Begin typing your search above and press return to search.

ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం నష్టపోయేదట...

By:  Tupaki Desk   |   2 Nov 2016 8:05 AM GMT
ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం నష్టపోయేదట...
X
తిమ్మిని బమ్మిచేయడంలో సిద్ధహస్తులైపోయిన టీడీపీ నేతల మాటలు చూసి జనం నవ్వుతున్నారు. ప్రత్యేక హోదా వల్ల చాలానష్టమని... అది రాకపోవడం వల్ల బతికిపోయామని టీడీపీ మంత్రులు - ఎంపీలు చెబుతుండడంతో వీరు ప్రజాప్రతినిధులేనా? లేకా ఇంకేమైనానా? అని అంటున్నారు. తాజాగా ప్రత్యేక హోదాపై టీడీపీ ఎంపీ సీఎం రమేష్ నాయుడు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి.

జమ్మలమడుగు నియోజకవర్గంలో జరిగిన టీడీపీ జన చైతన్య యాత్రలో పాల్గొన్న సీఎం రమేష్.. ప్రత్యేక హోదా రాకపోవడమే మంచిదైందని ఒక వేళ వచ్చి ఉంటే రాష్ట్రం బాగా నష్టపోయేదన్నారు. హోదా వచ్చినా వచ్చే ఏడాది అది రద్దు అయిపోయేదన్నారు. 80 శాతం మంది ప్రజలు టీడీపీ వైపే ఉన్నారని చెప్పారు. ఉప ఎన్నికలను రెఫరెండంగా తీసుకునేందుకు సిద్ధమన్నారు. ఎప్పుడో ఎందుకు వైసీపీ ఎంపీలు ఇప్పుడే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. కడప జిల్లాలో టీడీపీకి పూర్వవైభవం రాబోతోందన్నారు. ఆదినారాయణరెడ్డి - రామసుబ్బారెడ్డి కలిసిపోయారని ఇక జగన్ కలలు కల్లలైపోవడం ఖాయమని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గంటా శ్రీనివాస్‌ రావు చెప్పారు. టీడీపీ చేస్తున్న అభివృద్ధిని చూడలేక రాక్షసులు యజ్ఞానికి అడ్డుపడినట్టు వైసీపీ అడ్డుపడుతోందని విమర్శించారు. టీడీపీకి జమ్మలమడుగును కంచుకోటగా మార్చాలన్నారు.

ఎంపీ - మంత్రిని చూసి ఇన్ స్పైర్ అయ్యారో ఏమో కానీ లోకల్ ఎమ్మెల్యే - ఫిరాయింపు నేత ఆదినారాయణ రెడ్డి కూడా ప్రత్యేక హోదా వేస్టని అనేశారు. ప్రత్యేక హోదా బిర్యానీలాంటిదని... కానీ, కేంద్రం బిర్యానీ బదులు మాంసం - చికెన్ - చేపల కూర ఇలా సకలం వేర్వేరుగా చేసి పెడుతుంటే వద్దని... కేవలం బిర్యానీ చాలాంటున్నట్లుగా జగన్ బిహేవ్ చేస్తున్నారని చెప్పారు. జగన్‌ మూర్ఖంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదా ఇక రాదని.. కాబట్టి ఇకపై హోదా గురించి జగన్ మాట్లాడడం మానుకోవాలని సూచించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/