Begin typing your search above and press return to search.

సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం ... 50వేల నియామకాలకి ఆదేశం !

By:  Tupaki Desk   |   10 May 2021 3:07 AM GMT
సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం ... 50వేల నియామకాలకి ఆదేశం !
X
తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా మహమ్మారి జోరు కొనసాగుతుండటం తో ప్రగతి భవన్‌ లో తాజాగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా పనిచేస్తున్న రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సిబ్బందికి పని ఒత్తిడి తగ్గించాలని ,ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50వేల మంది ఎంబీబీఎస్ పూర్తి చేసి సిద్ధంగా ఉన్న అర్హులైన వైద్యుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు. రెండు, మూడు నెలల కాలానికి డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బందిని తక్షణమే నియమించుకోవాలని, అలాగే వారికి గౌరవ ప్రదమైన రీతిలో జీతాలు అందించాలని అన్నారు.

అలాగే , కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో రాష్ట్రం కోసం పనిచేస్తున్నందున వారి సేవలకు సరైన గుర్తింపునివ్వాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వారికి వెయిటేజీ మార్కులను కలపాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.కష్టకాలంలో ప్రజల కోసం సేవ చేయడానికి ముందుకు రావాలని సీఎం కేసీఆర్ యువ డాక్టర్లకు పిలుపునిచ్చారు. వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను తక్షణమే ప్రారంభించాలని, వైద్య సిబ్బందిని నియమించాలని కేసీఆర్ నిర్ణయించారు. కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలో నిర్మించిన ఎంజీఎంకు చెందిన 250 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని, ఆదిలాబాద్ జిల్లా రిమ్స్‌ లోని మరో 250 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు.

సీఎంఎస్ ఎస్ వై కింద ఎంజీఎంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ నిర్మాణానికి ప్రభుత్వ వాటా కింద తక్షణం అందజేయాల్సిన 8 కోట్ల రూపాయలను, రిమ్స్‌ లో ఇదే పథకం కింద నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రభుత్వ వాటా కింద 20 కోట్ల రూపాయలను, మొత్తం 28 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. అలాగే , వరంగల్ ఆస్పత్రి కోసం 363 మంది వైద్య సిబ్బందిని, ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి కోసం 366 మంది వైద్య సిబ్బందిని, మొత్తం 729 మంది సిబ్బంది నియామకానికి తక్షణమే చేపట్టాలని అన్నారు. రాష్ట్రంలో లాక్డౌన్ విధించడం వల్ల ప్రయోజనం లేదని సీఎం ఇదివరకే స్పష్టం చేశారు. దీంతో కరోనా కట్టడి, మరియు చికిత్సలపై దృష్టి సారించారు సీఎం కేసిఆర్. ఈ నేపథ్యంలోనే కరోనా వ్యాప్తికి కారణమైన వారిని గుర్తించి వ్యాక్సిన్ ఇప్పించాలని సీఎం సూచించారు .