Begin typing your search above and press return to search.

నిధుల కొరతను చాకచక్యంగా కన్వేచేసిన కేసీఆర్!

By:  Tupaki Desk   |   18 Dec 2019 1:47 PM GMT
నిధుల కొరతను చాకచక్యంగా కన్వేచేసిన కేసీఆర్!
X
ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన యాదాద్రి దేవాల‌య ప‌నుల విష‌యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు చేసిన ప్ర‌క‌ట‌న ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. వివిధ శాఖల అధికారులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ఆరున్నర గంటలపాటు యాదాద్రిలో పర్యటించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ - ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆధ్యాత్మిక క్షేత్రంగా భాసిల్లబోతున్న యాదాద్రి ఆలయ పునరుద్ధరణ పనులు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేవి కాబట్టి ఎలాంటి తొందరపాటు - ఆతృత అవసరం లేదని - ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం పూర్తి నాణ్యతా ప్రమాణాలతో - అత్యంత పకడ్బందీగా నిర్మాణాలు జరుగాలని తెలంగాణ ముఖ్యమంత్రి తెలిపారు. అయితే, ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌ట‌న వెనుక నిధుల కొర‌త ఓ కార‌ణ‌మ‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

యాదాద్రి ప్రధానాలయంలో జరుగుతున్న నిర్మాణాలన్నీ ఆధ్యాత్మికత - ధార్మికత ఉట్టిపడేలా ఉన్నాయని సీఎం కేసీఆర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పనులు పూర్తయ్యాక అద్భుతమైన దివ్యక్షేత్రంగా భక్తులకు సాక్షాత్కారం అవుతుందని ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెప్పారు. `ఆలయ నిర్మాణపనులు ఒక డెడ్‌లైన్ పెట్టుకొని చేసేవి కావు. శాశ్వతంగా ఉండాల్సిన నిర్మాణాలు కాబట్టి ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భగుడి ఆకారం - ప్రాశస్త్యం చెక్కు చెదరకుండా నిర్మాణాలు సాగాలి. ఏమాత్రం తొందరపాటు అవసరంలేదు. జాగ్రత్త - నాణ్యత పాటించాలి. నిర్మాణాలు పటిష్ఠంగా ఉండాలి. ప్రతిదీ నియమాలను అనుసరించి సాగాలి` అని తెలిపారు. అన్ని పనులు పూర్తికావడానికి రెండు నెలల సమయం పడుతుందని అధికారులు సీఎంకు నివేదించారు. భక్తులకు దర్శనం కలిగించడం ఎంత ముఖ్యమైన విషయమో.. వారికి వసతులు కల్పించడం కూడా అంతే ముఖ్యమని సీఎం అన్నా రు.

వాస్త‌వానికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌చ్చే ఏడాది ఫిబ్రవరిలో సుదర్శన నారసింహయాగం నిర్వహించ తలపెట్టారు. తాజా ప‌రిశీల‌నలో దాని గురించి కూడా చ‌ర్చించారు. ఫిబ్ర‌వరి నాటికి వసతులు - నిర్మాణాలు పూర్తవుతాయా? అని సీఎం ఆరా తీశారు. అయితే, ప్ర‌భుత్వం నుంచి నిధుల విడుద‌ల‌లో జాప్యం ఉన్నందున‌..డెడ్‌ లైన్ లోగా ప‌నులు అవ‌డం క‌ష్ట‌మ‌ని వైటీడీఏ వ‌ర్గాలు స్ప‌ష్టం చేశాయి. దీంతో ముఖ్య‌మంత్రి కేసీఆర్ డెడ్‌ లైన్‌ ను ఉప‌సంహ‌రించుకున్న‌ట్లు స‌మాచారం. కాగా , త‌న ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మానికే కేసీఆర్ నిధులు విడుద‌ల చేయ‌లేని ప‌రిస్థితిలో..తెలంగాణ ఖ‌జానా ఉంద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.