Begin typing your search above and press return to search.

‘గాంధీ’ బాటపట్టిన కేసీఆర్.. ల‌క్ష్యం ఏంటీ?

By:  Tupaki Desk   |   19 May 2021 10:39 AM GMT
‘గాంధీ’ బాటపట్టిన కేసీఆర్.. ల‌క్ష్యం ఏంటీ?
X
ముఖ్య‌మంత్రి కేసీఆర్ బుధ‌వారం గాంధీ ఆసుప‌త్రిని సంద‌ర్శించారు. మ‌ధ్యాహ్నం వేళ ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి నేరుగా సికింద్రాబాద్ లోని గాంధీ ద‌వాఖానాకు చేరుకున్నారు. అనంతరం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న క‌రోనా బాధితుల‌తో మాట్లాడారు. వారి యోగ‌క్షేమాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి.. భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని, ధైర్యంగా ఉండాల‌ని సూచించారు.

ఆ త‌ర్వాత ఔట్ పేషెంట్ వార్డులో చికిత్స పొందుతున్న వారిని కూడా ప‌ల‌క‌రించారు. అనంత‌రం వైద్య సిబ్బంది, జూనియ‌ర్ డాక్టర్ల‌తో మాట్లాడిన ముఖ్య‌మంత్రి.. ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్ గా వారు అందిస్తున్న సేవ‌ల‌ను కొనియాడారు. ఆ త‌ర్వాత గాంధీ వైద్యుల‌తో, అధికారుల‌తో స‌మీక్షించారు. ఆక్సీజ‌న్ ల‌భ్య‌త‌, ఇన్ పేషెంట్లు, రిక‌వ‌రీ కేసుల గురించి తెలుసుకున్నారు.

అయితే.. గ‌డిచిన ఏడేళ్ల‌లో ఒక్క‌సారి కూడా గాంధీ త‌లుపు త‌ట్ట‌ని ముఖ్య‌మంత్రి.. ఉన్న‌ట్టుండి సంద‌ర్శించ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రిచింది. అయితే.. ఇది సాధార‌ణ సంద‌ర్శ‌నేమీ కాద‌ని, దానివెనుక ప్ర‌త్యేక‌మైన కార‌ణాలు కూడా ఉన్నాయ‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. క‌రోనా నేప‌థ్యంలో బాధితుల‌కు ధైర్యం చెప్పడానికి ముఖ్య‌మంత్రి నేరుగా ధ‌ర్మాసుప‌త్రికి రావ‌డం అనేది ఖ‌చ్చితంగా అభినంద‌నీయం అంటూనే.. ఈ స‌మ‌యంలోనే సంద‌ర్శించ‌డంపై ప్ర‌త్యేక‌మైన‌ విశ్లేష‌ణ‌లు చేస్తున్నారు ప‌రిశీల‌కులు.

రాష్ట్రంలో క‌రోనా కేసులు లాక్ డౌన్ ముందు వ‌ర‌కు భారీగా పెరుగుతూ వ‌చ్చాయి. అప్ప‌టి వ‌ర‌కు వైద్య‌శాఖ మంత్రిగా ఉన్న ఈట‌ల రాజేంద‌ర్ కొవిడ్ నియంత్ర‌ణ ప‌నుల్లో త‌ల‌మున‌క‌లై పోయారు. రాష్ట్రంలో అధికారుల‌తో స‌మీక్ష‌లు నిర్వ‌హించ‌డం, కేంద్రంతో మాట్లాడుతూ.. ఇక్క‌డి ప‌రిస్థితులు వివ‌రించ‌డం.. వ్యాక్సిన్ ర‌ప్పించేందుకు ప్ర‌య‌త్నించ‌డం.. అన్నీ చేస్తూ బిజీబిజీగా గ‌డిపారు.

అయితే.. ఉన్న‌ట్టుండి ఈట‌ల‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేయ‌డంతో.. రాష్ట్రంలో వైద్య‌శాఖ‌కు మంత్రి లేకుండాపోయారు. అత్య‌వ‌స‌ర‌మైన ఈ స‌మ‌యంలో హెల్త్ మినిస్ట‌ర్ లేక‌పోవ‌డం ఖ‌చ్చితంగా ప్ర‌భావం చూపే అంశ‌మే. ఈట‌ల‌ను తొల‌గించిన త‌ర్వాత వైద్య‌శాఖ‌ను త‌న‌వ‌ద్ద‌నే ఉంచుకున్నారు ముఖ్య‌మంత్రి. ఈ శాఖ ప‌రిధిలో జ‌ర‌గాల్సిన ప‌నుల‌ను మాత్రం మంత్రులు కేటీఆర్ కు, హ‌రీష్ రావుకు పంచేశారు.

రాష్ట్రంలో కొవిడ్ నియంత్ర‌ణ చ‌ర్య‌లు, స‌మీక్ష‌లు కేటీఆర్ చూస్తుండ‌గా.. కేంద్రంతో స‌మ‌న్వ‌యం చేయ‌డం.. వ్యాక్సిన్‌, ఆక్సీజ‌న్ తెప్పించ‌డం.. ఇత‌ర‌త్రా ప‌నులు హ‌రీష్ రావు ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో.. వైద్య‌శాఖ మంత్రి లేక‌పోవ‌డం అనేది చ‌ర్చ‌కు వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. దీనికి అవ‌కాశం ఇవ్వొద్ద‌ని భావించిన ముఖ్య‌మంత్రి.. గడిచిన నాలుగైదు రోజులుగా వరుస పెట్టి సమావేశాల్ని నిర్వహిండంతోపాటు.. కీల‌క‌ నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు.

ఆక్సీజన్ కోసం ఎవరి మీదా ఆధారపడకుండా భారీ ఎత్తున ఉత్పత్తి చేపడతామని చెప్పిన ముఖ్య‌మంత్రి.. వివిధ జిల్లాల్లో మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న‌ట్టు చెప్పారు. ఇప్పుడు ఉన్న‌ఫ‌ళంగా గాంధీ ఆసుప‌త్రిని సంద‌ర్శించారు. ఈ చ‌ర్య‌ల ద్వారా.. రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రి లేడ‌న్న లోటు క‌నిపించ‌కుండా చేసేందుకు ప్ర‌య‌త్నించార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రోవైపు.. హుజూరాబాద్ లో ఈట‌ల వ‌ర్సెస్ గంగుల యుద్ధం తార‌స్థాయికి చేర‌డంతో.. ప‌దే ప‌దే ఈట‌ల అంశం చ‌ర్చ‌లోకి వ‌స్తోంది. వీట‌న్నింటికీ.. గాంధీబాట ప‌ట్ట‌డం ద్వారా కేసీఆర్ చెక్ పెట్టే ప్ర‌య‌త్నం చేశార‌ని అంటున్నారు. అయితే... రాజ‌కీయ కార‌ణాలు ఎలా ఉన్నా.. ఈ క‌ష్ట కాలంలో క‌రోనా రోగుల‌కు అన్ని సౌక‌ర్యాలు స‌జావుగా అందితే.. అదే ప‌దివేలు అనడంలో సందేహం లేదు.