Begin typing your search above and press return to search.

హైదరాబాద్ మహానగర శివారుకు తీపి కబురు

By:  Tupaki Desk   |   7 Oct 2021 12:30 PM GMT
హైదరాబాద్ మహానగర శివారుకు తీపి కబురు
X
ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరం.. ఇప్పుడు శివారులో పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. అత్యధిక జనసాంద్రత ఉన్నప్రాంతాలుగా శివారులు ఉంటున్నట్లుగా చెబుతున్నారు. ఎంత వేగంగా శివారు విస్తరిస్తోందో.. అంత వేగంగా మౌలిక సదుపాయాల కల్పన మాత్రం జరగని పరిస్థితి. ఇలాంటివేళ. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. పల్లె.. పట్టణ ప్రగతిపై అసెంబ్లీలో జరిగిన స్వల్ప కాలిక చర్చలో భాగంగా కేసీఆర్ కీలక ప్రకటన చేశారు.

పెరుగుతున్న హైదరాబాద్ అవసరాలకు అనుగుణంగా రూ.1200 కోట్లతో నగర శివారు ప్రాంతాల డెవలప్ మెంట్ కు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. పేదవారికి రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తున్నామని.. రూ.5378 కోట్లతో ఇంటింటికి తాగునీరు అందిస్తున్నామన్నారు. భవిష్యత్తులో 24 గంటల పాటు నీళ్లు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇంకేమన్నారంటే..

- మున్సిపల్ రంగంలో అనేక మార్పులు తీసుకొచ్చాం. పౌరుల భాగస్వామ్యం ఉండేలా చట్టాలు తీసుకొచ్చాం. పట్టణాల్లో పచ్చదనం పెరిగేలా 10 శాతం గ్రీన్ బడ్జెట్ కేటాయించాం.

- పట్టణాల్లో చెరువులను డెవలప్ చేస్తున్నాం. పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచి సకాలంలో చెల్లిస్తున్నాం. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాల్ని భారీగా పెంచాం.

- గతంలో బోరు బావుల్లో పడి ఎందరో పిల్లలు చనిపోయారు. ఇప్పుడు పల్లెల్లో నిరుపయోగంగా ఉన్న బోరుబావులను పూడ్చేశాం. ప్రతి గ్రామానికి నెలకు రూ.5లక్షల ఆదాయం సమకూరేలా చేస్తున్నాం.

- గతంలో గ్రామాల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉండేది. ఏ ఊరికి వెళ్లినా ఎమ్మెల్యేలు.. మంత్రుల ముందు బిందెలతో నిరసనలు జరిగేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు.

- తెలంగాణ ప్లోరైడ్ రహిత రాష్ట్రమని పార్లమెంటులో కేంద్రమే చెప్పింది.

- ప్రస్తుతం 9800 మంచి పంచాయితీ కార్యదర్శకులు ఉన్నారు. ప్రతి ఊరికి ఒక పంచాయితీ కార్యదర్శి ఉన్నది ఏ రాష్ట్రంలోనూ లేరు.

- 300 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని చెబితే 350 ఏర్పాటు చేశారు. పల్లె దవాఖానాల్ని కూడా ఏర్పాటు చేయనున్నాం. ప్రజలకు పల్లెల్లోనే వైద్యం అందేలా చేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో డయాగ్నోస్టిక్ కేంద్రాల్ని పెంచుతాం.