Begin typing your search above and press return to search.

బాస్ అంటే బాబే : టీడీపీ టచ్ లోకి సీఎం రమేష్...?

By:  Tupaki Desk   |   26 July 2022 4:06 AM GMT
బాస్ అంటే బాబే : టీడీపీ టచ్ లోకి సీఎం రమేష్...?
X
ఆయన పేరులోనే సీఎం ఉంది. అంతే ఆయన శాశ్వత సీఎం అన్న మాట. ఆ హోదా చాలు. దానికి తగినట్లుగా సీఎం రమేష్ కి రాజకీయ అవకాశాలు బాగానే వచ్చాయి. రెండు సార్లు రాజ్యసభ మెంబర్ అంటే మాటలు కాదు. ఆ చాన్స్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మరి పాత బంధాలు ప్రేమలు ఎక్కడికి పోతాయి. అందుకే ఈ రోజు బీజేపీలోకి ఫిరాయించి ఆ పార్టీ సభ్యుడిగా ముద్రపడినా కూడా రమేష్ బాస్ అంటే బాబే అని మనసులో చాలా గొప్పగా చెప్పుకుంటున్నారుట.

నిజానికి సీఎం రమేష్ కి తెలుగుదేశం లో ఒక మంచి ప్లేస్ ఉంది. ఆయన చంద్రబాబు కుడిభుజంగా పేరు పొందారు. మరో వైపు సుజనా చౌదరి కొమ్ము కాస్తే ఇవతల రమేష్ పేరే బాబు నాడు తలచేవారు అంటారు. ఈ ఇద్దరే టీడీపీని 2004 నుంచి 2014 దాకా విపక్షంలో ఉన్నపుడు చెడ్డగా రోజులు గడచినపుడు ఒక లెక్కన కాపు కాశారని, అన్ని విధాలుగా అండగా చూసుకున్నారని అంటారు.

అలాంటి వారిద్దరూ 2019 లో టీడీపీ ఓడిపోగానే ఆ పార్టీని వీడి వెళ్ళిపోయారు. వీరికి మరో ఇద్దరు రాజ్యసభ మిత్రులు టీడీపీ ఎంపీలు టీజీ వెంకటేష్, గరికపాటి మోహనరావు తోడయ్యారు. అంతా కలసి తమదే అసలైన టీడీపీ అని బోర్డు తిప్పేసి మరీ బీజేపీలో చేరిపోతే దానికి రాజ్యసభ చైర్మన్ హోదాలో వెంకయ్యనాయుడు రాజముద్ర వేశారు. అలా వీరంతా ఓవర్ నైట్ బీజేపీ ఎంపీలు అయిపోయారు. ఏపీలో ఏ మాత్రం బలం లేని బీజేపీకి అలా ముగ్గ్గురు ఎంపీలు పుట్టుకు వచ్చారన్న మాట.

అయితే చంద్రబాబే వారిని తన వ్యూహంలో భాగంగా పంపారు అని అంటారు. మరి ఈ వ్యూహాలు వీరి లక్ష్యాలు నెరవేరాయో లేదో కానీ ఈ లోగానే ముగ్గురు ఎంపీలు రిటైర్ అయ్యారు. ఇపుడు ఏపీకి చెందిన అధికారిక బీజేపీ ఎంపీ ఎవరూ అంటే సీఎం రమేష్ అనే చెప్పాలి. ఆయన పదవీకాలం 2024 ఏప్రిల్ వరకూ ఉంది. అయితే ఆయన తాజాగా తన రాజకీయ వ్యూహాన్ని పదును పెట్టారని అంటున్నారు.

నాడు వేసుకున్న అంచనాలు ఏంటో కానీ ఏపీలో బీజేపీ ఎత్తిగిల్లే సీన్ కనిపించడంలేదు. అదే టైమ్ లో ఉన్నంతలో టీడీపీ పుంజుకుంది. కష్టపడితే అధికారంలోకి వచ్చే సీన్ అయితే ఉంది. దాంతో మళ్లీ పాత బాస్ లోకి టచ్ లోకి రమేష్ వెళ్ళినట్లుగా ప్రచారం సాగుతోంది. తన పదవీకాలం అయిపోయానే మెల్లగా టీడీపీలో చేరి చక్రం తిప్పాలని కూడా రమేష్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. దానికి రెండేళ్ళు ముందుగానే బాబుతో పూర్వపు సాన్నిహిత్యాన్ని పునరుద్ధరించుకున్నారని అంటున్నారు.

టీడీపీకి కూడా సీఎం రమేష్ లాంటి వారి అండ అవసరం ఇపుడు. దాంతో అటూ ఇటూ అవసరాలు తీరేలే ఈ కలయికలు ఉంటాయని అంటున్నారు. సరే చాప కింద నీరులా ఆ పార్టీలో ఇది జరుగుతోందో ఏమో తెలియదు కానీ విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ఈ మధ్య బాంబు పేల్చడంతో రమేష్ వార్తల్లోకి వచ్చారు. సీఎం రమేష్ లాంటి వారి మాటలనే చంద్రబాబు వింటారని, వారు ఏపీలో టీడీపీకి ఏక్ నాధ్ షిండేలు అని కూడా కేశెనేని విసుర్లు విసిరారు.

దానికి పేరు పెట్టకుండా రమేష్ కూడా కౌంటర్ వేశారు కానీ ఇపుడు టీడీపీ లోపలా బయటా ఒక్కటే చర్చ సాగుతోంది. మళ్లీ రమేష్ టీడీపీలో రీ ఎంట్రీ ఇస్తున్నారా అన్నదే ఆ చర్చ. కేశినేని కామెంట్స్ మీద టీడీపీ నుంచి ఏ ఒక్కరూ రియాక్ట్ కాకపోవడంతో దానికి బలాన్ని ఇస్తోంది. ఏది ఏమైనా బాస్ అంటే మా బాబే అంటూ సీఎం రమేష్ రాగం అందుకుంటే ఆయన్ని ఆపేదెవరు. ఆయన రాజకీయాన్ని టీడీపీలో అడ్డుకునేది ఏవరు.