Begin typing your search above and press return to search.

మరో కీలక పోస్టును రద్దు చేసేసిన కేసీఆర్

By:  Tupaki Desk   |   11 Feb 2020 6:15 AM GMT
మరో కీలక పోస్టును రద్దు చేసేసిన కేసీఆర్
X
ఎప్పుడూ ప్రగతిభవన్ లోనూ.. ఫాంహౌస్ లోనూ మాత్రమే ఉండే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్లోకి పెద్దగా రారు. ఒకవేళ వచ్చినా.. అరకొరే అన్నట్లుగా చెబుతారు. పని చేయనట్లు గా అందరికి అనిపించే కేసీఆర్.. తన మీద వచ్చే విమర్శల్ని అస్సలు లెక్క చేయరు. ఎవరేం అనుకున్నా నాకేంటన్నట్లు ఉండే కేసీఆర్.. ప్రజలకు ఎప్పుడేం అర్థం కావాలో దాన్ని అర్థమయ్యేలా చేయటంలో సక్సెస్ అవుతున్నారని చెప్పాలి. ఈ కారణంతోనే ఆయన రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకున్నారని చెప్పాలి.

పాలనా పరంగా తన మార్కు చూపించాలన్న విషయం మీద పట్టుదలతో ఉన్న కేసీఆర్.. గంటల కొద్దీ చేసిన మేథోమధనం ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమయ్యేలా చేస్తోంది. రెవెన్యూశాఖను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశాన్ని కేసీఆర్ ప్రకటించినప్పుడు.. అదేమంత ఈజీ కాదన్న వాదన వినిపించింది. కానీ.. కేసీఆర్ లాంటి అధినేత నోట్లో నుంచి ఒక మాట వచ్చినా.. పట్టుదలకు పోయినా దేనికైనా రెడీ అన్నట్లుగా వ్యవహరిస్తారు.

దీనికి తగ్గట్లే.. మొన్నటికి మొన్న రెవెన్యూ వ్యవస్థలో కీలకమైన జేసీ పోస్టుకు మంగళం పాడేసిన సారు.. తాజాగా జిల్లా రెవెన్యూ వ్యవస్థలో అతి ముఖ్యమైన డీఆర్వో (డిస్టిక్ట్ రెవెన్యూ ఆఫీసర్) పోస్టును రద్దు చేసేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. రానున్న రోజుల్లో జిల్లాల్లో కలెక్టర్.. అదనపు కలెక్టర్.. అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) మాత్రమే ఉంటారు.

జిల్లా స్థాయిలో గ్రామ పంచాయితీలు.. నగర పాలక పంచాయితీలు.. నగర పాలక సంస్థల పైనా పూర్తి అజమాయిషీ చెలాయించేలా కొత్త పోస్టును కేసీఆర్ సర్కారు క్రియేట్ చేసింది. ప్రభుత్వ ఫ్లాగ్ షిప్ పథకాలైన పల్లె ప్రగతి.. పట్టణ ప్రగతి.. హరితహారం లాంటి వాటిని అమలు చేయించటం వీరిదే బాధ్యత గా చెబుతున్నారు. మొత్తంగా రెవెన్యూ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తానన్న సీఎం.. అందుకు తగ్గట్లే తన ప్లాన్ ను అమల్లోకి తెస్తున్నారని చెప్పాలి. ఇప్పటికే సీసీఎల్ఏ పోస్టును.. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పోస్టుతో పాటు.. రెవెన్యూ శాఖకు ప్రత్యేక మంత్రి పదవి కి మంగళం పాడేసిన కేసీఆర్.. రానున్న రోజుల్లో తన అంతిమ లక్ష్యమైన రెవెన్యూ శాఖను రద్దు చేసేందుకు వీలుగా అడుగులు వేస్తున్నారని చెప్పక తప్పదు.