Begin typing your search above and press return to search.

రాజ్ భవన్ కు కేసీఆర్.. ఈసారి ఎందుకంటే?

By:  Tupaki Desk   |   3 Jun 2020 9:02 AM GMT
రాజ్ భవన్ కు కేసీఆర్.. ఈసారి ఎందుకంటే?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తీరు మిగిలిన వారికి భిన్నం. ఎప్పుడు.. ఎలా వ్యవహరిస్తారో ఒక పట్టాన అర్థం కాదు. ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే వారికి సైతం అర్థం కాని ఫజిల్ లా ఉంటారన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అందుకు తగ్గట్లే ఆయన తీరు ఉంటుంది. అందరూ అనుకునేలా చేయకపోవటం ఆయన ప్రత్యేకతగా చెప్పాలి. తనకు అత్యంత సన్నిహితుడైన నరసింహన్ గవర్నర్ గా వ్యవహరించిన కాలంలో రాజ్ భవన్ కు అదే పనిగా వెళ్లటమే కాదు.. గంటల కొద్దీ గవర్నర్ తో భేటీలో పాల్గొనేవారు.

దేశంలో మరే రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం గడపనంత ఎక్కువ సమయాన్ని రాజ్ భవన్ లో గడిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న మాట పలువురి నోట వినిపించేది. అలాంటి ఆయన.. గవర్నర్ గా నియమితురాలైన తమిళ సై విషయంలో ఎలా వ్యవహరిస్తారన్న దానిపై చాలానే అంచనాలు వ్యక్తమయ్యాయి. గవర్నర్ గా నియమితురాలు కాక మునుపు కరుడుగట్టిన బీజేపీ నేతగా ఉన్న ఆమెతో.. కేసీఆర్ ఎలా ఉంటారన్నది ఆసక్తిరంగా మారేది. అందరి అంచనాలకు భిన్నంగా..గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలం వరకూ మామూలుగానే ఉన్న కేసీఆర్.. ఆ తర్వాత మాత్రం రాజ్ భవన్ వైపు చూడటం మానేశారు.

గతంలో ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని నరసింహన్ తో ముచ్చటించే కేసీఆర్.. తమ ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలను చర్చించటం నిలిపివేశారని చెప్పాలి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ.. రాజ్ భవన్ కు వెళ్లారు కేసీఆర్. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య జరిగినట్లుగా చెబుతున్న సంభాషణ ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. గవర్నర్ తమిళ సై పుట్టినరోజు ఒకే రోజు కావటం ఒక విశేషంగా చెప్పాలి.

తనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పేందుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ తో గవర్నర్ ప్రస్తావించిన కొన్ని అంశాల్ని చూసినప్పుడు తెలంగాణ విషయంలో ఆమెకున్న అవగాహన ఎంతన్నది అర్థం కావటమే కాదు.. ఆమె పోలిక విన్నంతనే ఆకట్టుకునేలా ఉండటం గమనార్హం. తన పుట్టిన రోజు.. రాస్ట్ర ఆవతరణ ఒకే రోజు కావటం చాలా ఆనందంగా ఉందన్న తమిళ సై.. భారత స్వాతంత్య్రం తర్వాత అంత సుదీర్ఘంగా సాగిన ఉద్యమంగా తెలంగాణ రాష్ట్ర పోరాటం చరిత్రలో నిలుస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

సాధారణంగా ఇలాంటి మాటలు ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి రావటం.. ఎదుటి వ్యక్తులు ప్రేక్షకులుగా మారటం ఉంటుంది. అందుకు భిన్నంగా తెలంగాణ గురించి.. తెలంగాణ చాంఫియన్ గా చెప్పుకునే కేసీఆర్ కు చెప్పటం ఆసక్తికరమని చెప్పాలి. తెలంగాణ గొప్పతనం గురించి.. ఉద్యమ పోరు గురించి తరచూ చెప్పే కేసీఆర్ కే.. తమిళ సై చెప్పటం రోటీన్ కు భిన్నమైన అంశంగా చెప్పక తప్పదు.