Begin typing your search above and press return to search.

సీఎం కేసీఆర్ వారి సరికొత్త సిద్దాంతం.. ‘లాక్ డౌన్ వేస్ట్’

By:  Tupaki Desk   |   7 May 2021 3:24 AM GMT
సీఎం కేసీఆర్ వారి సరికొత్త సిద్దాంతం.. ‘లాక్ డౌన్ వేస్ట్’
X
కాలానికి తగ్గట్లు అభిప్రాయాలు మారుతూ ఉంటాయన్న మాట కొందరి నోట నుంచి వస్తుంటుంది. అదెంత నిజమన్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా ప్రకటనతో ఈ విషయాన్ని వెల్లడించారు. పక్కనున్న ఏపీ సీఎం.. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ విధించటమే కాదు.. వాహనాల రాకపోకల విషయంలోనూ కఠిన పరిమితుల్ని విధించటం తెలిసిందే. కేసుల తీవ్రత భారీగా పెరిగిపోతున్న వేళ.. కరోనా కట్టడికి పలు రాష్ట్రాలు పాక్షిక లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్న వేళ.. అందుకు భిన్నంగా కేసీఆర్ తన తాజా సిద్ధాంతాన్ని ఆవిష్కరించారు. లాక్ డౌన్ వేస్ట్ అని ఒక్క మాటలో తేల్చేశారు.

కరోనా నేపథ్యంలో కొద్దికాలంగా ఫాంహౌస్ లోనే ఉండిపోయిన ఆయన.. పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన నేపథ్యంలో ప్రగతిభవన్ కు చేరుకున్నారు. కోవిడ్ తాజా పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆర్థిక.. వైద్య ఆరోగ్య శాఖల అధికారులతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో లాక్ డౌన్ అవసరం లేదన్నారు. దాని వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని చెప్పిన ఆయన.. తన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు కారణం ఇదేనంటూ కొన్ని వ్యాఖ్యలు చేయటం గమనార్హం. ఆయనేమన్నారంటే..

- రాష్ట్రంలో 30 లక్షల మంది దాకా వలస కార్మికులున్నారు. మొదటివేవ్‌లో లాక్‌డౌన్‌తో వీరందరి జీవితాలు చెల్లాచెదురైన పరిస్థితిని మనం చూశాం. ఇప్పుడు లాక్‌డౌన్‌ పెడితే.. వీరంతా తమ రాష్ట్రాలకు వెళ్తే.. తిరిగి రావడం కష్టమే.

- రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పుష్కలంగా ఉంది. 6,144 కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం నిండిపోయింది. ధాన్యం సేకరణ ఆషామాషీ కాదు.

- ఐకేపీ కేంద్రాల బాధ్యులు, హమాలీలు, తూకం వేసేందుకు కాంటా పెట్టేవారు, మిల్లులకు తరలించే కూలీలు, లారీలు.. మిల్లుల నుంచి ఎఫ్‌సీఐ గోదాములకు తరలించే ప్రక్రియ.. ఈ మొత్తం వ్యవహారంలో లక్షల మంది భాగస్వాములవుతారు. ఈ ప్రక్రియలో వలస కూలీల పాత్ర కూడా కీలకం.

- లాక్‌డౌన్‌ పెడితే రైతుకు నష్టమే. కొనుగోలు వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోతుంది.

- నిత్యావసరాల సరఫరా, పాలు, కూరగాయలు, పండ్లు, అత్యవసర వైద్య సేవలు, ప్రసవాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలను ఆపలేం. ఆక్సిజన్‌ సరఫరా అత్యంత కీలకం. లాక్‌డౌన్‌ విధిస్తే.. వీటన్నింటికీ ఆటంకాలేర్పడుతాయి. ఒక భయానక పరిస్థితి సృష్టించినట్లవుతుంది. అందుకే.. లాక్‌డౌన్‌కు ప్రభుత్వం సిద్ధంగా లేదు.

- అలాగని కరోనా వ్యాప్తిని అడ్డుకోకుండా ఉండలేం. కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను మైక్రో కంటైన్‌మెంట్లుగా ప్రకటిస్తాం.

- లాక్‌డౌన్‌తో పరిశ్రమలు మూతబడి ఉత్పాదకత ఆగిపోతుందని, అంతా ఆగమాగం అవుతుందని, క్యాబ్‌డ్రైవర్లు, ఆటోరిక్షా వాలాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కొన్ని లక్షల కుటుంబాలు ఉపాధి కోల్పోయే పరిస్థితి తలెత్తితే.. మొత్తం వ్యవస్థలే కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది.

ఇన్ని మాటలు చెప్పిన సీఎం కేసీఆర్.. గత ఏడాది లాక్ డౌన్ సమయంలో దేశంలో మరే రాష్ట్రంలోలేని రీతిలో తన శక్తియుక్తుల్ని ప్రదర్శిస్తూ గ్రామాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేయటాన్ని మర్చిపోకూడదు. ధాన్యం నిల్వ చేసేందుకు సంచుల కొరత ఉందన్న విషయాన్ని గుర్తించి.. అందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయటమే కాదు.. కొందరు వలస కూలీల్ని వేరే రాష్ట్రాల నుంచి రప్పించటాన్ని మర్చిపోకూడదు.

లాక్ డౌన్ అమలు చేయాలని డిసైడ్ అయినప్పుడు కేసీఆర్ మాట్లాడిన తీరుకు.. అందుకు భిన్నంగా ఉన్న వేళ.. ఆయన మాటల్లో వచ్చిన తేడా చూస్తే.. ముక్కున వేలేసుకోవాల్సిందే. కాలానికి తగ్గట్లు.. తన ఆలోచనలకు అనుగుణంగా ఒకే విషయాన్నివేర్వేరుగా ఎలా ఆవిష్కరిస్తారన్న విషయాన్ని కేసీఆర్ ను చూసి నేర్చుకోవాల్సిందే.