Begin typing your search above and press return to search.

సారు ప్రెస్ మీట్ అంటే చాలు.. టీవీలకు అతుక్కుపోతున్నారట

By:  Tupaki Desk   |   27 April 2020 5:00 AM GMT
సారు ప్రెస్ మీట్ అంటే చాలు.. టీవీలకు అతుక్కుపోతున్నారట
X
మాటల మరాఠి గా పేరున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పతనాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎవరైనా ఏదైనా చెప్పటం మొదలు పెట్టినప్పుడు ఆసక్తికరంగా ఉన్నా.. అరగంట దాటితే బోర్ కొట్టటం మొదలవుతుంది. కానీ.. కేసీఆర్ మాట్లాడటం షురూచేస్తే.. అది గంట అయినా.. రెండు గంటలైనా.. అంతకు పైనే అయినా బోర్ కొట్టదు సరికదా.. మరికాసేపు మాట్లాడితే బాగుంటుందన్న భావన కలుగుతుంది.

ఒక ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ సుదీర్ఘంగా సాగితే బోర్ గా ఫీల్ అవుతుంటారు. దీనికి మినహాయింపుగా కేసీఆర్ ప్రెస్ మీట్ గా చెప్పాలి. శాస్త్రసాంకేతిక అంశాల్ని సైతం అరటి పండు ఒలిచినట్లుగా చెప్పే తీరు ఆయన సొంతం. దీంతో.. ఆయన మాట్లాడుతున్నంత సేపు టైంను పట్టించుకోకుండా టీవీని చూస్తూ ఉండి పోవటం తెలిసిందే. కరోనా వేళ.. తరచూ ఆయన పెడుతున్న ప్రెస్ మీట్లను రాష్ట్రాలకు అతీతంగా ఫాలో కావటం ఈ మధ్యన పెరిగింది.

ప్రపంచ వ్యాప్తంగా తెలుగోళ్లంతా కేసీఆర్ ప్రెస్ మీట్ ను ఫాలో కావటం ఈ మధ్యన ఎక్కువైంది. ఇదే విషయాన్ని తాజాగా మంత్రి కేటీఆర్ చెబుతున్నారు. ఒకప్పుడు కేసీఆర్ ను తిట్టినోళ్లు సైతం ఆయన్ను ఇప్పుడు పొగిడేస్తున్నారని.. కేసీఆర్ మీడియా సమావేశాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగోళ్లు చూస్తున్నారని చెబుతున్నారు. కేసీఆర్ ప్రెస్ మీట్ అన్నంతనే టీవీలకు అతుక్కుపోయి చూస్తున్నారని.. ఆయనేం చెబితే అది చేస్తున్నారన్నారు.

కేసీఆర్ చికెన్ తినమంటే తింటున్నారని.. బత్తాయిలు తినాలంటే తింటున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మరో పదిహేను.. ఇరవై ఏళ్లు కేసీఆర్ నాయకత్వం అవసరమన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమాన్ని లక్ష్యం దిశగా నడిపిన కేసీఆర్ పై పుస్తకాలు.. పీహెచ్ డీలు వస్తాయని చెప్పారు కేటీఆర్. కేసీఆర్ విజయాలు.. రెండు దశాబ్దాల ప్రస్థానాన్ని రాబోయే రోజుల్లో ఎంతోమంది అధ్యయనం చేస్తారన్న కేటీఆర్.. ఒకప్పుడు సినిమాల్లో జోకర్ పాత్రలకే పరిమితమైన తెలంగాణ భాష.. యాస ఇప్పుడు ప్రధాన స్రవంతిలో భాగమైందన్నారు. తెలంగాణ యాసలో రేడియోలు.. టీవీల్లో ధారాళంగా మాట్లాడుతున్నారని.. సినిమాలు వస్తున్నాయన్నారు.