందుకు కామ్ గా ఉంటున్నారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. దీంతో కేంద్ర మంత్రి చెప్పింది నిజమా? కేసీఆర్ చెబుతున్న మాటలు నిజమా? అన్న కన్ఫ్యూజన్ ఇప్పుడు నెలకొంది. మరి.. దీనికి సీఎం కేసీఆర్ ఏమని బదులిస్తారో?