Begin typing your search above and press return to search.

విమ‌ర్శ‌లు బేఖాత‌రు.. హుజూరాబాద్‌కే `ద‌ళిత బంధు` త‌ర్వాతే రాష్ట్రంలో!

By:  Tupaki Desk   |   26 July 2021 5:30 PM GMT
విమ‌ర్శ‌లు బేఖాత‌రు.. హుజూరాబాద్‌కే `ద‌ళిత బంధు` త‌ర్వాతే రాష్ట్రంలో!
X
న‌లువైపుల నుంచి విమ‌ర్శ‌లు చుట్టుముట్టినా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. త‌న ప‌ట్టుద‌ల‌ను, బెట్టుద‌ల‌ను విడిచిపెట్ట‌డం లేదు. ముఖ్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో విజ‌యమే ల‌క్ష్యంగా ఆయ‌న వేస్తున్న అడుగులు, తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు చుట్టుముడుతున్నాయి. అయిన‌ప్ప‌టికీ.. కేసీఆర్ వినిపించుకోవ‌డం లేదు. పైగా త‌నదైన శైలిలో దూసుకుపోతున్నారు. తాజాగా ఆయ‌న ద‌ళిత బంధు ప‌థ‌కంపై స‌మీక్ష నిర్వ‌హించారు. దళిత బంధు కేవలం కార్యక్రమం కాదని.. ఉద్యమం అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ సదస్సులో పాల్గొన్నవారంతా తెలంగాణ వ్యాప్తంగా దళితులకు అవగాహన కల్పించాలన్నారు.

దళిత బంధు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే దళితుల అభివృద్ధితోపాటు రాష్ట్రాభివృద్ధికి దారులువేస్తుం దన్నారు. నైపుణ్యం, ప్రతిభ ఉన్న దళిత వర్గాన్ని అంతరానితనం పేరుతో ఊరవతల ఉంచి ఉత్పాదకరంగానికి దూరం చేయడం బాధాకరమన్నారు. మహిళలను జెండర్ పేరుతో అనుత్పాదక రంగానికి పరిమితం చేయడం తెలివితక్కువపని ముఖ్యమంత్రి అన్నారు. హుజూరాబాద్ నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు సాధించే విజయాలపై.. యావత్ తెలంగాణ దళిత బంధు విజయం ఆధారపడి ఉందన్నారు. దళిత బంధు పథకం పటిష్ఠ అమలుకు ప్రతినిధులు డేగ కన్నుతో పనిచేయాలని సూచించారు.

ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉండే ఇతర రంగాలను గుర్తించాలన్నారు. వాటిలో దళితులకు రిజర్వేషన్లు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ కార్య‌క్ర‌మంలో హుజరాబాద్ నియోజకవర్గానికి చెందిన 412 మంది దళిత బంధువులతోపాటు, 15 మంది రిసోర్స్ పర్సన్లు, అధికారులు పాల్గొన్నారు. మంచి కార్యక్రమానికి ప్రతికూల శక్తులు అడ్డుపడుతూ ఉంటాయన్న కెసిఆర్ మనలో పరస్పర సహకారం పెరగాలని, ద్వేషాలు పోవాలని సూచించారు. గతంలో ఒక్కడితో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం భారత రాజకీయ వ్యవస్థ పై ఒత్తిడి తెచ్చి విజయం సాధించిందని గుర్తు చేశారు.

నమ్మిన ధర్మానికి కట్టుబడి ప్రయాణం సాగించినప్పుడే విజయం సాధిస్తామని పేర్కొన్న కేసీఆర్, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ చేసిన కృషి తో దళిత సమాజంలో వెలుగు రేఖలు వచ్చాయన్నారు. దళితులు పరస్పర సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుకోవాలని, దళితవాడలలో ఒకరిపై ఒకరు పెట్టుకున్న పరస్పర కేసులను రద్దు చేసుకోవాలని సూచించారు. హుజూరాబాద్ నియోజకవర్గం లో ఈ పథకాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దళితులు ఒకరిపై ఒకరు పరస్పర అనుబంధం పెంపొందించుకున్నప్పుడే విజయానికి బాటలు పడతాయి అని సూచించారు. ఒక ఉద్యమంలా దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. నిజానికి ద‌ళిత బంధు అమ‌లుపై ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. కేవ‌లం హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ను దృష్టిలో పెట్టుకునే ఇలా చేస్తున్నార‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయినా కేసీఆర్ దూకుడు త‌గ్గ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.