Begin typing your search above and press return to search.

బిహార్ లో ఎవరి బలం ఎంత? కొత్త పొత్తు ఎంత సేఫ్?

By:  Tupaki Desk   |   9 Aug 2022 11:30 AM GMT
బిహార్ లో ఎవరి బలం ఎంత? కొత్త పొత్తు ఎంత సేఫ్?
X
బీజేపీ తనను అవమానించిందన్న పేరుతో నితీశ్ తెర తీసిన రాజకీయం.. మోడీషాలకు దిమ్మ తిరిగిపోయి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసిందని చెప్పాలి. ఇప్పటివరకు పద్దెనిమిది రాష్ట్రాల్లో అధికారపక్షంగా ఉన్న బీజేపీ.. బిహార్ లాంటి పెద్ద రాష్ట్రంలో అధికారపక్షంగా కాకుండా ప్రతిపక్షంగా మారాల్సిన పరిస్థితి. రాజకీయాల్లో శాశ్విత మిత్రులు.. శత్రువులు ఉండరన్న దానికి నిదర్శనంగా కొత్త పొత్తు పొడిచినట్లుగా చెప్పాలి. ఇంతకాలం బీజేపీతో చెట్టాపట్టాలేసుకున్న నితీశ్ అండ్ కో.. ఇకపై కాంగ్రెస్.. ఆర్జేడీలతో కలిసి కాపురం చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఇంతకీ ఈ పొత్తు వర్కువుట్ అవుతుందా? ఎవరి బలం ఎంత? బిహార్ లో మేజిక్ ఫిగర్ ఎంత? కొత్త పొత్తులతో నితీశ్ సర్కారు ఎంతవరకు సేఫ్ అన్న విషయాల్లోకి వెళితే.. బీజేపీతో పొత్తు పెట్టుకొని సాగించిన సర్కారుతో పోలిస్తే.. కాంగ్రెస్.. ఆర్జేడీలతో కలిసి జేడీయూ నేత నితీశ్ ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం మరింత బలమైనదిగా చెప్పాలి. ఇక్కడ.. బలం అంటే ఎమ్మెల్యేల సంఖ్యగా చెప్పాలి.

బిహార్ లో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 243 కాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికిక అవసరమైన మేజిక్ ఫిగర్ 122 మంది ఎమ్మెల్యేలు. జేడీయూతో కూడిన ఎన్డీయే కూటమికి 122 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అలా కాకుండా కేవలం బీజేపీకి మాత్రమే ఉన్న ఎమ్మెల్యేలు 77 మంది మాత్రమే. అదే సమయంలో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న నితీశ్ కుమార్ ప్రాతినిధ్యం వహించే జేడీయూకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య కేవలం 45 మాత్రమే. కాకుంటే.. నితీశ్ కున్న ప్రజాదరణతో ఆయన సీఎంగా ఉన్నారు.

తాజాగా కొత్త పొత్తు విషయానికి వస్తే.. జేడీయూకు ఉన్న 45 మంది ఎమ్మెల్యేలకు లాలూ ప్రసాద్ యాదవ్ కు చెందిన ఆర్జేడీకి ఉన్న 79 మంది ఎమ్మెల్యేలతో పాటు.. కాంగ్రెస్ పార్టీకి 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీని దెబ్బ తీయటమే లక్ష్యంగా పని చేసే కమ్యునిస్టులకు 16 మంది ఎమ్మెల్యేలు ఉంటే.. హిందుస్తానీ అవామ్ మోర్చాకు నలుగురు.. ఎంఐఎంకు ఒక ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే.. కొత్త పొత్తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. నితీశ్ ప్రభుత్వానికి 143 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు.

ఒకవేళ కమ్యునిస్టులు కూడా కలుపుకుంటే.. వారి బలం 159 అవుతుంది. ఒకవేళ కమ్యునిస్టుల అండ లేకున్నా 143 మంది. అంటే.. ప్రభుత్వానికి అవసరమైన దాని కంటే 21 మంది ఎమ్మెల్యేలు అదనంగా ఉన్నట్లు.

అదే కమ్యునిస్టులను కూడా కలుపుకుంటే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన దాని కంటే అదనంగా 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు. అంటే.. బీజేపీ మిత్రుడిగా ఉంటూ ప్రభుత్వాన్ని రన్ చేసే నితీశ్ ప్రభుత్వం కంటే కూడా తాజా పొత్తు మరింత బలమైనది మాత్రమే కాదు సేఫ్ కూడా. మొత్తానికి అంకెల బలంతో ఆటాడేసుకుంటున్న నితీశ్ దెబ్బకు మోడీషాలకు దిమ్మ తిరిగిపోయినట్లే అన్న మాట వినిపిస్తోంది.