Begin typing your search above and press return to search.

ప్రపంచ దేశాలకు భారత్ కు ఉన్న తేడా చెప్పిన సీఎం కేసీఆర్

By:  Tupaki Desk   |   22 Dec 2021 4:51 AM GMT
ప్రపంచ దేశాలకు భారత్ కు ఉన్న తేడా చెప్పిన సీఎం కేసీఆర్
X
చాలా అరుదుగా మాత్రమే కనిపించే కార్యక్రమాలకు.. ఈ మధ్యన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కాస్త ఎక్కువగానే హాజరవుతున్నారు. తాజాగా క్రిస్మస్ ను పురస్కరించుకొని హైదరాబాద్ లోని ఎల్ బీ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కిస్మస్ వేడుకల్ని నిర్వహించింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడే క్రమంలో.. పండగ విశిష్ఠతను తనదైన శైలిలో వివరించారు. అంతేకాదు.. మిగిలిన ప్రపంచానికి.. భారత్ కు ఉన్న వ్యత్యాసాన్ని ఆయన చెప్పుకొచ్చారు.

ప్రపంచంలోని ఇస్లాం దేశాల్లో రెండే పండుగలు ఉంటాయని.. అదే సమయంలో క్రిస్టియన్ దేశాల్లోనూ రెండే పండుగలు ఉంటాయన్నారు. కానీ.. నెల వ్యవధిలోనే పండుగలు చేసుకునే దేశం ఇండియా ఒక్కటి మాత్రమేనని వ్యాఖ్యానించారు. క్రిస్మస్.. రంజాన్.. దసరా.. దీపావళి.. సంక్రాంతి.. ఇలా అన్ని పండుగల్ని జరుపుకుంటామని.. ప్రపంచంలో అత్యంత రంగుల దేశం ఇండియా ఒక్కటేనని చెప్పారు.

రాష్ట్రంలోని ప్రజలంతా ఒక్కటేనని చెప్పిన సీఎం కేసీఆర్.. తెలంగాణలో పండుగలను సెలబ్రేట్ చేయాలని ఎవరూ చెప్పలేదని.. దరఖాస్తు పెట్టలేదన్నారు. ఎన్నో పోరాటాలు.. అనేక క్షోభలు ఎదుర్కొన్న తర్వాత తెలంగాణలో అందరూ బాగుండాలని ఒక పాలసీని తాము తీసుకున్నామన్నారు. తమ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ప్రతి ఒక్కరి బాధ్యతను తీసుకుంటుందన్నారు.

తెలంగాణలో ఎవరిపైనా ఎవరూ దాడి చేయరని.. అందరిని కాపాడే బాధ్యత తెలంగాణ సర్కారుదేనని చెప్పారు. పండుగ వేళ ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనూ.. తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల్ని.. డెవలప్ మెంట్ గురించి అదే పనిగా కేసీఆర్ వివరించటం గమనార్హం. పండుగవేళలోనూ పాత మొగుడు మాదిరి.. మీరు చేసిన పనుల గురించి గొప్పలు ఇప్పుడు కూడా చెప్పుకోవాలా కేసీఆర్ జీ?