Begin typing your search above and press return to search.

వెంకయ్యకు అండ సరే..మీ సంగతేంటి తమ్ముడు?

By:  Tupaki Desk   |   29 July 2016 4:56 AM GMT
వెంకయ్యకు అండ సరే..మీ సంగతేంటి తమ్ముడు?
X
తెలంగాణ నేతలకు.. ఏపీ నేతలకు మధ్య వ్యత్యాసం ఏమిటో మరోసారి స్పష్టంగా కనిపించింది. తెలంగాణ నేతలు ఎవరైనా.. ఎన్ని మొహమాటాలు ఉన్నా.. మొదట తమ ప్రజల ప్రయోజనాలే తప్పించి మరింకేమీ ముఖ్యం కాదన్నట్లుగా వ్యవహరిస్తారు. తమ ప్రజల ప్రయోజనాలు దెబ్బ తింటుంటే.. అవతల వైపు ఎవరున్నది కూడా పట్టించుకోకుండా కోట్లాడతారు. కానీ.. ఏపీ నేతల్లో అలాంటిది ఉందన్నవిమర్శకు మరింత బలం చేకూర్చే ఘటన చోటు చేసుకుంది. ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా.. అన్ని పార్టీ నేతలు వెంకయ్యను టార్గెట్ చేసి.. నాడు రాజ్యసభలో ఐదేళ్లు కాదు.. పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామంటూ బడాయి మాటల్ని ప్రస్తావించి ఎద్దేవా చేశారు.

తమకు కొండంత అండ లాంటి వెంకయ్యపై అన్నేసి మాటలు అంటారా అని ఫీలయ్యారో ఏమో కానీ.. ఆయనకు ఫుల్ సపోర్ట్ ఇస్తూ.. ఆయన్ను కవర్ చేస్తూ.. ఆయన వీరత్వాన్ని పొగిడేస్తూ ప్రసంగించారు తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై చర్చకు.. ఏపీకి హోదా కావాలన్న మాటను బలంగా వినిపించే బదులుగా.. వెంకయ్య గొప్పతనం..ఆయన ఏపీకి ఎంతసాయం చేశారన్న మాటల్ని చెప్పుకోవటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం గమనార్హం.

నిజంగా చెప్పాలంటే.. ఏ బీజేపీ నేత కూడా వెంకయ్యను అంతలా పొగడరేమో. కమలనాథులు సైతం చేయలేని పనిని రాజ్యసభ సాక్షిగా పూర్తి చేసిన సీఎం రమేశ్ మాటలు విన్నప్పుడు ఆంధ్రోడి గుండె మండుతుంది. కోట్లాది మంది ప్రయోజనాల గురించి నిర్మోహమాటంగా మాట్లాడాల్సిన వేళ.. అందుకు భిన్నంగా వెంకయ్యను వెనకేసుకొస్తూ మాట్లాడటం ఏమిటన్న ప్రశ్న వినిపిస్తోంది. విభజన జరిగిన తీరును తప్పు పట్టిన ఆయన.. ఏపీకి అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో వెంకయ్య గళం విప్పారని.. అదే ఆయన చేసిన తప్పుగా ఇప్పుడు ఆయన్ను వేలెత్తి చూపటం సరికాదన్నట్లుగా సీఎం రమేశ్ మాటలు ఉండటం గమనార్హం.

పోలవరం కింద ముంపు మండలాలు తెలంగాణలో ఉంటే.. ఆ మండలాల్ని ఏపీలో కలపాలని.. లేకుంటే తాను ఏపీ ప్రజలకు సమాధానం చెప్పలేనని చంద్రబాబు వెంకయ్యు స్పష్టం చేయటంతో రాత్రికి రాత్రి వెంకయ్య జైట్లీ వద్దకు వెళ్లి ఆ అంశాన్ని కేబినెట్ లో పెట్టారని.. వెంకయ్య రాష్ట్రపతి వద్దకు వెళ్లి సంతకం తీసుకొచ్చాకే చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన విషయాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేశారు. హోదా గురించి చంద్రబాబు అడగలేదని కొందరు అంటున్నారని.. ఏ సీఎం కూడా ఢిల్లీకి ఇన్నిసార్లు రాలేదని.. ప్రధాని.. వెంకయ్య.. జైట్లీ.. రాజ్ నాథ్ లను కలిసి వినతులు చేస్తున్నారన్నారు. మరి.. రాజ్యసభ సాక్షిగా ఏపీ ప్రయోజనాల్ని గాలికి వదిలేసి.. వెంకయ్యను అదే పనిగా పొగుడుతూ పిసుకుంటే.. ఎన్ని వేలసార్లు ఢిల్లీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చినా హోదా రాదన్న విషయం సీఎం రమేశ్ కు ఎందుకు అర్థం కాదు. ఏపీ ప్రయోజనాల్ని బలి పెట్టి మరీ వెంకయ్యను పొగిడేసిన సీఎం రమేశ్ కు.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీకి దన్నుగా నిలిచే వారు ఎవరు? అన్న ప్రశ్న తెలుగు తమ్ముళ్ల మదిలో మెదలదా..? అవగాహనా రాహిత్యమా? బరితెగింపా..?