Begin typing your search above and press return to search.
కేసీఆర్ టార్గెట్!..బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా!
By: Tupaki Desk | 13 April 2018 10:55 AM GMTజాతీయ రాజకీయాల్లోకి దిగేశానంటూ ఇదివరకే ప్రకటించిన టీఆర్ ఎస్ అధినేత - తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు... కాసేపటి క్రితం కర్ణాటక రాజధాని బెంగళూరులో జేడీఎస్ అధినేత - మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నేటి ఉదయం పార్టీ నేతలు,. దక్షిణాది భాషల సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తో కలిసి హైదరాబాదులో బయలుదేరి బెంగళూరులో ల్యాండైన కేసీఆర్... నేరుగా గౌడ ఇంటికి చేరుకున్నారు. దేవేగౌడతో పాటు ఆయన కుమారుడు - కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో ప్రత్యేకంగా సమావేశమైన కేసీఆర్ చాలా అంశాలనే వారితో చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ - బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించిన కేసీఆర్.. దాని విధి విధానాలు - లక్ష్యాలపైనే గౌడలతో చర్చించినట్లుగా సమాచారం. సుదీర్ఘ చర్చల అనంతరం బయటకు వచ్చిన కేసీఆర్... దేవేగౌడ - కుమారస్వామిలతో కలిసి అక్కడే మీడియాతో చాలా వివరంగానే మాట్లాడారు.
ఈ సందర్భంగా ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యాలను చూచాయగా చెప్పిన కేసీఆర్... ఫెడరల్ ఫ్రంట్ కు కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా టార్గెట్టేనని కుండబద్దలు కొట్టేశారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించి తాము క్లిస్టర్ క్లియర్‌గా ఉన్నామని, అందులో భాగంగానే దేశ ప్రధానిగా పనిచేసిన దేవేగౌడతో కలిసి చర్చించేందుకే తాను బెంగళూరు వచ్చానని కేసీఆర్ చెప్పారు. అసలు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అవసరమా? అన్న ప్రశ్నను తనకు తానుగానే వేసుకున్న కేసీఆర్... దానికి సమాధానాన్ని కూడా చాలా క్లియర్ గానే చెప్పారు. తెలంగాణలో టీఆర్ ఎస్ సర్కారు ప్రారంభించిన మిషన్ కాకతీయను ప్రస్తావించిన కేసీఆర్... దేశంలోని మెజారిటీ భూములకు నీళ్లెందుకు అందడం లేదని ప్రశ్నించారు. అంతేకాకుండా కావేరీ నదీ జలాల విషయంలో కర్ణాటక, తమిళనాడుల మధ్య 70ఏళ్లుగా ఎందుకు వివాదం నెలకొందని కూడా కేసీఆర్ ప్రశ్నించారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఈ 70 ఏళ్ల కాలం కూడా సరిపోలేదా? అని కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీకి కూడా చురకలు అంటించారు. స్వప్రయోజనాల కోసమే పాకులాడుతున్న కాంగ్రెస్, బీజేపీలు ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలేశాయన-ని, అక్కడితో ఆగకుండా ప్రజల మధ్య వివాదాలు రేకెత్తేలా వ్యవహరిస్తున్నాయని కేసీఆర్ నిప్పులు చెరిగారు.
ఈ సందర్భంగా చైనాలో నీటి ప్రాజెక్టుల గురించి ప్రస్తావించిన కేసీఆర్...ఉత్తర చైనా నుంచి దక్షిణ చైనాకు 600 టీఎంసీలను తరలించేందుకు ఏకంగా 2,400 కిలో మీటర్ల మేర పెద్ద ప్రాజెక్టును చైనా కట్టిందని, మరి ఈ విషయంలో భారత్ కు ఏమైందని కూడా ఆయన ప్రశ్నించారు. చైనా కంటే కూడా భారత్ కు అధిక నీటి వనరులు ఉన్నాయని చెప్పిన కేసీఆర్... దేశంలోని మొత్తం సాగు భూమికి నీటిని అందించినా కూడా ఇంకా 40 వేల టీఎంసీలు వృథా జలాలుంటాయని తెలిపారు. 70 వేల టీఎంసీల జలాలున్న భారత్.. వాటిలో సగం మేర వినియోగించుకున్నా దేశంలోని ప్రతి ఎకరానికి కూడా నీరు అందుతుందని చెప్పారు. అయితే దేశాన్ని ఇప్పటిదాకా పాలించిన రెండు పార్టీలు ఈ విషయాన్ని పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. ఈ తరహా పాలనకు చరమ గీతం పలికేందుకే ఫెడరల్ ఫ్రంట్ కు శ్రీకారం చుట్టామని, ఈ ఫ్రంట్ కు దేవేగౌడ కూడా ఆశీస్సులు అందించారని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీల ఆధ్వర్యంలోని ఫ్రంట్ ల మాదిరిగా ఫెడరల్ ఫ్రంట్ ఉండదని, ఫెడరల్ ఫ్రంట్ కు ఓ బిగ్ ఎజెండా ఉందని, అదే పీపుల్ ఎజెండా అని, అందులోనే ఫార్మర్ అజెండా కూడా ఉందని కేసీఆర్ తనదైన శైలిలో చెప్పుకుంటూ పోయారు.
ప్రస్తుతం జరుగుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కన్నడ నాట ఉన్న తెలుగు ప్రజలు జేడీఎస్‌కు ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు. జేడీఎస్ విజయం కోసం టీఆర్ ఎస్ తమ వంతు సహకారం అందిస్తుందని కూడా ఆయన ప్రకటించారు. అవసరమైతే జేడీఎస్ తరఫున టీఆర్ ఎస్ నేతలు ప్రచారం కూడా నిర్వహిస్తారని కేసీఆర్ చెప్పారు. తన వెంట బెంగళూరు వచ్చిన సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కు సంబంధించిన అంశాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా... ప్రకాశ్ రాజ్ తనకు మిత్రుడని, సమాజ అభివృద్ది కోసం పాటుపడుతున్న వ్యక్తిగా ప్రకాశ్ రాజ్ నిజమైన హీరో అని కేసీఆర్ కితాబిచ్చారు. మొత్తంగా బెంగళూరు వేదికగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు సన్నాహాలను మరోమారు వేగిరం చేసిన కేసీఆర్.. ఆ ఫ్రంట్ కు సంబంధించిన పిక్చర్‌పై క్లియర్‌గానే ప్రకటన చేసినట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి.