Begin typing your search above and press return to search.
ప్రెస్ మీట్ చివర్లో ట్విస్టు అదిరిపోయిందిగా?
By: Tupaki Desk | 6 May 2020 8:50 AM GMTవిషయం ఏదైనా సరే అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్లుగా చెప్పటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రమే సాధ్యమయ్యే అంశం. గంటల తరబడి సాగిన మంత్రివర్గ సమావేశాన్ని మంగళవారం రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత ప్రెస్ మీట్ మొదలెట్టారు. అంత రాత్రి వేళ మొదలైన మీడియా సమావేశం కట్టె.. కొట్టే.. తెచ్చే అన్నట్లు కాకుండా సారుకు అలవాటైన రీతిలోనే సుదీర్ఘంగా సాగింది. కేసీఆర్ చెప్పాల్సింది చెప్పేశాక.. విలేకరులకున్న సందేహాల్ని తీర్చే ప్రయత్నం చేశారు.
జీతాల కోత విషయం తన వరకూ రాలేదని.. అలా ఎలా చేస్తారు? అని అడిగిన కేసీఆర్.. అలా కూడా చేస్తున్నారా? అంటూ విస్మయాన్ని వ్యక్తం చేశారు. అయితే.. ఈ ఎపిసోడ్ లో అసలు ట్విస్టు వేరే ఉంది. అదేమంటే.. టీఆర్ఎస్ అధికారిక పత్రిక.. నమస్తే తెలంగాణలో ఏప్రిల్ నెల జీతాల్లో కోత విధించారు. ఆ మీడియా సంస్థలో పని చేసే సిబ్బంది జీతాల విషయానికి వస్తే.. రూ.20వేలు వస్తున్నోళ్లకు ఎలాంటి కోత లేకుండా.. నెలకు రూ.50వేల వరకూ 30 శాతం వేతన కటింగ్.. నెలకు రూ.50వేలకు పైనే ఎక్కువ జీతాలు ఉన్న ఉద్యోగులకు 40 శాతం చొప్పున కటింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
మిగిలిన మీడియా సంస్థలకు నమస్తే తెలంగాణకు ఉన్న తేడా ఏమంటే.. అధికార పక్షానికి చెందిన మీడియా సంస్థ. ప్రకటనల ఆదాయం రాకున్నా..రెండు..మూడు నెలల పాటురాని రెవెన్యూతో ఆగమాగమైపోయే పరిస్థితి ఏమీ లేదు. అలాంటప్పుడు జీతాల్లో కోత ఎందుకుపెట్టారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. లాక్ డౌన్ వేళ జీతాల్లో కోత పెట్టారన్నంతనే.. అందుకు తగ్గ అప్లికేషన్ పెట్టాలన్న మాట ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి రావటం బాగానే ఉన్నా.. తమ సొంత మీడియా సంస్థలోనూ కోత ఉందన్న విషయాన్ని కేసీఆర్ గుర్తించకపోవటం ఏమిటి? అన్నది ప్రశ్న.
సమాజానికి మేలు చేయాలనుకునేటోడు.. ముందు తన దగ్గరున్న వారి విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటారు కదా? అన్నది ప్రశ్న. తమ పార్టీ నిర్వహించే మీడియా సంస్థకు సంబంధించిన చిన్నపాటి అంశం మీద క్లారిటీ లేని ముఖ్యమంత్రి.. తమ సర్కారులో నిఘా వర్గాలు పోషించే కీలక భూమిక గురించి తరచూ ప్రశంసల వర్షం కురిపిస్తారు. మరి.. అలాంటప్పుడు కీలకమైన మీడియా రంగంలో జీతాల్ని పెద్ద ఎత్తున కట్ చేస్తున్న వైనం పై ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఎందుకు ఇవ్వనట్లు? సీఎం కేసీఆర్ నోటి నుంచి నిజాలు మాత్రమే వస్తాయనుకునే వారికి.. మీడియా సంస్థల్లో పని చేసే ఉద్యోగుల జీతాల కటింగ్ మీద ఆయన స్పందించిన తీరు చూస్తే.. కేసీఆరా మజాకానా? అన్న భావన కలుగక మానదు. సారు నోటి నుంచి నిజాలు మాత్రమే వస్తాయని డిసైడ్ వారి ఆశల మీద బక్కెట్ నీళ్లు చల్లే మాదిరి కేసీఆర్ తాజా వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పక తప్పదు.చివరగా.. ఎవరో ఒక రిపోర్టర్ కాస్త ధైర్యం చేసి.. జీతాలు కట్ చేస్తున్న సంస్థల్లో మన మీడియా సంస్థ కూడా ఉంది సారు అని ఉంటే పరిస్థితి మరెలా ఉండేదో?