Begin typing your search above and press return to search.

చిదంబరాన్ని కడిగేసిన సీఎం రమేశ్

By:  Tupaki Desk   |   4 Aug 2016 4:21 AM GMT
చిదంబరాన్ని కడిగేసిన సీఎం రమేశ్
X
చేసిన పాపం ఊరికే పోదు. అధికారంలో ఉన్నామన్నఅహంకారంతో ఏం చేసినా నడుస్తుందంటూ వ్యవహరించే వారికి తర్వాతి కాలంలో షాకులు తప్పవు. పదేళ్ల యూపీఏ హయాంలో చిదంబరం తంబిగారి హవా ఏ రకంగా సాగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏపీ విభజన బిల్లు తయారీలో సవాలచ్చ లోపాలకు చిదంబరం మాష్టారు ఎంతగా పుణ్యం కట్టుకున్నారో తెలిసిందే. అలాంటి పెద్ద మనిషి తాజాగా నీతులు చెప్పే ప్రయత్నం చేశారు. జీఎస్టీ సవరణల బిల్లుపై చర్చ సందర్భంగా.. ఈ అంశంపై చర్చ జరగాలంటూ ఫిట్టింగ్ పెట్టే ప్రయత్నం చేశారు.

చిదంబరం ప్రసంగం అయ్యాక మైకు అందుకున్న తెలుగుదేశం ఎంపీ సీఎం రమేశ్ ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జీఎస్టీ బిల్లుపై చర్చ కావాలంటున్న చిదంబరం.. నాడు ఏపీ విభజన బిల్లుపై లోక్ సభలో ఎందుకు చర్చ జరపలేదని సూటిగా ప్రశ్నించారు. లోక్ సభ తలుపులు వేసి.. లైవ్ కట్ చేసి.. ఎలాంటి చర్చ లేకుండా.. గందరగోళం మధ్యన ఏపీ బిల్లుకు ఆమోదం తెలిపిన వైనాన్ని గుర్తు చేస్తూ కడిగిపారేశారు.

మీకు ఒక న్యాయం.. మాకు ఒక న్యాయమా? అంటూ ప్రశ్నించిన సీఎం రమేశ్ మాటలకు చిదంబరం నుంచి ఎలాంటి సమాధానం రాని పరిస్థితి. జీఎస్టీ బిల్లును తెలుగుదేశం పార్టీ ఆహ్వానిస్తుందంటూనే.. కొత్త పన్నుల విధానంతో రాష్ట్రానికి జరిగే నష్టాన్నీకేంద్రమే పూడ్చాలన్నారు. రాజ్యసభలో కానీ.. లోక్ సభలో కానీ.. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒకసీనియర్ నేతపై విభజన వ్యవహారాన్ని ఇంత సూటిగా ప్రశ్నిస్తూ కడిగేసిన వైనం ఇప్పటివరకూ లేదనే చెప్పాలి. అది కూడా టైమ్ ​చూ​సుకొని.. చిదంబరం నోటి నుంచి మాట వచ్చాక ఆయనకు కౌంటర్ ఇచ్చేలా సీఎం రమేశ్ చేసిన వ్యాఖ్యలు పలువురిని ఆకట్టుకున్నాయి. అధికారంతో ఏమైనా చేయొచ్చన్నట్లుగా వ్యవహరిస్తే.. తర్వాతి కాలంలో ఎన్ని మాటలు పడాల్సి ఉంటుందన్న విషయం రాజకీయ పార్టీలకు తాజా ఉదంతం ఒక పాఠంగా తాజా ఉదంతాన్ని చెప్పొచ్చు.