Begin typing your search above and press return to search.

యాదాద్రి టూర్ చూశాక.. సారు ఆరోగ్యం మీద ఎవరూ కామెంట్ చేయరంతే

By:  Tupaki Desk   |   5 March 2021 6:30 AM GMT
యాదాద్రి టూర్ చూశాక.. సారు ఆరోగ్యం మీద ఎవరూ కామెంట్ చేయరంతే
X
తరచూ కాకున్నా.. క్రమపద్దతిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అనారోగ్యంతో ఉన్నట్లుగా ప్రచారం జరిగే విషయం తెలిసిందే. అయితే.. ఇలాంటి మాటలకు చెల్లుచీటి ఇవ్వాల్సిన టైం వచ్చేసింది. చెప్పే మాటలకు ఏ మాత్రం సంబంధం లేని రీతిలో సీఎం సారు ఎంత ఫిట్ గా ఉన్నారన్న విషయం తాజాగా ఆయన యాదాద్రి టూర్ ను చూస్తే అర్థమవుతుంది. హెలికాఫ్టర్ లో హైదరాబాద్ నుంచి యాదాద్రి వచ్చిన ఆయన.. రోడ్డు మార్గంలో కొండ మీదకు చేరుకున్నారు.

యాదాద్రి దేవాలయ పనులు దాదాపుగా పూర్తి అయిపోయి.. ప్రారంభానికి సమయం దగ్గర పడుతున్న వేళ.. అన్ని పనుల్ని సూక్ష్మంగా పరిశీలించేందుకు ఆయన వెచ్చించిన సమయం చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. ఎందుకంటే.. మధ్యాహ్నం12.08గంటలకు యాదాద్రికి వచ్చిన ఆయన.. కాసేపటికే కొండ మీదకు వచ్చారు. దాదాపుగా ఆరు గంటల పాటు.. గుడిలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ.. వాటి వివరాల్ని అడుగుతూ.. చేయాల్సిన పనుల గురించి గుక్క తిప్పుకోకుండా చెప్పిన వైనం చూస్తే.. యాదాద్రి విషయంలో ఆయనకున్న స్పష్టతకు ఆశ్చర్యం చెందాల్సిందే.

అంతేకాదు.. ఇప్పటికి పూర్తి కాని పనుల్ని పూర్తి చేయటానికి.. రిఫెరెన్సుగా వేటిని చూడాలన్న విషయాన్ని చెప్పేయటమే కాదు.. అందుకు అవసరమైన ఆదేశాల్ని జారీ చేయటం గమనార్హం. ముఖ్యమంత్రి హోదాలో యాదాద్రికి పద్నాలుగోసారి వచ్చిన కేసీఆర్.. ఈసారి ఏకంగా ఆరు గంటల పాటు ఆలయ నిర్మాణ పనుల్ని పరిశీలించటం.. సలహాలు.. సూచనలు ఇవ్వటం విశేషం.

నిర్మాణ పనుల్లో ఇప్పటికే 90 శాతం పూర్తి కావటంపై ముఖ్యమంత్రి సంతోషాన్ని వ్యక్తం చేస్తూనే.. మరికొన్ని పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని వెంటనే నివారించాలని.. అందుకేం చేయాలో చెప్పుకొచ్చారు. నర్సింహుడి దర్శనానికి వచ్చే భక్తులకు వైకుంఠ పుణ్యక్షేత్రంలో ఉన్న అనుభూతి కలిగించాలని.. దేశంలోని ఆలయాలకు యాదాద్రి ఆదర్శంగా ఉండేలా చూడాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. విద్యుత్ దీపాల కాంతిలో దేదీప్యమానంగా వెలగాలని చెప్పారు. ఆలయ స్వచ్ఛత.. పరిశుభ్రత విషయంలో దేశంలోని ఇతర ఆలయాలకు యాదాద్రి ఆదర్శంగా ఉండాలని.. అందుకు అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలని చెప్పారు. తాజా యాదాద్రి టూర్ లో కేసీఆర్ ప్రదర్శించిన హుషారు.. చురుకుదనం.. ఏ మాత్రం అలసట చెందకుండా ఆరు గంటల పాటు నాన్ స్టాప్ గా తిరుగుతూ సలహాలు.. సూచనలు ఇచ్చిన వైనం చూస్తే.. ఆయనెంత ఆరోగ్యంగా ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుందని చెబుతున్నారు. ఆయనకు అనారోగ్యం అని ప్రచారం చేసే వారికి చెంపదెబ్బగా అభివర్ణించారు.