Begin typing your search above and press return to search.

ఎర్రబెల్లికి క్లాస్ పీకిన కేసీఆర్?

By:  Tupaki Desk   |   20 Jan 2023 3:30 PM GMT
ఎర్రబెల్లికి క్లాస్ పీకిన కేసీఆర్?
X
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారని ప్రచారం సాగుతోంది.. ఇంకోసారి ఇలాంటి కామెంట్స్ చేస్తే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించినట్టు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.. అనసవర విషయాల్లో తలదూర్చొద్దని, క్రమశిక్షణతో మెలగాలని సూచించినట్లు సమాచారం. పార్టీ పరధి దాటి వ్యాఖ్యలు చేయొద్దని కేసీఆర్ ఫోన్ ద్వారా హెచ్చరించినట్లు సమాచారం. ఇటీవల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించారు. అయితే మంత్రి చేసిన వ్యాఖ్యలతో కొందరు ఎమ్మెల్యేల్లో గుబులు పుట్టుకొస్తోంది. మంత్రి స్థాయిలో ఉన్న దయాకర్ రావు తనకు సమాచారం లేకుండానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా..? అని చర్చించుకుంటున్నారు. మొత్తంగా ఎర్రబెల్లికి కేసీఆర్ క్లాస్ పీకారన్న వార్త ఇప్పుడు మీడియాలో హల్ చల్ చేస్తోంది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఎక్కువ సమయం లేదు. ఇక తాజాగా కేసీఆర్ ముందస్తుకు వెళ్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో కొందరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆందోళన కలిగించిన విషయమే. కేసీఆర్ ఓ ప్రెస్ మీట్లో మరోసారి సిట్టింగులకే సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు. అయితే సీక్రెట్ గా సర్వే చేయించి ఎమ్మెల్యేల పనితీరును తెలుసుకున్నారు. ప్రజల్లో ఆదరణ లేని నాయకులకు టిక్కెట్లు ఇచ్చే విషయంపై ఆలోచించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇన్నర్ గా ఈ విషయం చర్చించవచ్చు. కానీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బయటపెట్టడం చర్చకు దారి తీసింది.

బీఆర్ఎస్ కు చెందిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారు. గ్రామాల్లో అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమకు అందకుండా వారి బంధువులకే కట్టబెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో కొందరు అధిష్టానానికి ఫిర్యాదు చేసినా స్పందన లేదు. మరి కొందరు ఫిర్యాదు చేయకుండా వారిని కట్టడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు రాష్ట్రంలో అవకాశం కోసం ఎదురుచూస్తున్న బీజేపీకి ఇవి వరంగా మారుతున్నారు. ఇక తాజాగా ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలతో వీటికి మరింత ఆజ్యం పోస్తున్నాయి.

నిప్పులేనిదే పొగరాదుగా.. అన్నట్లుగా పార్టీలో ఈ విషయంపై చర్చ జరిగినందునే ఎర్రబెల్లి అలాంటి వ్యాఖ్యలు చేశారని కొందరు అనుకుంటున్నారు. ఇన్నాళ్లు ఏం చేసినా ఎన్నికల వరకైనా మంచి పేరు తెచ్చుకోవాలని కొందరు ప్రజలను నేరుగా కలుస్తున్నారు. దళిత బంధు, సీఎంఆర్ ఎఫ్ లాంటి నిధులను వెంటనే రిలీజ్ చేయిస్తున్నారు. గ్రామాల్లో రోడ్లు, ఇతర సౌకర్యాలను కల్పిస్తున్నారు.

ఇక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్త కాదు. గతంలో ఓ అధికారిణిపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై వైరల్ కావడంతో ఆయనపై కొందరు తీవ్ర విమర్శలు చేశారు. ఆ తరువాత పార్టీ నాయకులపై రకరకాల కామెంట్స్ చేశారు. తాజాగా ఆయన 25 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందనడం ఆయన నోటి దూలే అనుకున్నా.. ఆ తరువాత తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని కవర్ చేశారు.కానీ ఆయన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకొని టిక్కెట్ల విషయంలో కొందరు ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. వచ్చే సరికి తమకు ఎక్కడ టికెట్ దక్కకపోతే ప్రత్యామ్నాయం ఎలా అని ఆలోచిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.