Begin typing your search above and press return to search.

అసెంబ్లీలో చూసి చదువుడేంది కేసీఆర్..?

By:  Tupaki Desk   |   16 Dec 2016 8:05 AM GMT
అసెంబ్లీలో చూసి చదువుడేంది కేసీఆర్..?
X
కొంతమంది కొన్ని పనులు చేస్తే అస్సలు నప్పవు. వారికి ఏ మాత్రం సూట్ కానట్లుగా ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంగతే తీసుకోండి. ఆయన మంచి వక్త. ఏ విషయం మీదనైనా సరే సాధికారతతో మాట్లాడతారు. ఒకవేళ.. ఆయనకు అవగాహన లేని విషయం ఏదైనా వస్తే.. దాని అంతు చూసే వరకూ నిద్రపోరు. ఆ అంశానికి సంబంధించిన నిపుణుల్ని పిలిపించుకొని వివరాలు సేకరించటంతోపాటు.. అందుకు సంబంధించిన ముఖ్యమైన పుస్తకాల్ని సేకరించి.. వాటిని చదవటం ద్వారా పూర్తి అవగాహన తెచ్చుకోవటమే కాదు.. ఆయా రంగాల్లో నిపుణులతో ఆ అంశాన్ని చర్చించే స్థాయి వరకూ అవగాహన పెంచుకునే సత్తా కేసీఆర్ సొంతం.

ఇలాంటివి గతంలో ఆయన ఎన్నో చేశారు. అలాంటి ఆయన.. ఏదైనా విషయం మీద మాట్లాడాలంటే ఆసువుగా మాట్లాడేస్తారు. అలాంటి వ్యక్తి.. పేపర్లు పట్టుకొని.. అందులో రాసిన అంశాల్ని చూసి చదివే తీరు ఏ మాత్రం ఆయనకు నప్పదనే చెప్పాలి. ఎంత కష్టమైన అంశాన్ని సైతం.. తనదైన శైలిలో ముచ్చటగా చెప్పేయటమే కాదు.. సులువుగా అర్థమయ్యేలా ఉండటం.. గ్రామీణులకు సైతం ఆయన చెప్పే మాటలు ఆసక్తికరంగా అనిపించేలా ఉండటమే కాదు.. అవగాహన పెంచేలా ఉంటాయి.

అలాంటి కేసీఆర్ తాజాగా మొదలైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పెద్దనోట్ల రద్దు అంశంపై ప్రధాని నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయం.. దానిపై తెలంగాణ ప్రభుత్వం.. ముఖ్యమంత్రిగా తాను చేసిన పనులకు సంబంధించిన నోట్ ను కేసీఆర్ చూసి చదువుతూ చెప్పటం ఆయనకే మాత్రం నప్పలేదనే చెప్పాలి. కేసీఆర్ లాంటి వ్యక్తికి నోట్ల రద్దు అంశంపై మాట్లాడటం ఏ మాత్రం కష్టం కానే కాదు. ప్రధానికే ఆయన సలహాలు ఇచ్చిన పెద్దమనిషి. అలాంటి వ్యక్తి.. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తమ ప్రభుత్వం స్వాగతిస్తుందని చెప్పటమే కాదు.. కేంద్రం ఇంకేం చేయాలన్న సూచనల్ని నోట్ ద్వారా చెప్పారు.

సున్నితమైన అంశం కావటం.. ఏదైనా చిన్న తప్పు దొర్లినా దాని వల్ల జరిగే డ్యామేజ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా ఉండేందుకే.. ముందుగా ప్రసంగ పాఠాన్ని సిద్ధం చేసి కేసీఆర్ కు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ వాదన బాగానే ఉన్నా.. కేసీఆర్ లాంటి అధినేత.. పేపర్లో విషయాన్ని చూసి చదవటం మింగుడుపడని రీతిలో ఉంటుందనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/