Begin typing your search above and press return to search.
చంద్రబాబుకు షాకిచ్చిన ఒడిశా సీఎం!
By: Tupaki Desk | 2 Jun 2018 11:34 AM GMTఆంధ్రప్రదేశ్ కు జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఏపీ సర్కార్ ప్రయత్నిస్తోంది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరానికి కేంద్రం సకాలంలో నిధులు చెల్లించాలని ఏపీ సీఎం చంద్రబాబు విన్నపాలు చేస్తున్నారు. మరోపక్క, పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు సర్కార్ అనుయాయులకే కొన్ని కాంట్రాక్టులు దక్కుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఆ ప్రాజెక్టులో వందల కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరో ఏడాదిలో ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో ఏపీలో పోలవరం కల ఎప్పటికి నెరవేరుతుందో తెలియని అయోమయ పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ షాకిచ్చారు. పోలవరం ప్రాజెక్టు పనులు తక్షణమే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్థన్ కు నవీన్ పట్నాయక్ లేఖ రాయడం తీవ్ర కలకలం రేపింది.
పట్టిసీమ తరహాలోనే ఎలాగోలా పోలవరాన్ని పూర్తి చేసి ఆ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకోవాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఎన్డీఏ, బీజేపీతో తెగదెంపులు చేసుకోవడంతో ప్రస్తుతం కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎటువంటి సహకారం అందడం లేదు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకు నవీన్ పట్నాయక్ షాకిచ్చారు. ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు పనులను వెంటనే ఆపివేయాలని కోరుతూ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్థన్ కు లేఖ రాశారు. ఆ ప్రాజెక్టు వల్ల ఒడిశా అనేక సమస్యలు ఎదుర్కోబోతోందని, వాటిని పరిష్కరించిన తర్వాతే నిర్మాణ పనులకు అనుమతినివ్వాలని నవీన్ పట్నాయక్ కోరారు. ముంపు, పునరావాసం తదితర అంశాలపై స్పష్టత వచ్చేవరకు పనులను కొనసాగించవద్దని లేఖలో కోరారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే కొన్ని ప్రాంతాలను ఒడిశావాసులు శాశ్వతంగా నష్టపోతారని పేర్కొన్నారు. గతంలోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పోలవరం అంశంపై నవీన్ పట్నాయక్ రెండు సార్లు లేఖ రాసిన సంగతి తెలిసిందే.