Begin typing your search above and press return to search.

యాదాద్రిలో సారు..కారు బొమ్మ తప్పు కాదు..కానీ తీసేయటానికి రెఢీనట!

By:  Tupaki Desk   |   7 Sep 2019 5:55 AM GMT
యాదాద్రిలో సారు..కారు బొమ్మ తప్పు కాదు..కానీ తీసేయటానికి రెఢీనట!
X
యాదాద్రి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రంతో పాటు.. పార్టీ గుర్తు అయిన కారు బొమ్మతో పాటు టీఆర్ఎస్ సర్కారు పథకాల్ని అష్టభుజి ప్రాకారంలోని రాతి స్తంభాలపై చెక్కిన వైనం బయటకు రావటం.. పెను సంచలనంగా మారటం తెలిసిందే. ఈ అంశంపై వైటీడీఏ ఉపాధ్యక్షుడు కిషన్ రావు.. ఆర్ట్ డైరెక్టర్ కమ్ ఆర్కిటెక్ట్ ఆనందసాయి.. స్థపతి డాక్టర్ ఆనందాచారి వేలు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారి మాటల్లో తడబాటు కనిపించటమే కాదు.. సమర్థన కూడా పేలవంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

రాతి శిలలపై కేసీఆర్.. కారు బొమ్మలతో పాటు కేసీఆర్ ప్రభుత్వ పథకాల బొమ్మల్ని చిత్రించిన దానిపైన వారు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆసక్తికరంగానే కాదు.. ఆశ్చర్యాన్ని రేకెత్తించేలా ఉండటం గమనార్హం. కారుతో పాటు సైకిల్ రిక్షా.. గుర్రపు జట్కాబండి బొమ్మలు కూడా చెక్కినట్లు చెప్పారు. అందుకు సంబంధించిన ఫోటోల్ని చూపించారు. అదే సమయంలో సైకిల్ కూడా చెక్కామన్న వారు.. దానికి సంబంధించిన ఫోటోను మాత్రం చూపించకపోవటం గమనార్హం.

కారు బొమ్మను తప్పుపడుతున్నవారు.. తాము చెక్కిన కమలం బొమ్మను కూడా చెక్కామంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. కేసీఆర్ బొమ్మను చెక్కిన శిల్పి తనకు తానుగా చెక్కిందే తప్పించి.. తాము ఎవరం కూడా ఆదేశించలేదన్నారు. అయితే.. ఆలయానికి సంబంధించి ప్రతి విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నిశితంగా పరిశీలన జరిపిన తర్వాత.. ఆయన నిర్ణయాలకు అనుగుణంగానే పనులు జరుగుతున్న వేళ.. శిల్పులకు స్వేచ్ఛ ఇచ్చి వారి ఇష్టానికి తగినట్లుగా బొమ్మల్ని చెక్కారన్న మాటపై పలువురుసందేహాలు వ్యక్తమవుతున్నాయి. చూస్తుంటే.. ఎవరో చేసిన తప్పును శిల్పుల మీదకు నెట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా చెబుతున్నారు. కొసమెరుపు ఏమంటే.. శిల్పులు తమకు తోచినట్లుగా శిల్పాలు చెక్కారని.. అభ్యంతరాలు ఉంటే వాటిని తీసి వేస్తామన్నారు.