Begin typing your search above and press return to search.

ఆ రోజు నేను వెనక్కి తగ్గలేదు .. అందుకే తెలంగాణ

By:  Tupaki Desk   |   15 April 2021 8:30 AM GMT
ఆ రోజు నేను వెనక్కి తగ్గలేదు .. అందుకే తెలంగాణ
X
నాగార్జునసాగర్‌ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచార పర్వం చివరి దశకి చేరుకున్న సమయంలో నిన్న సీఎం కేసీఆర్ హాలియాలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని టిఆర్ ఎస్ అభ్యర్థి అయిన నోముల భగత్‌ కి ఓటు వేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు. ఎవరికి ఓటు వేస్తే నాగార్జునసాగర్ అభివృద్ధి చెందుతుందో ప్రజలు ఆలోచించుకోవాలని సీఎం కేసీఆర్ చెప్పారు. మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్యను కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు కురిపించే ఓట్లలాగే నెల్లికల్‌ లిఫ్టు నుంచి నీళ్లు దూకుతాయని హామీ ఇచ్చారు. నందికొండకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్న జానారెడ్డి 30 ఏళ్లలో హాలియాకు డిగ్రీ కళాశాలను కూడా తీసుకురాలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ నేతలు పదవుల కోసం పాకులాడతారన్నారు. తెలంగాణ కోసం పదవులను గడ్డిపోచల్లాగా వదులుకున్నామని అన్నారు.

ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ నాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కొరకు నేను దీక్ష కి పూనుకున్న సమయంలో హైదరాబాద్ నిజాం ఆసుపత్రి వైద్యులు నన్ను హెచ్చరించారు అని , కోమాలోకి వెళ్తానని , వెళ్తే బ్రతకను అని భయపెట్టారు అని చెప్పారు. అయినప్పటికీ నేను దీక్ష విరమించలేదు అని అన్నారు. కేసీఆర్ చచ్చుడో .. తెలంగాణ వచ్చుడో అనే మాట మీదే ఉన్నానని తెలిపారు. ఆ దీక్ష వల్లే తెలంగాణ వచ్చింది అని , ఆ విషయాన్ని ఎవరూ మరచిపోవద్దు అని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందంటే.. అది టీఆర్ ఎస్ వల్లే అని కేసీఆర్ అన్నారు. గులాబీ జెండా పుట్టకముందు తెలంగాణ అనాథలా ఉండేదని, ఇప్పుడు అదే తెలంగాణ దేశంలో నంబర్ ‌వన్ స్థానానికి దూసుకుపోతోందని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో అన్ని మతాలు, కులాలు, వర్గాల కోసం టీఆర్ ఎస్ ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. తెలంగాణలోని అన్ని వర్గాల ఉద్యోగులను టీఆర్ ఎస్ ప్రభుత్వం బాగా చూసుకుంటోందని తెలిపారు. కాంగ్రెస్ నేతలు పదవుల కోసం పెదవులు మూసుకున్నారని అన్నారు. ఇక ముస్లిం సోదరుల విజ్ఞప్తి మేరకు హాలియాలో షాదీఖానా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో భగత్‌ గెలిస్తే నియోజకవర్గానికి చెందిన కోటిరెడ్డిని ఎమ్మెల్సీ చేయడం ఖాయమని తెలిపారు. ఆ విదంగా నాగార్జున సాగర్ కి రెండు పదవులు లభిస్తాయని అన్నారు. అలాగే ఇటీవల పార్టీలో చేరిన బీజేపీ నేత కడారి అంజయ్యకు సైతం పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని హామీ ఇచ్చారు.