Begin typing your search above and press return to search.

సీజేఐ చిరకాల కోరిక కేసీఆర్ కు చెబితే ఏం చెప్పారు?

By:  Tupaki Desk   |   16 Jun 2021 5:30 PM GMT
సీజేఐ చిరకాల కోరిక కేసీఆర్ కు చెబితే ఏం చెప్పారు?
X
ఆయన అలాంటి ఇలాంటి వ్యక్తి కాదు. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి. అలాంటి ఆయనకు ఒక చిరకాల కోరిక ఉండటం.. దాన్ని తీర్చుకునే దిశగా తాజాగా అడుగు వేశారు. ఈ విషయాన్ని మరెవరో కాదు.. ఆయనే చెప్పారు. తన తాజా ట్రిప్ లో వివిధ వర్గాల వారితో భేటీ అవుతున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ తాజాగా లీగల్ రిపోర్టర్ల (మీడియాలో కోర్టు వార్తల్ని కవర్ చేసే రిపోర్టర్లు ప్రత్యేకంగా ఉంటారు)తో భేటీ అయ్యారు. ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన తన మనసులోని మాటను చెప్పారు. తనకు చిరకాలంగా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఉందని.. అది కూడా హైదరాబాద్ లో అని పేర్కొన్నారు. తన చిరకాల స్వప్నాన్ని తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెప్పానని.. అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. అన్ని రకాలుగా అనుకూలమైన వాతావరణం.. సదుపాయాలు ఉన్న హైదరాబాద్ ఆ కేంద్రానికి అనువైదన్నది తన అభిప్రాయంగా చెప్పారు.

ఆ కేంద్రాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తే.. అంతర్జాతీయ వివాదాల్ని పరిష్కరించటంలో నగరం కీలకమవుతుంది. కోర్టుల్లో కేసులు పేరుకుపోవటంతో వ్యాపార లావాదేవీల్లో వివాదాలు త్వరగా పరిష్కారం కావటం లేదు. దీంతో పలు అంతర్జాతీయ సంస్థలు దేశంలో పెట్టుబడులు పెట్టటానికి ఇష్టపడటం లేదన్నారు. ఈ సందర్భంగా ఏమైనా వివాదాలు తలెత్తితే.. వాటిని పరిష్కరించుకోవటం కోసం సింగపూర్ వెళ్లాల్సి వస్తోందన్నారు. ఇందుకోసం భారీ వ్యయ ప్రయాసలు తలెత్తుతున్నట్లు చెప్పారు.

అదే ఆర్బిట్రేషన్ కేంద్రం హైదరాబాద్ లో ఏర్పాటైతే.. అంతర్జాతీయ ఆర్బిట్రేటర్లు నగరానికి వస్తారని.. వారి బసకు అవసరమైన మంచి హోటళ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. తాను ఇప్పటికే సింగపూర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుందరేశ్ మీనన్ తో ఈ విషయాల్ని చెప్పానన్నారు. తన పదవీకాలం పూర్తి అయ్యే లోపు అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నిస్తానని చెప్పారు. సో.. హైదరాబాద్ మహానగర మణిహారంలో మరోఅత్యుత్తమ కేంద్రం కొద్ది నెలల్లో రాబోతుందన్న మాట.