Begin typing your search above and press return to search.

కేసీఆర్ వ్యూహ‌మిదే: వ‌స్తే కొండ‌.. పోతే వెంట్రుక‌!

By:  Tupaki Desk   |   4 March 2018 6:42 AM GMT
కేసీఆర్ వ్యూహ‌మిదే: వ‌స్తే కొండ‌.. పోతే వెంట్రుక‌!
X
దేశ రాజకీయాల్ని ద‌క్షిణాది వారు చ‌క్రం తిప్పి ద‌శాబ్దాలు గ‌డిచిపోయిన ప‌రిస్థితి. స‌మీప భ‌విష్య‌త్తులో ఏ నేత అందుకు సిద్ధంగా ఉండ‌ర‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మవుతున్న వేళ‌.. దేశ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం సృష్టిస్తూ.. తాను ఉన్నానంటూ బ‌య‌ట‌కు వ‌చ్చారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. తెలంగాణ‌లో త‌న‌కు తిరుగులేద‌ని.. ఎన్నిక‌లు ఏ వేళ‌లో జ‌రిగినా.. వంద‌కు త‌గ్గ‌కుండా సీట్లు వ‌స్తాయ‌న్న స‌ర్వేలు చెబుతున్న మాట గులాబీ బాస్ బ‌లాన్ని మ‌రింత పెంచాయ‌ని చెబుతారు.

ఇంట గెలిచిన ఆయ‌న ఇప్పుడు వీధిలోకి వ‌చ్చారు. త‌న ఇగోను అదే ప‌నిగా హ‌ర్ట్ చేస్తున్న మోడీకి త‌న స‌త్తా చాటాల‌న్న ఆలోచ‌న ఆయ‌న‌కు వ‌చ్చింది. ఏదో మ‌న‌సుకు హ‌ర్ట్ అవుతుంది కాబ‌ట్టి.. వెనుకా ముందు చూసుకోకుండా కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల‌ని బ‌య‌ట‌కు వ‌చ్చార‌నుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్లే. ఎందుకంటే.. అన్ని చూసుకొన్న త‌ర్వాతే ఆయ‌న రంగంలోకి వ‌చ్చార‌ని చెబుతున్నారు.

త‌న మ‌న‌సులోని మాట‌ను మీడియాతో పంచుకుంటూ సంచ‌ల‌నం సృష్టించిన ఆయ‌న‌.. అంత‌కు ముందు తెర వెనుక చాలానే బ్యాక్ గ్రౌండ్ వ‌ర్క్ చేశారు. ప‌లు రాష్ట్రాల‌కు చెందిన బ‌ల‌మైన ప్రాంతీయ పార్టీ నేత‌ల‌తో మాట్లాడ‌టం.. త‌న‌కున్న భావ‌నే వారికి ఉంద‌న్న విష‌యాన్ని గుర్తించారు. మోడీ మీద పార్టీల్లో అసంతృప్తి ఉంద‌న్న విష‌యం అర్థ‌మైనా.. ఆయ‌న‌కు ధీటుగా నిల‌బ‌డే మొన‌గాడు లేని ప‌రిస్థితి. ఒక‌వేళ ఢీ అంటే ఎలాంటి ప‌రిణామాలు ఎదుర‌వుతాయన్న‌ది అంచ‌నా వేసుకున్న కేసీఆర్‌.. లాభ‌న‌ష్టాల్ని బేరీజు వేసుకున్న త‌ర్వాతే రంగంలోకి దిగిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.

ఈ మాట‌ను బ‌ల‌ప‌రిచే మాట‌ను కేసీఆర్ ప్రెస్ మీట్ లో చెప్పేశారు. తాను ఇప్ప‌టికే స్టాలిన్‌.. అఖిలేశ్ తో స‌హా ప‌లువురు నేత‌ల‌తో మాట్లాడినట్లు చెప్పారు. అదే స‌మ‌యంలో.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో తాను మాట్లాడ‌లేద‌ని ఆయ‌న నిక్క‌చ్చిగా చెప్ప‌టం క‌నిపించింది. ఆ స‌మ‌యంలో ఆయ‌న గొంతులో నిజాయితీ స్ప‌ష్టంగా క‌నిపించింది. రాజ‌కీయ ల‌బ్థి ఎటు ఉంటే అటు వెళ్లే బాబును న‌మ్ముకోకూడ‌ద‌న్న భావ‌న కేసీఆర్ లో క‌నిపిస్తుంద‌ని చెప్పాలి. తాను ఏర్పాటు చేయాల‌నుకుంటున్న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లో బాబుకు నో చెప్ప‌రు కానీ.. బాబు కేంద్రంగా న‌డ‌వ‌ద‌న్న విష‌యం కేసీఆర్ మాట‌ల్లో స్ప‌ష్ట‌మైంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

కేసీఆర్ లో ఉన్న ఒక మంచి ల‌క్ష‌ణం ఏమిటంటే.. ఆయ‌న క‌ల‌లు కంటారు. అది కూడా.. అంద‌రు క‌నే క‌ల‌ను అస్స‌లు క‌న‌రు. ఆ తీరే ఆయ‌న్ను తెలంగాణ జాతిపిత‌గా చేసింద‌ని చెప్పాలి. తాజా ల‌క్ష్యం చూస్తుంటే.. దేశంలోనే అత్యున్న‌త ప‌ద‌వే ల‌క్ష్యంగా కేసీఆర్ రంగంలోకి దిగిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. నాలుగైదేళ్ల వ‌ర‌కూ ఆరోగ్యం స‌హ‌క‌రించి.. దేవుడు మ‌న్నిస్తే అనుకున్న‌ది చేస్తాన‌న్న మాట కేసీఆరే స్వ‌యంగా చెప్ప‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

చిన్న చిన్న క‌ల‌ల్ని క‌న‌టం కేసీఆర్ కు మొద‌టి నుంచి ఇష్టం ఉండ‌దు. ఆయ‌న క‌ల‌లు.. ఆలోచ‌న‌లు భారీగానే ఉంటాయి. ఆయ‌న‌లో మ‌రో సానుకూల‌మైన అంశం ఏమిటంటే.. అంతిమ ఫ‌లితం మీద స్ప‌ష్ట‌త‌తో పాటు.. దాని మీద అమిత‌మైన వ్యామోహాన్ని పెంచుకోరు. త‌న జీవితంలో కాకున్నా.. త‌న త‌ర్వాతి త‌రంలో అయినా తెలంగాణ రాష్ట్ర స్వ‌ప్నం సాకారం కావాల‌ని కోరుకున్న‌ట్లుగా ఆయ‌నే ప‌లుమార్లు చెప్పారు.

ఈ లెక్క‌న చూసిన‌ప్పుడు కేంద్రంలో కీల‌కం కావాల‌న్న ఆశ కేసీఆర్ లో ఉన్న‌ప్ప‌టికీ.. అది రాక‌పోతే ఆగ‌మాగం కావ‌టం క‌నిపించ‌దు. నాడు.. తెలంగాణ రాష్ట్ర సాధ‌న సాధ్య‌మ‌న్న మాట చెప్పి కాగ‌డా ప‌ట్టుకొని దారి వెతుక్కుంటూ వెళ్లిన వేళ‌లో కేసీఆర్ ను చూసి న‌వ్వినోళ్లు చాలామందే ఉన్నారు.

ఈసారి మాత్రం కేసీఆర్ మాట‌ను చాలా సీరియ‌స్ గా విన్నారు. ఆయ‌న ధైర్యానికి మెచ్చుకున్నోళ్లు లేక‌పోలేరు. మోడీ లాంటి మొండి ఘ‌టానికి స‌రిపోయే కేసీఆర్ లాంటోడు రంగంలోకి దిగాల‌ని ఆశ‌గా ఎదురుచూస్తున్న వారికి కేసీఆర్ కొత్త శ‌క్తిని ఇచ్చార‌ని చెప్పాలి. ఆయ‌న వ‌ర‌కు ఆయ‌న‌కు పోయేదేమీ ఉండదు. వ‌స్తే కొండ లాంటి కేంద్రంలో కీల‌క‌మైన ప‌ద‌వి.. లేదంటే వెంట్రుక లాంటి ప్ర‌య‌త్న‌మే. ఇలాంటి లెక్క‌ల‌న్నీ చూసుకోకుండా కేసీఆర్ లాంటోడు రంగంలోకి దిగుతారా?